
పోలీసులు మామూళ్లు అడగడం లేదు: కేసీఆర్
హైదరాబాద్: తమ రాష్ట్రంలో పోలీసుల పనితీరు చాలా బాగుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కితాబిచ్చారు. ఢిల్లీ స్థాయిలో పోలీసులకు ప్రశంసలు దక్కుతున్నాయని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో జరిగిన పోలీసు కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. లంచం తీసుకోకుండా పోలీసులు సేవలు అందించాలని సూచించారు. పోలీసు వ్యవస్థ ఎంతో కీలకమైదని పేర్కొన్నారు.
పోలీసు శాఖలో ప్రమోషన్లపై కసరత్తు జరగాల్సివుందని అంగీకరించారు. రిటైరయ్యే వారిని గౌరవంగా సాగనంపాలని, స్టేషన్లలో సన్మానం చేయాలని సూచించారు. పదవీ విరమణ చేసిన వారు పెన్షన్ కోసం ఎదురుచూసే దురిస్థితి ఉండకూడదన్నారు. డిపార్ట్‌మెంట్‌లోని మహిళలకు సదుపాయాలు కల్పించాలని కోరారు. రాయదుర్గం భూముల అమ్మకంతో వచ్చిన డబ్బు పోలీసు శాఖకే ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఆధునాతన వాహనాల కొనుగోలు చేసేందుకు రూ. 500 కోట్లు ఇస్తామని తెలిపారు.
నగర కమిషనర్ మహేందర్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ పోలీసులు బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. హైదరాబాద్‌లో పోలీసులు మామూళ్లు అడగడం లేదన్నారు. పోలీసుల పేరుతో ఓట్లు అడగడానికి రాజకీయ పార్టీలు భయపడతాయని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము షీ టీమ్స్ బొమ్మలు పెట్టి ఓట్లు అడిగామని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో లేని ఎన్నో సౌకర్యాలు పోలీసులకు తమ ప్రభుత్వం కల్పించిందని కేసీఆర్ చెప్పారు.