సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాబోయే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందు జాగ్రత్త చర్యగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు.
ప్రైవేటు ఆస్పత్రులు, లేబొరేటరీలు కోవిడ్ నిబంధనల్ని అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, సీనియర్ వైద్యాధికారులు, వైద్య నిపుణులు సమావేశంలో పాల్గొన్నారు.
(చదవండి: పండుటాకుల గుండె కోత!)
మరణాల రేటు తక్కువ..
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతోందని చెప్పారు. అయితే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని, ఆ తర్వాతి స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
‘‘హైదరాబాద్‌ను కాపాడుకోవాలనే ముందు చూపుతోనే 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు ఇంట్లోనే ఉండాలి. ఇతర తీవ్ర జబ్బులు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్ వచ్చినప్పటికీ అందరికీ చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉంది. టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు, వైరస్ సోకినవారికి అవసరమైన చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో, అప్రమత్తతతో ఉంది’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
(చదవండి: హైదరాబాద్‌లో దడపుట్టిస్తున్న కరోనా)
Comments
Please login to add a commentAdd a comment