సాక్షి, రంగారెడ్డి జిల్లా: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గర పడుతుండటంతో టీఆర్‌ఎస్ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న ఆ పార్టీ.. ఈనెల 8న వికారాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో భారీ బహిరంగ సభ తలపెట్టింది. చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలన్న లక్ష్యంగా పెట్టుకుంది. 8న సాయంత్రం 4 గంటలకు జరిగే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
సభ ఏర్పాట్లపై బుధవారం హైదరాబాద్‌లో చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డితో పాటు పలువురు నాయకులతో సమీక్ష నిర్వహించారు. సభను విజయవంతం చేసే బాధ్యతలను ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి గట్టు రాంచంద్రరావు, కరిమెల బాబూరావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డికి అప్పగించారు. భారీ స్థాయిలో జన సమీకరణ చేయాలని కేటీఆర్ సూచించారు. సభకు హాజరయ్యేవారికి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్త వహించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment