సీఎం చంద్రశేఖర్ రావు
సాక్షి, హైదరాబాద్: పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా వజ్రాల్లాంటివారేనని, సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. హైదరా బాద్‌లోని కొంపల్లిలో శుక్రవారం జరిగిన పార్టీ ప్లీనరీ ముగింపు ఉపన్యాసంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ‘‘వచ్చే ఎన్నికల్లో 30% మందికి టికెట్లు రావని కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ఊహాజనిత వార్తలు రాయొద్దు. గందరగోళం, అయోమయం సృష్టించాలనే ప్రయత్నంలో ఇలాంటి ప్రచారాలు చేయొద్దు. మా సిట్టింగులంతా డైమండ్లలాగా ఉన్నరు. అందరికీ బ్రహ్మాండంగా టికెట్ ఇస్తం. ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఈ వేదిక ద్వారా చెబుతున్నా. ఎవరైనా బాగా లేకపోతే సెట్ చేస్తాం, సముదాయిస్తాం, బాగుపడేటట్టు చేస్తాం.
ఎవరికీ వెన్నుపోటు పొడవం. ఇంతకన్నా గొప్పవారు మాకు ఆకాశం నుంచి రారు. సిట్టింగులందరినీ గెలిపించుకునే ప్రయత్నం చేస్తం. కాకుంటే ఒకటో.. అరో ఉంటే మార్పులుంటయి తప్ప అందరికీ ఇస్తాం’’ అని కేసీఆర్ చెప్పారు. రొటీన్ రాజకీయాలు అనే భ్రమతో మంత్రివర్గంలో మార్పులని, రేపే అని, ఎల్లుండే అని కూడా ఒక పత్రిక రాసిందన్నారు. ఇలాంటి ప్రచారాలు, ఊహాజనితమైన వార్తలు వద్దని కోరారు. కేబినెట్ ఏమీ మారదని, అంతా సుభిక్షంగానే ఉంటుందని అన్నారు. ప్రజలు కేంద్ర బిందువుగా పనిచేస్తామన్నారు. బలహీనవర్గాలకు ఈ మధ్యనే ఇద్దరికి రాజ్యసభ అవకాశం ఇచ్చామని, మరిన్ని అవకాశాలు ఇస్తామని చెప్పారు.
ఎన్నికల్లో పోటీచేసి గెలిచి రావడానికి అవకాశం లేని వారికి ఎమ్మెల్సీలు, ఇతర నామినేటెడ్ అవకాశాలు ఇస్తామని పార్టీ అధ్యక్షుడిగా హామీ ఇస్తున్నట్టు తెలిపారు. ‘‘ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఈటల రాజేందర్ అనే పక్షపాత దృష్టి లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రోడ్లతోపాటు నియోజకవర్గ అభివృద్ధి నిధి విషయంలో సంపూర్ణ అధికారాలు ఇచ్చాం. రాష్ట్రంలో ఆర్థికంగా అద్భుతమైన పెరుగుదల ఉంది. రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల అదనపు రాబడి ఉంది. జాతీయ రాజకీయాల్లో ప్రభావశీల పాత్ర పోషించాలంటూ టీఆర్‌ఎస్ ప్రతినిధులంతా నాపై పెట్టిన బాధ్యతను నిర్వహిస్తా’’ అని వివరించారు. రైతులకు మే నెల 10న పాస్‌బుక్కులు, పెట్టుబడి చెక్కులు అందిస్తామని తెలిపారు.
రిజిస్ట్రేషన్ అయిన 2 గంటల్లోగానే మ్యుటేషన్ అయ్యేలా రెవెన్యూ శాఖ చర్యలను తీసుకుంటుందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పత్రాలు రైతుల ఇంటికే పోస్టులో లేదా కొరియర్‌లో వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎవరికీ నయా పైసా ఇవ్వాల్సిన అవసరం ఉండదని, అవినీతికి ఆస్కారమే ఉండదని అన్నారు. ‘‘గతంలో గల్లీగల్లీకో పేకాట క్లబ్బు ఉండేది. సంసారాలు కూలిపోయేవి. ఈ క్లబ్బులో కాంగ్రెస్ నేతలకే వాటాలుండేవి. కానీ ఇప్పుడు క్లబ్బుల్లో లేకుండా చేశాం. దేశంలోనే ధనికులైన యాదవులు తెలంగాణలో ఉండేలా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. గొర్రెల పంపిణీతో ఒక్క ఏడాదిలోనే రూ.వెయ్యి కోట్ల సంపదను యాదవులు సృష్టించారు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment