మంత్రుల గ్రాఫ్ ఢమాల్!
అధికార టీఆర్‌ఎస్ సర్వేల్లో వెల్లడి
♦ ప్రజాదరణలో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్
♦ కేటీఆర్, తలసాని సహా పది మందికి తగ్గిన గ్రాఫ్
♦ హరీశ్, పోచారం, ఈటలకు పెరిగిన మద్దతు
♦ సర్వేల నివేదికలను మంత్రులు, ఎమ్మెల్యేల ముందు పెట్టిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనూహ్యమైన ప్రజాదరణతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దూసుకుపోతుండగా... ఆయన మంత్రివర్గంలోని మెజారిటీ మంత్రులు మాత్రం జనం మద్దతు కోల్పోతున్నారు. ముగ్గురు మంత్రులు మాత్రం తమ గ్రాఫ్‌ను బాగా పెంచుకున్నారు. టీఆర్‌ఎస్ అధినాయకత్వం మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై వారి నియోజకవర్గాల్లో చేయించిన సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. దాదాపు ఏడాది కింద ఒక సంస్థతో సర్వే చేయించగా.. తాజాగా ఇటీవల మరో సంస్థతో సర్వే చేయించారు. ఈ రెండు సర్వేల ప్రకారం గతేడాదిగా సీఎం కేసీఆర్ తన నియోజకవర్గం గజ్వేల్‌లో అనూహ్య స్థాయిలో ప్రజాదరణ పెంచుకున్నారు. తొలి సర్వేలో 75.7 శాతం ప్రజాదరణ పొందిన కేసీఆర్.. ఇటీవలి సర్వేలో 96.70 శాతం మద్దతు పొందారు.
రెండు సర్వేల్లో తేలిన ప్రకారం: కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర తరువాత 2016 మధ్యలో మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేల పనితీరు, ప్రజాదరణపై సర్వే చేయించారు. తిరిగి ఇటీవల మరో సంస్థ ద్వారా ప్రజాభి ప్రాయాన్ని సేకరించారు. గురువారం టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష భేటీ తరువాత జిల్లాల వారీగా శాసనసభ్యులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. ఈ సర్వేల నివేది కలను వెల్లడించారు. ప్రజాదరణ తగ్గుతున్న వారిని సున్నితంగా మందలించారు. పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని కొద్దిమందిని హెచ్చరించినట్లు తెలిసింది. ఇక ముందటి కంటే ఎక్కువ ప్రజాదరణ కూడగట్టుకున్న వారికి అభినందనలు తెలిపారు.
ముగ్గురు మినహా: రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహా 17 మంది ఉండగా.. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగతా 14 మంది ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రి పదవులు అధిష్టించారు. వీరిలో కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి గత సర్వే నాటి కంటే తమ ప్రజాదరణను పెంచుకోగా...
మంత్రి కేటీఆర్ సహా 10 మంది మంత్రులు గత సర్వేతో పోల్చితే ప్రజాదరణ కోల్పోతున్నట్లు వెల్లడైంది. వరంగల్ జిల్లా ములుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అజ్మీరా చందూలాల్ ఏడాది కాలంలో ఏకంగా 48 శాతం ప్రజల మద్దతు కోల్పోయారు. తొలి సర్వేలో ఆయనకు 82.4 శాతం మద్దతు లభించగా.. ఈ సారి 34.40 శాతానికి పడిపోయింది. వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి ఎన్నికైన మహేందర్‌రెడ్డి దాదాపు 30 శాతం ప్రజా మద్దతు కోల్పోయినట్లు తాజా సర్వే వెల్లడించింది.