సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియా ఒక రైతును ముఖ్యమంత్రి దగ్గరకు చేర్చింది. ఆ రైతు సమస్యను ఒకే రోజులో పరిష్కరించేలా చేసింది. వ్యవసాయ భూమిని కోల్పొయిన యువ రైతుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి సమస్యను పరిష్కరించారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన రైతు శరత్ తన ఏడెకరాల భూమిని వీఆర్వో కరుణాకర్ ఇతరులకు పట్టా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు. 11 నెలలుగా సమస్య అలాగే ఉందని, రైతుల వేదన సీఎంకు చేరే వరకూ షేర్ చేయాలని రైతు విజ్ఞప్తి చేశాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ముఖ్యమంత్రి వరకూ వెళ్లింది. ఆ ఫేస్‌బుక్ పేజీని చూసిన సీఎం.. నేరుగా రైతుకు ఫోన్ చేసి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా న్యాయం చేస్తానని సీఎం భరోసా ఇచ్చారు. అధికారులను ఆదేశించానని గంటలో మీ ఇంటికి వచ్చి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కేసీఆర్ ఆదేశాలతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ హుటాహుటిన ఆ రైతు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. నందులపల్లిలో శరత్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. భూమిని శరత్‌కు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే రైతు బంధు కింద రూ.30,000 కూడా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏడెకరాల భూమిని ఇతరుల పేరుపై మార్పిడి చేసినట్టు ఫిర్యాదు వచ్చిందని, రైతులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించాలని కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. రైతు బంధు పథకం కూడా బాధిత రైతుకు వర్తింపజేయాలని సీఎం ఆదేశించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment