సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సంస్థను పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మొదలు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు ఆయనను అనుసరిస్తున్నారు. దీనిలో భాగంగా నష్టాలు ఎక్కువగా ఉన్న అన్ని ఆర్టీసీ డిపోలపై మంత్రి పువ్వాడ ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఎండీ సునీల్ శర్మ కూకట్‌పల్లి డిపోను దత్తత తీసుకున్నారు. కూకట్‌పల్లిలో నష్టాలు ఎక్కువగా ఉండటంతోపాటు అది కీలక డిపో కావడంతో ఆయన దాన్ని దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ సిటీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్‌రావు కాచిగూడ డిపోను.. ఇంజనీరింగ్ విభాగంతోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న మరో ఈడీ వినోద్ తొర్రూరు డిపోను దత్తత తీసుకున్నారు.
ఈడీలే కాకుండా అన్ని విభాగాల అధిపతులు, రీజినల్ మేనేజర్లు సైతం ఒక్కో డిపోను దత్తత తీసుకోవాలని ఎండీ ఆదేశించారు. ప్రస్తుతం దత్తత తీసుకున్న డిపోలను పర్యవేక్షించడం ద్వారా వాటిల్లోని లోపాలను గుర్తించి, సరిదిద్దాలని.. అవే లోపాలు ఇతర డిపోల్లోనూ ఉండే అవకాశం ఉన్నందున.. వాటిని కూడా సరిదిద్దేందుకు అవకాశం కలుగుతుందని ఎండీ భావిస్తున్నారు. ఇలా విడతల వారీగా 97 డిపోలను సరిదిద్దేందుకు ఈ చర్యలు దోహదపడతాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment