trs plenary meeting
-
ప్లీనరీలో ‘మున్నూరు రవి’ కలకలం
సాక్షి, హైదరాబాద్: మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడైన మున్నూరు రవి టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరు కావడం కలకలం సృష్టించింది. వీవీఐపీలు ఉన్న ప్లీనరీలోకి ఎలాంటి ఆహ్వానం లేకపోయినా, బార్‌కోడ్‌గల పాస్‌లు ఉన్న వారే ప్రవేశించగల సమావేశ మందిరంలోకి రవి రావడాన్ని భద్రతా లోపంగానే నేతలు భావిస్తున్నారు. ప్లీనరీకి 22 కేటగిరీల పార్టీ నేతలను ఆహ్వానించగా ఆ జాబితాలో లేనప్పటికీ రవి ఎలా హాజరయ్యాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీవీఐపీల బార్కోడ్ ఉన్న పాస్‌తోనే అతను లోపలికి వచ్చి ఉంటాడని, ఆ పాస్ ఎవరు ఇచ్చి ఉండొచ్చనే దానిపై పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీ కార్యకర్తగా హాజరయ్యా: రవి ఈ విషయంపై మున్నూరు రవిని మీడియా సంప్రదించగా ‘కేసీఆర్ అభిమానిగా, పార్టీ కార్యకర్తగా సమావేశాలకు హాజరయ్యా, దీన్ని వివాదాస్పదం చేయడం తగదు. నేను బెయిల్‌పై ఉన్నా.. నేరస్తుడిని కాదు’అని వ్యాఖ్యానించారు. -
అచ్చేదిన్ కాదు..చచ్చేదిన్ తెస్తున్నరు
సాక్షి, హైదరాబాద్: అచ్చేదిన్ తెస్తామన్న ప్రధాని మోదీ సర్కారు దేశ ప్రజలకు చచ్చే దిన్ తెస్తోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటున్న బీజేపీ సర్కారు.. ప్రజల బతుకు దుర్భరంగా మార్చిందని మండిపడ్డారు. టీం ఇండియాలో టీం, థీమ్ లేదని.. అంతా రాజకీయ గేమ్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వానిది వైఫ ల్యాల చరిత్ర అయితే తెలంగాణ ప్రభుత్వానిది సాఫల్యాల చరిత్ర అన్నారు. పార్టీ ప్లీనరీలో ‘రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపంలో వసూలు చేయడం మానుకోవాలి. డివిజిబుల్ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలి’ అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి బలపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాలు ఆర్థి కంగా బలహీనంగా ఉండాలి.. రాష్ట్రాలకు అధికారాలు తగ్గించాలన్నదే బీజేపీ సిద్ధాంతమని ధ్వజ మెత్తారు. కేంద్రం సెస్‌ల రూపంలో వసూలు చేసే మొత్తాన్ని డివిజిబుల్ పూల్ లోకి తేవాలని డిమాండ్ చేశారు. ఏడేళ్లలో కేంద్రానికి రూ. 24 లక్షల కోట్లు ‘దేశంలో పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్ర ప్రజల హక్కుగా కేంద్రం పంచాలి. కానీ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పంచాల్సి వస్తుందని సెస్‌ల రూపంలో పెద్ద ఎత్తున కేంద్రం డబ్బులు వసూలు చేస్తోంది’ అని మంత్రి అన్నారు. రాష్ట్రానికి 41%ఇవ్వాల్సిన చోట 29.6 శాతమే ఇస్తోందన్నారు. మరో 11.4% సెస్‌ల రూపంలో దొడ్డి దారిన సమకూర్చుకుంటోందని విమర్శిం చా రు. 14, 15వ ఆర్థిక సంఘాలు కూడా రాష్ట్రాలకు 41% వాటా ఇవ్వాలని సూచించాయని గుర్తు చేశా రు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో సెస్‌ల రూపంలో రూ.24 లక్షల కోట్లను సమకూర్చుకుం దని, ఇందులో రాష్ట్రానికి రూ. 54వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. కేంద్రానికి ఏ రూపంలో డబ్బులు వచ్చినా రాష్ట్రాలకు 41 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల రుణ పరిమితిపై కేంద్రం ఆంక్షలు విధిస్తోందని విమర్శించారు. కొత్తవి తెస్తామని ఉన్నవి అమ్ముతున్నారు ఏడేళ్లలో దేశ ఆర్థిక వృద్ధి రేటు పడిపోయిందని.. నాడు 8% ఉంటే ఇప్పుడు 5.7%కు చేరిందని హరీశ్ చెప్పారు. కొత్త పరిశ్రమలు తెస్తామన్న బీజేపీ సర్కారు.. ఉన్న పరిశ్రమలను అమ్ముకుం టోందన్నారు. బీజేపీ ప్రభుత్వం అమ్మిన ప్రభుత్వ రంగ సంస్థల విలువ రూ. 3.5 లక్షల కోట్లని వివరించారు. బీజేపీ అధికారంలోకి రాక ముందు నిరుద్యోగం 4.7% ఉంటే ఏడేళ్ల పాలనలో 7.11 శాతానికి పెరిగిందన్నారు. బీజేపీ హయాంలో రైతుల ఆదాయం పెరగక పోగా ఖర్చులు పెరిగా యని విమర్శించారు. సంపద పెంచి పేదలకు పంచడం టీఆర్ఎస్ విధానం కాగా.. పేదలను దంచాలి పెద్దలకు పెంచాలన్నది బీజేపీ నినాదమన్నారు. -
అన్నీ ఉన్నా దేశంలో దారిద్య్రం ఎందుకు?: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశానికి కావాల్సింది బీజేపీని గద్దె దించడమో, రాజకీయ ఎజెండానో కాదని.. ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ హెచ్సీసీలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో జాడ్యాలు, అవాంఛితమైన, అనారోగ్యకరమైన, అవసరమైన పెడధోరణులు ప్రబలుతున్నాయన్నారు. ► భారత దేశం శాంతికి అలవమైన సమాజం. కానీ, అవసరమైన జాఢ్యాలు పెరిగిపోతున్నాయి. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఇంత అద్భుతమైన దేశంలో సంకుచిత, ఇరుకైన విధానాలు.. దేశ గరిమకు గొడ్డలి పెట్టుగా పరిణమిస్తున్నాయి. మంచి మార్గాలు కనిపించడం లేదు. అందుకే ఒక రాష్ట్రంగా ఏం చేయాలో, మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలాంటి పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అలాగే దేశ అభ్యున్నత కోసం యధాశక్తిగా కృషి చేయాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. ► తెలిసిన దాని చుట్టే ఆలోచనలు తిరుగుతున్నాయి. చదువుకున్న వాళ్లకు సైతం చాలా విషయాలు దూరంలోనే ఉన్నాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఏం జరిగందో దేశ ప్రజలందరికీ తెలుసు. ఏ పద్ధతిలో స్వాతంత్ర్య ఫలాలు ప్రజలకు లభించాలో ఆ పద్ధతిలో లభించలేదు. ► తెలంగాణ పని చేసిన పద్ధతిలో దేశం పని చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. ఈ మాట కాగ్, ఆర్థిక నిపుణులు చెప్తున్న మాట. దేశంలో కరెంట్‌కోతలు కొనసాగుతుంటే.. తెలంగాణ మాత్రం వెలుగు జిలుగులని గర్వంగా చెప్తున్నా. తాగునీరు, కరెంట్ అందలేని పరిస్థితులు. వాళ్ల ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోతాయి. వాగ్దానాలు ఎక్కువ.. పని తక్కువ. ఇంత దుస్థితి ఎందుకు? ఎవరి అసమర్థత? వనరులు లేవంటే వేరు.. కానీ, ఉండి కూడా అందించలేని పరిస్థితి. ► పరిష్కారాలు కనబర్చాల్సింది విపరీతంగా ఉన్న సమస్యల మీద. ప్రపంచంలోనే యువ జనాభా ఉన్న దేశం భారత్.. కానీ, దరిద్రమే తాండవిస్తోంది. ప్రతిభాపాటవాలను విదేశాల్లోనే ఖర్చు పెడుతున్నారు. అద్భుతంగా పురోగమించాల్సిన దేశం.. వెనుకబడి పోతోంది. మట్టిని కూడా సింగపూర్ పొరుగుదేశం నుంచి తెచ్చుకుంటుంది. నీళ్లు కూడా మలేషియాదే. కానీ, వాళ్ల ఆర్థిక పరిస్థితి ఎందుకు మెరుగ్గా ఉంది. ఇది కఠోరమైన వాస్తవం. నిప్పులాంటి నిజం. హేతుబద్ధమైన వాదం. స్వచ్ఛమైన కఠోరమైన వాస్తవం. కాదనుకుంటే నీతి ఆయోగే ఖండించేది కదా. ► అన్నీ మనకే తెలుసన్న అహంకారం పక్కనపెట్టాలి.. తెలిసిన వాళ్లను తెలియని వివరాలు అడిగి నేర్చుకోవాలి. అలా చేయబట్టే తెలంగాణ ప్రతీ రంగంలో అవార్డులు సాధిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ► కొన్ని పార్టీల మిత్రులు మనమంతా ఏకం కావాలని, బీజేపీని గద్దె దించాలని కోరారు. చెత్త ఎజెండా తాను వెంట రాలేనని చెప్పానని సీఎం కేసీఆర్ అన్నారు. గద్దె ఎక్కించాల్సింది ప్రజలనని, తెలియజేయాల్సింది ప్రజలకు, మారాల్సింది దేశ ప్రజల జీవితాలు, కావాల్సింది మౌలిక వసతులని సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ► అందరికీ రేషన్ బియ్యం ఇచ్చినందుకే ఓటేయాలని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను కోరాడు. ఇదా పరిస్థితి?. ► దేశం తన లక్ష్యం కోల్పోయింది. లక్ష్యరహిత దేశంగా భారత్ ముందుకెళ్తోంది. సామూహిక లక్ష్యాన్ని కోల్పోయి ఏకతాటిగా భారత్ ఎందుకు ముందుకు వెళ్లలేకపోతోంది? సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది సీఎం కేసీఆర్. ► దేశంలో అనారోగ్యమైన వాతావరణం నెలకొంది. రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదని, రాజకీయ పునరేకీరణ కాదని, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. ► నూతన వ్యవసాయం, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. ప్రతీ ఒక్కరికీ పని చేసే అవకాశం రావాలి. అద్భుతమైన దేశ నిర్మాణం జరగాలి. అంతేకానీ, సంకుచిత రాజకీయం కాదన్నారు సీఎం కేసీఆర్. -
జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్ ప్లీనరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో.. జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్లీనరీ కొనసాగనుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) వేదికగా బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇందుకోసం సుమారు పది రోజుల క్రితం ప్రారంభమైన ఏర్పాట్లు మంగళవారం సాయంత్రానికి పూర్తికాగా, వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం భోజనాల ఏర్పాట్లు మంగళవారం రాత్రి నుంచే ప్రారంభించారు. అందరి దృష్టీ ‘జాతీయ రాజకీయాలపైనే’ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి గమ్యాన్ని చేరడమే కాకుండా వరుసగా రెండు పర్యాయాలు అధికార పగ్గాలు చేపట్టింది. 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తమ పార్టీ మేజర్ అయిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషిస్తుందనే అంశంపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ప్లీనరీలో మొత్తం 11 తీర్మానాలను ప్రవేశ పెట్టనుండగా, జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పోషించాల్సిన పాత్ర, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలన వైఫల్యాలు ఎండగట్టడమే ప్రధాన ఎజెండాగా ఉంటుందని పార్టీ నేతలు వెల్లడించారు. అలాగే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీల పాత్ర పోషించాలని కోరుతూ తీర్మానం ఆమోదించనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా తీర్మానాలు చేయనున్నారు. ఇప్పటికే తీర్మానాల వారీగా వక్తల పేర్లను ఖరారు చేశారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ రాక సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు గులాబీరంగు దుస్తులను ధరించి రావాలని ఆదేశించారు. ప్రతినిధులందరికీ ప్రత్యేక కిట్‌లో తీర్మానాల ప్రతులు, పెన్నులు, ప్యాడ్లు, పార్టీ జెండాలు తదితరాలు అందజేస్తారు. హెచ్ఐసీసీ ప్రాంగణంలో జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ప్రతినిధుల పేర్లు నమోదు చేసి, పాస్‌ను పరిశీలించి లోని కి అనుమతిస్తారు. కేసీఆర్ ఉదయం 11 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, తెలంగాణ అమరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. కేసీఆర్ ప్రా రంభోపన్యాసం తర్వాత తీర్మానాలపై చర్చ మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీ తీర్మానాలు ఇవే.. ► యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం ► దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం ► ఆకాశాన్నంటిన ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ తీర్మానం ► చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ► భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం ► బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ► తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం ► రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్ రూపేణా వసూలు చేయడం మానుకోవాలని డివిజబుల్ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలని తీర్మానం ► నదీ జలాల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిర్వహించాలని ఈమేరకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ► భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానం ► తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం ఊరూరా టీఆర్ఎస్ జెండా పండుగ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,618 మున్సిపల్ డివిజన్లు, వార్డుల్లో జెండా పండుగ నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ శ్రేణులు జెండా పండుగలో పాల్గొనాలని, గ్రామ కమిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతు బంధు కమిటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఉదయం 9 గంటలకు తెలంగాణలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో పార్టీ పతాకావిష్కరణ నిర్వహించాలన్నారు. బార్కోడ్ పాస్‌తో ప్రవేశం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకుని మొత్తం 22 కేటగిరీలకు చెందిన సుమారు 3 వేల మంది ప్రజా ప్రతినిధులు, నాయకులకు మాత్రమే పార్టీ ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానాలు వెళ్లాయి. సుమారు 65 లక్షల మంది పార్టీ సభ్యులు ఉన్నా.. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు పంపించామని, ఆహ్వానాలు అందని వారు మన్నించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జీల ద్వారా ఆహ్వానాలు వెళ్లగా తొలిసారిగా ‘బార్కోడ్’తో కూడిన పాస్‌ను ఉపయోగించి సమావేశ ప్రాంగణంలోకి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. సభాస్థలిలో ప్రధాన వేదికతో పాటు మరో ఐదు డిజిటల్ తెరలను ఏర్పాటు చేశారు. 33 రకాల వంటకాలు సమావేశ ప్రాంగణమంతా కేసీఆర్ భారీ కటౌట్లు, పార్టీ జెండాలతో గులాబీమయం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ నగరానికి దారితీసే ప్రధాన మార్గాలతో పాటు నగరంలోని ముఖ్య కూడళ్లలో పార్టీ నేతలు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వేడుకలకు హాజరయ్యే ప్రతినిధుల కోసం 33 రకాల వంటకాలు సిద్ధం చేయడంతోపాటు హెచ్ఐసీసీలో వేర్వేరు చోట్ల భోజన వసతి కల్పిస్తున్నారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా ఇప్పటికే జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు విభాగంతో పార్టీ నేతలు సమన్వయం చేసుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన గద్వాల, భద్రాచలం, కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన నేతలు మంగళవారం రాత్రికే హైదరాబాద్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. -
తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు కేసీఆర్
-
కిలికిరిగాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిన దళితబందు ఆగదు: సీఎం కేసీఆర్
-
ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్దే విజయం: కేసీఆర్
-
ప్లీనరీకి తరలిన టీఆర్ఎస్ నాయకులు
మద్దూరు : హైదబాద్‌లోని కొంపల్లిలో శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే 17వ ప్లీనరీకి టీఆర్ఎస్ మండల నాయకులు తరలివెళ్లారు. పార్టీ రాబోయే రోజుల్లో చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత నిర్ణయాలపై సీఎం ఆదేశాల మేరకు మండలంలో ప్రచారం చేయడానికి ప్లీనరీకి వెళ్తున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. ప్లీనరీకి వెళ్లిన వారిలో సలీం, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపాల్, నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, జయప్రకాష్, అనంత్‌రెడ్డి తదితరులున్నారు. కోస్గి : తెలంగాణ రాష్ట్ర సమితి హైద్రాబాద్‌లో నిర్వహించిన పార్టీ ప్లీనరీకి శుక్రవారం స్థానిక నాయకులు తరలివెళ్లారు.మండల పార్టీ అధ్యక్షుడు కిష్టప్ప, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, వైస్ ఎంపీపీ దోమ రాజేశ్వర్, జెడ్పీటీసీ అనితబాల్‌రాజ్, ఎంపీటీసీ మ్యాకల రాజేష్, రైతు సమితి మండల కన్వీనర్ హన్మంత్‌రెడ్డి, నాయకులు ఓంప్రకాష్, మధుకర్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, మల్రెడ్డి, డీకే నాగేష్‌తోపాటు పలువురు నాయకులు ఉన్నారు. దౌల్తాబాద్ : హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీకి మండలంలోని టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్లీనరీకి మండలంలోని నాయకులు, శ్రేణులు వాహనాల్లో తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రానున్న 2019 ఎన్నికల్లో కూడా తెలంగాణలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రతిగ్రామం నుంచి ఇద్దరు నాయకులు ప్లీనరీకి వెళ్లారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. బొంరాస్‌పేట : టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి మండల టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం తరలివెళ్లారు. మండలంలోని బురాన్‌పూర్, ఏర్పుమళ్ల, తుంకిమెట్ల తదితర గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. ఇందులో మండల నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, శేరినారాయణరెడ్డి, మహేందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
సిట్టింగులంతా వజ్రాలే
సాక్షి, హైదరాబాద్: పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా వజ్రాల్లాంటివారేనని, సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. హైదరా బాద్‌లోని కొంపల్లిలో శుక్రవారం జరిగిన పార్టీ ప్లీనరీ ముగింపు ఉపన్యాసంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ‘‘వచ్చే ఎన్నికల్లో 30% మందికి టికెట్లు రావని కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ఊహాజనిత వార్తలు రాయొద్దు. గందరగోళం, అయోమయం సృష్టించాలనే ప్రయత్నంలో ఇలాంటి ప్రచారాలు చేయొద్దు. మా సిట్టింగులంతా డైమండ్లలాగా ఉన్నరు. అందరికీ బ్రహ్మాండంగా టికెట్ ఇస్తం. ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఈ వేదిక ద్వారా చెబుతున్నా. ఎవరైనా బాగా లేకపోతే సెట్ చేస్తాం, సముదాయిస్తాం, బాగుపడేటట్టు చేస్తాం. ఎవరికీ వెన్నుపోటు పొడవం. ఇంతకన్నా గొప్పవారు మాకు ఆకాశం నుంచి రారు. సిట్టింగులందరినీ గెలిపించుకునే ప్రయత్నం చేస్తం. కాకుంటే ఒకటో.. అరో ఉంటే మార్పులుంటయి తప్ప అందరికీ ఇస్తాం’’ అని కేసీఆర్ చెప్పారు. రొటీన్ రాజకీయాలు అనే భ్రమతో మంత్రివర్గంలో మార్పులని, రేపే అని, ఎల్లుండే అని కూడా ఒక పత్రిక రాసిందన్నారు. ఇలాంటి ప్రచారాలు, ఊహాజనితమైన వార్తలు వద్దని కోరారు. కేబినెట్ ఏమీ మారదని, అంతా సుభిక్షంగానే ఉంటుందని అన్నారు. ప్రజలు కేంద్ర బిందువుగా పనిచేస్తామన్నారు. బలహీనవర్గాలకు ఈ మధ్యనే ఇద్దరికి రాజ్యసభ అవకాశం ఇచ్చామని, మరిన్ని అవకాశాలు ఇస్తామని చెప్పారు. ఎన్నికల్లో పోటీచేసి గెలిచి రావడానికి అవకాశం లేని వారికి ఎమ్మెల్సీలు, ఇతర నామినేటెడ్ అవకాశాలు ఇస్తామని పార్టీ అధ్యక్షుడిగా హామీ ఇస్తున్నట్టు తెలిపారు. ‘‘ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఈటల రాజేందర్ అనే పక్షపాత దృష్టి లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రోడ్లతోపాటు నియోజకవర్గ అభివృద్ధి నిధి విషయంలో సంపూర్ణ అధికారాలు ఇచ్చాం. రాష్ట్రంలో ఆర్థికంగా అద్భుతమైన పెరుగుదల ఉంది. రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల అదనపు రాబడి ఉంది. జాతీయ రాజకీయాల్లో ప్రభావశీల పాత్ర పోషించాలంటూ టీఆర్ఎస్ ప్రతినిధులంతా నాపై పెట్టిన బాధ్యతను నిర్వహిస్తా’’ అని వివరించారు. రైతులకు మే నెల 10న పాస్‌బుక్కులు, పెట్టుబడి చెక్కులు అందిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ అయిన 2 గంటల్లోగానే మ్యుటేషన్ అయ్యేలా రెవెన్యూ శాఖ చర్యలను తీసుకుంటుందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పత్రాలు రైతుల ఇంటికే పోస్టులో లేదా కొరియర్లో వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎవరికీ నయా పైసా ఇవ్వాల్సిన అవసరం ఉండదని, అవినీతికి ఆస్కారమే ఉండదని అన్నారు. ‘‘గతంలో గల్లీగల్లీకో పేకాట క్లబ్బు ఉండేది. సంసారాలు కూలిపోయేవి. ఈ క్లబ్బులో కాంగ్రెస్ నేతలకే వాటాలుండేవి. కానీ ఇప్పుడు క్లబ్బుల్లో లేకుండా చేశాం. దేశంలోనే ధనికులైన యాదవులు తెలంగాణలో ఉండేలా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. గొర్రెల పంపిణీతో ఒక్క ఏడాదిలోనే రూ.వెయ్యి కోట్ల సంపదను యాదవులు సృష్టించారు’’ అని పేర్కొన్నారు. -
ఢిల్లీలో భూకంపం పుట్టిస్తా
సాక్షి, హైదరాబాద్ : ‘‘కమలంపై కోపం వస్తే హస్తానికి, హస్తంపై కోపం వస్తే కమలానికి ఓట్లేసే రోజులు మారాలి.. బైడిఫాల్ట్‌గా గెలిచే రాజకీయాల్లో మార్పు రావాలి.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకే ఫెడరల్ ఫ్రంట్.. అది ప్రకటన కాదు.. ఓ ప్రకంపన.. తెలంగాణ గడ్డ నుంచి చేసిన ఈ ప్రకటనకు కాంగ్రెస్, బీజేపీలు వణికిపోతున్నాయి.. గంగవెర్రులెత్తుతున్నాయి.. ఇక హైదరాబాద్ నుంచే ఢిల్లీలో భూకంపం పుట్టిస్తా..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దేశ ప్రజల ఉసురుపోసుకున్నాయంటూ నిప్పులు చెరిగారు. దేశ రాజకీయ వ్యవస్థలోని లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించినట్టే ఈ దేశ ప్రజలకు మంచి దారి చూపే ఆలోచనతో మడమ తిప్పకుండా ముందుకెళ్తానని శపథం చేశారు. తాను తెలంగాణ వదిలిపెట్టి వెళ్లేది లేదని, ఇక్కడ్నుంచే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానని చెప్పారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా కొంపల్లిలో జరిగిన పార్టీ 17వ ప్లీనరీలో కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. నిజాయితీగా పనిచేసే ప్రభుత్వం మాది రాష్ట్ర సాధన కోసం పార్టీ ప్రారంభించినప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. అందరి అంచనాలను తలకిందులు చేసి రాష్ట్రాన్ని సాధించాం. సాధించిన రాష్ట్రంలో అహర్నిశలు కష్టపడ్డాం. ఎవరెన్ని అవాకులు చెవాకులు పేలినా, గాలి మాటలు మాట్లాడినా దేశంలో నిజాయితీగా నిటారుగా పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే. కొన్ని పనులు చేయాలంటే సాహసం, గుండె ధైర్యం కావాలి. గత ప్రభుత్వాల్లో ఎన్నిసార్లు తండాలను పంచాయతీలు చేయమన్నా చేయలేదు. 4 వేల పైచిలుకు తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుని ప్రజలకు అద్భుత ఉపశమనమిచ్చాం. ఇప్పుడు తెలంగాణ 31 జిల్లాలతో అలరారుతోంది. నేనీ మధ్య బెంగళూరు వెళ్లినప్పుడు మాజీ ప్రధాని దేవెగౌడను కలిశా. ‘కేసీఆర్ గారూ.. మీ పథకాలన్నీ మా ప్రజలకు తెలిశాయి. ఆ పథకాలన్నీ మా దగ్గర అమలు చేయాలని అడుగుతున్నారు’ అని చెప్పారు. షిర్డీ దర్శనానికి వెళ్లినప్పుడు అక్కడి అధికారులు కూడా అదే మాట చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, హోంగార్డులకు మనమిచ్చిన జీతాలు ఎవరూ ఇవ్వడం లేదు. ఈవోడీబీలో ముందున్నాం. సొంత రెవెన్యూ రాబడిలో నంబర్‌వన్‌గా నిలిచాం. ఒక్కో పథకానికి రూపకల్పన చేసి అమలు చేయడమంటే ఆషామాషీ కాదు. రక్తం రంగరించాలి. మేధస్సు కరిగించాలి. తెల్వంది తెల్సుకోవాలి. అధికారులతో చర్చించాలి. పర్యవేక్షణ చేయాలి. నాలుగేళ్ల పసికూన రాష్ట్రమైనా దీక్షా దక్షతతో సమర్థంగా పనిచేసే కేబినెట్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉండబట్టే ఇది సాధ్యమైంది. మా అందరికీ ప్రాణవాయువులా పనిచేసే 75 లక్షల మంది కార్యకర్తలున్నారు. మీరే మా ఆక్సిజన్. ఈ గౌరవం, కీర్తి మీకే దక్కుతుంది. ఉత్తమ్.. నీకు టీపీసీసీ రాదు, టోపీసీసీ రాదు ఎన్నడూ రాజ్యం చేయనోళ్లు, ఆంధ్ర నేతలకు సంచులు మోసినోళ్లు టీపీసీసీ అధ్యక్షులుగా, బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. రాష్ట్రంలో చిల్లరమల్లర యాత్రలు చేస్తున్నరు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డీ.. ఒకటి గుర్తు పెట్టుకో. తెలంగాణ తెచ్చింది గులాబీ జెండా. తెలంగాణ వచ్చింది కాబట్టే నువ్వు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నవ్. లేదంటే నీకు టీపీసీసీ రాదు టోపీసీసీ రాదు. ఇంకా సంచులు మోసుకుంటూ ఉండెటోనివి. తెలంగాణ సృష్టించిందే గులాబీ జెండా. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలె. అబద్ధాలు చెప్పడానికి కూడా తెలివుండాలె. నాలుకుందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడతవా. ప్రగతి భవన్లో 150 గదులు కట్టుకున్నా అని అంటున్నవ్. ప్రగతిభవన్‌లో 15 రూంలు చూపెట్టకపోతే నువ్వు ముక్కు నేలకు రాయాలె. ఒకవేళ నువ్వు 16వ రూం చూపెడితే నేను ఈ రోజు 8 గంటలకాల్లా నా సీఎం పదవికి రాజీనామా చేస్తా. హరీశ్‌రావు చక్కర్లు కొట్టాడు సాగునీటి మంత్రి హరీశ్‌రావు, ఇరిగేషన్ అధికారులు, నేను చక్కర్లు కొట్టి కాళేశ్వరం ప్రాజెక్టు, చనాఖా–కొరాటా, ప్రాణహితలకు ఒప్పందం చేసుకుని వస్తే కొత్తగా చేసిందేమీ లేదంటారా? నేను బేగంపేట ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడే ఈ విషయంపై సవాల్ చేసిన. ఒక్కరు రాలేదు. దీంతోనే ఎవరు నిజాలు మాట్లాడుతున్నరో, ఎవరు అబద్ధాలు చెబుతున్నరో అర్థమయితోంది. ఎన్నికలు వస్తున్నయ్ కాబట్టి ఏది పడితే అది మాట్లాడతారా? మీరు భవనాల్లో కులికారు. అందలాలు ఎక్కారు. ఏనాడైనా పేదలకు కంటితుడుపుగా పెట్టారే కానీ.. కడుపునిండా పెట్టారా? 2014లో ఎన్నికల ముందు పెట్టిన మేనిఫెస్టోను 100 శాతం అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. సొల్లు పురాణాలు చెప్పొద్దు. ప్రాజెక్టులు కడుతుంటే 250 కేసులు వేస్తరా? ఇన్ని రోజులు మర్యాదగా చూసినా శ్రుతి మించితే ప్రజలు ఊర్కోరు. కేసులు విత్‌డ్రా చేసుకునేంతవరకు తరిమికొడతరు. మీ పార్టీకి చెందిన మంత్రులే మమ్మల్ని మెచ్చుకుంటుంటే మీరు సిగ్గుపడాల్సింది పోయి చిల్లరమల్లర రాజకీయాలు చేస్తున్నరు. దీని వల్ల నగుబాటు పాలు కావడం తప్ప ఏమీ ఉండదు. మాది తెలంగాణను సాధించిన పార్టీ అయితే.. కాంగ్రెస్ ఏడు దశాబ్దాల పాటు తెలంగాణను వేధించిన పార్టీ అని ప్రజలు గమనించాలి. దేశ రాజకీయాల్లో లోపముంది.. సవరించాలి గత ఏడాదిన్నరగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని పరిశీలించిన తర్వాత.. గత అనుభవాలను క్రోడీకరించిన తర్వాత.. 40 ఏళ్ల నా రాజకీయ అనుభవసారాన్ని రంగరించిన తర్వాత.. ఈ దేశంలో జరగాల్సింది జరగడం లేదని, దేశ రాజకీయాల్లో లోపముందని, దాన్ని సవరించాల్సి ఉందనే అభిప్రాయానికి వచ్చా. ఇది నేను ఆషామాషీగా చెప్పడం లేదు. నాకు 64 ఏళ్ల వయసొచ్చింది. పానం బక్కపలచదయినా మొండి ఆలోచన ఉంది. ఏదో జరగాలనే తపన, తెలంగాణ గడ్డ నుంచి దేశానికి ఏదో చేయాలనే ఆలోచనతోనే నేను హైదరాబాద్ నుంచి ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన చేసిన. అది ప్రకటన కాదు. ప్రకంపన. దానికి గంగవెర్రులెత్తుతున్నరు.. దద్దరిల్లిపోతున్నరు. చిన్న పానం తెలంగాణ గడ్డ నుంచి ప్రకటన చేస్తే రాహుల్ గాంధీ స్పందించారు. కేసీఆర్.. నరేంద్రమోదీ ఏజెంటని అంటున్నారు. అంటే దేశ రాజకీయాలపై మాట్లాడే అధికారం కాంగ్రెస్, బీజేపీలే తీసుకున్నయా? ఎవరికీ అధికారం లేదా? బీజేపీ ఆయన కేసీఆర్ ఫ్రంట్‌కు టెంట్ లేదంటడు. మరి టెంట్ లేనప్పుడు ఎందుకంత భయం? ఆ భయం.. కేసీఆర్. మొండి కదా? ఎత్తిన జెండా దించడు కదా? ఆరునూరైనా వెనక్కు తగ్గడు కదా? అదీ భయం. మీరిచ్చిన స్ఫూర్తి, భగవంతుడిచ్చిన శక్తితో పోరాడుతా. రాష్ట్రం తెచ్చినట్టే దేశానికి మంచి దారి చూపెట్టి తెలంగాణ బిడ్డగా మీ గర్వాన్ని పెంచుతా. మడమ తిప్పేది లేదు. దేశ ప్రజలు ఆ నిషా నుంచి బయటపడాలె స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్లయింది. సిగ్గుపడాలె. 55 ఏళ్లు కాంగ్రెస్, 11 ఏళ్లు బీజేపీ, 5, 6 ఏళ్లు వేరే పార్టీల ప్రధానులు పనిచేశారు. వేరే పార్టీల ప్రధానులను కూడా వీళ్లు బతకనీయలె. కాంగ్రెస్ మీద కోపం వస్తే బీజేపీ గెలవాలి. బీజేపీ మీద కోపం వస్తే కాంగ్రెస్ గెలవాలి. ఇది అలవాటైపోయింది. బైడిఫాల్ట్‌గా గెలిచే ఈ రాజకీయాల్లో మార్పు రావాలి. దేశ ప్రజలు కూడా ఆ నిషా నుంచి బయటపడాలి. వాస్తవాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికలు జరుగుతుంటే కావేరి నదీ జలాలపై బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయి. అదేదో 2014లోనే మాట్లాడొచ్చు కదా.. మాట్లాడరు.. చేయరు. దేశంలో నీటి యుద్ధాలంటరు. మీ అసమర్థ చేతకాని పాలన, దద్దమ్మ రాజకీయాల వల్లే నీటి యుద్ధాలు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు లభ్యమవుతోంది. ఇది నిజమా కాదా? కాంగ్రెస్, బీజేపీలు జవాబు చెప్పాలె. నన్ను విమర్శించే ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పాలె. ఉంటే చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నరు. దేశంలో 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంది. 40 వేల టీఎంసీల నీళ్లిస్తే, ధర్మం, న్యాయం ప్రకారం పంచితే సరిపోతుంది. మరో 5 వేల టీఎంసీలు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు సరిపోతాయి. ఇంకా 25 వేల టీఎంసీలు మిగులుతాయి. చేతకాక, తెలివిలేక, ఆలోచన లేక నీటి యుద్ధాలు తెస్తున్నరు. కృష్ణా జలాల పంపిణీ కోసం 2004లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఆరు నెలల్లో తీర్పు ఇవ్వమని కేంద్రం ట్రిబ్యునల్‌ని ఆదేశించలేదా? ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినా దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయొచ్చు. ఇదంతా జరిగేసరికి ఒక తరం పోతది. కానీ నీళ్లు రావు. చాటలో తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు నీటి యుద్ధాలు పెడుతున్నరు. రెండు జాతీయ పార్టీలు దేశ రైతాంగాన్ని అరిగోసకు గురిచేసి ఆత్మహత్యల పాలు చేస్తున్నాయ్. హర్ ఏకర్మే పానీ, హర్ కిసాన్ కో పానీ, హర్ ఖేత్ మే పానీ అంటూ వాళ్ల మొఖాలు వెలవెలబోయే విధానం రూపొందిస్తాం. మీ కాలం చెల్లిపోయింది. ప్రాంతీయ పార్టీల సమన్వయ కూటమి రైతాంగానికి మంచి చేయడానికి నడుం బిగిస్తోంది. వాళ్ల మాటలింటే షెక్కరొస్తది దేశం బాగుపడాలంటే మౌలిక వసతుల కల్పన జరగాలి. కాంగ్రెస్, బీజేపోళ్ల మాటలు వింటే షెక్కరొస్తది. అంతర్జాతీయంగా సరుకు రవాణా ట్రక్ వేగం గంటలకు 80 కిలోమీటర్లుంటే.. మన దేశంలో 26–36 కిలోమీటర్లుంది. చైనాలో 1.23 లక్షల కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ హైవేలుంటే, మన దేశంలో 2 వేల కిలోమీటర్లు లేవు. ఇదా మీ గొప్పతనం? ఇది చూసి మురవాల్నా. మీకు దండం పెట్టాల్నా. ఇది ఎవరి గొప్పతనం. కాంగ్రెస్, బీజేపీలు ఈ దేశం ఉసురు పోసుకున్నాయి. చైనాలో గూడ్సు రైళ్లు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పోతే.. మన దేశంలో 24 కిలోమీటర్లు దాటవు. ఇదే మీ ప్రతిభకు ప్రబల నిదర్శనం. పర్యాటక రంగంలో విదేశీయులను ఆకర్షించే తెలివితేటల్లేక.. మనోళ్లు వేల కోట్లు బయట దేశాల్లో ఖర్చు పెడుతున్నరు. హైదరాబాద్‌లో సగం ఉండే సింగపూర్‌లో 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటే అక్కడ సరుకు రవాణాకు 4 కోట్ల కంటెయినర్లున్నాయి. చైనాలో 19.59 కోట్ల కంటెయినర్లున్నాయి. 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న మనదేశంలో ఉన్నది 87 లక్షల కంటెయినర్లే. మీ నాయకత్వాన్ని నమ్ముకుంటే, మీ ప్రభుత్వాలే పనిచేస్తే ఈ దేశం బాగుపడతదా? గరీబీ హఠావో లాంటి ఫాల్తు పనికిరాని నినాదాలతో దశాబ్దాల తరబడి ప్రజలను మోసం చేశారు. 1968లో మన దేశ జీడీపీ 180 బిలియన్ డాలర్లుంటే.. చైనా జీడీపీ 134 బిలియన్డాలర్లుంది. అదే 2016లో మన దేశ జీడీపీ 2,465 బిలియన్ డాలర్లుంటే, చైనా జీడీపీ 9,504 బిలియన్ డాలర్లుంది. చైనా పురోగమిస్తుంటే మనమేం చేస్తున్నాం? బాధ్యత వహించే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు ప్రజలకేం కావాలో అవి చేయవు. ఏం చేయకూడదో అవే చేస్తాయి. మున్సిపాలిటీలకన్నా హీనంగా రాష్ట్రాలు ఉమ్మడి జాబితా అంటూ పెత్తనం చెలాయించేందుకు కేంద్రం దగ్గర కొన్ని అంశాలు పెట్టుకున్నరు. రాష్ట్రాలను మున్సిపాలిటీలకన్నా హీనంగా దిగజార్చారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖలు, తాగునీటి వసతి మీ వద్ద ఎందుకు? తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో నడిపే స్కూల్ గురించి మీకెందుకు? ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అవసరమా? గ్రామానికి రోడ్డు వేసేందుకు సర్పంచి లేడా? ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వం లేదా? ఉపాధి కూలీలకు ఢిల్లీ పోస్టాఫీసుల నుంచి డబ్బులు వేస్తే అది ప్రజాస్వామ్యమా? ఇది స్థానిక సంస్థలను గౌరవించే విధానమా? కశ్మీర్లో రోజూ బాంబులే.. అమాయక ప్రజలను చంపుతున్నరు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు జవాన్లు చనిపోతున్నరు. అంతర్జాతీయ దౌత్యంలో తెలివితేటల్లేవు. అది చేయకుండా స్కూళ్లు, నీళ్ల కాడ ఉంటరా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ న్యూయార్క్ రైల్వేస్టేషన్‌లోని టాయిలెట్ కన్నా దరిద్రంగా ఉంటది. ఇదేనా వైకుంఠం, ఇదేనా కైలాసం. కమలం మీద కోపం వస్తే హస్తానికి గుద్దురి.. హస్తం మీద కోపం వస్తే కమలానికి గుద్దురి.. దేశం అవమానకర పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ధీరేంద్రబ్రహ్మచారిలు, చంద్రస్వామిలు, బీజేపీ ఉంటే ఆశారాంబాపూలు, డేరా రహీంబాబులు వస్తారు. నీరవ్, లలిత్ మోడీలు బోడిగుండు కొట్టి పోతరు. వీళ్లెవరు అధికారంలో ఉన్నా స్కీంల పేర్లు, స్కాంల పద్ధతులు మారతాయి తప్ప ప్రజల తలరాత మారుతుందా? ఇంకా మీకు డబ్బా కొట్టి, మిమ్మల్ని పొగిడి మంగళారతులు పాడాల్నా? రాహుల్, అమిత్‌షాలు చెప్పాలి. ఈ రోజులు మారాలే. కేసీఆర్ ఏ విధమైన మొండి పట్టుదలతో భూకంపం సృష్టించి, దేశాన్ని ఒప్పించి రాష్ట్రాన్ని సాధించిండో.. రానున్న 2,3 నెలల్లో పక్షిలా తిరిగి దేశంలోని ప్రాంతీయ పార్టీలనన్నింటిని ఏకం చేస్తా. ఢిల్లీ పోతా అనుకోవద్దు.. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోతా అనుకోవద్దు. హైదరాబాద్ నుంచే భూకంపం సృష్టిస్తా. తెలంగాణ వదిలిపెట్టిపోను. ఇక్కడ్నుంచే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తా. మీ ఆశీస్సులు, దీవెనలతో పురోగమిస్తూ దేశం నలుమూలలా గులాబీ పరిమళాలు వెదజల్లేలా చేస్తా. కాంగ్రెస్, బీజేపీల కబంధ హస్తాల నుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పిస్తా. దేశంలో వేడి నెత్తురుంది. అద్భుత వనరులున్నాయి. కష్టపడి పనిచేసే ప్రజలున్నారు. అయినా పాలించిన నేతల నిష్క్రియా పరత్వమే ఈ దేశానికి శాపంగా మారింది. ఏడు దశాబ్దాలు వేచిచూసినం. ఇంక వేచి చూడం. దేశ రాజకీయాల్లో ప్రభావశీల, క్రియాశీల పాత్ర పోషించి, ఈ తెలంగాణ గడ్డపేరు దేశంలో వేనోళ్ల పొగిడేలా చేస్తా. తెలంగాణ గడ్డ మీదే కాదు.. దేశంలోనూ ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తా. జై తెలంగాణ.. జై భారత్. -
మటన్ బిర్యానీ.. పాయా.. నాటుకోడి కూర
-
విశాల ప్రాంగణం.. విస్తృత ఏర్పాట్లు..
-
టీఆర్ఎస్ ప్లీనరీ నేడే
-
17 ఏళ్ల గులాబీ
ప్లీనరీలో ప్రతిపాదించనున్న ఆరు తీర్మానాలివే.. ఇంటింటికీ సంక్షేమం– ప్రతీ ముఖంలో సంతోషం దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం ఉద్యమం సమానాభివృద్ధే ధ్యేయంగా మైనారిటీల సంక్షేమం సుస్థిర అభివృద్ధికి విస్తృత మౌలిక సదుపాయాల కల్పన దేశానికే ఆదర్శం తెలంగాణ వ్యవసాయ విధానం భారీ పాలనా సంస్కరణలు– ప్రజల ముంగిట వ్యవస్థలు సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీకి హైదరాబాద్ ముస్తాబైంది. ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న ఈ ప్లీనరీ కోసం ఇక్కడి కొంపల్లిలో ఉన్న జీబీఆర్ గార్డెన్లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. వేదికకు ‘ప్రగతి ప్రాంగణం’గా నామకరణం చేశారు. ప్లీనరీలో ఆరు తీర్మానాలు చేయాలని పార్టీ తీర్మానాల కమిటీ ప్రతిపాదించింది. వాటికి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. అందులో భవిష్యత్ రాజకీయాలపై చేయనున్న తీర్మానంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యంగా, జాతీయ రాజకీయాలకు నాయకత్వం వహిస్తానని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో స్వాతంత్య్రానంతరం నెలకొన్న పరిస్థితులు, వాటిలో కేసీఆర్ ఎలాంటి గుణాత్మక మార్పును ఆశిస్తున్నారు, ఈ దిశగా ఎలాంటి రాజకీయ వ్యూహాలను అనుసరిస్తారనే దానిపై ప్లీనరీ వేదికగా కేసీఆర్ మార్గనిర్దేశనం చేయనున్నారు. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తామన్న ఫెడరల్ ఫ్రంట్ దిశగా ఇప్పటిదాకా జరిగిన పురోగతిని కూడా వెల్లడించే అవకాశముంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు, నాయకులతో జరిపిన చర్చలు, ఇంకా ఎవరెవరిని కలుస్తారు, స్థూలంగా రాజకీయ వ్యూహం ఏమిటి, దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించడానికి చేపట్టే కార్యక్రమాలు తదితర అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు. ఈ అంశం టీఆర్ఎస్ శ్రేణులకే కాకుండా అన్ని రాజకీయవర్గాలకు ఆసక్తి కలిగిస్తోంది. ఒకవేళ జాతీయ, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వేర్వేరు తీర్మానాలు చేస్తే.. ప్లీనరీలో మరో తీర్మానం పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్లీనరీలో ఆమోదించబోయే తీర్మానాలివే.. టీఆర్ఎస్ ప్లీనరీలో ఆరు తీర్మానాలను ప్రతిపాదించనున్నారు. వాస్తవానికి తొలుత 12 నుంచి 15 తీర్మానాలదాకా ప్రతిపాదించాలని అనుకున్నారు. కానీ అనుబంధ అంశాలను కలిపి ఒకే తీర్మానంగా కుదించడం ద్వారా రాజకీయ అంశాలను ఎక్కువగా చర్చించడానికి, ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధుల్లో విసుగు లేకుండా ఉండటానికి ఆరుకు కుదించారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కలిపి ఒకే తీర్మానంగా ప్రతిపాదించనున్నారు. వ్యవసాయంపై తీర్మానంలోనే సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు వంటివన్నీ చేర్చారు. మౌలిక వసతుల కల్పనలోనే పారిశ్రామిక, విద్య, రోడ్లు, ఫ్లైఓవర్లు వంటివన్నీ పొందుపరిచారు. మరీ అత్యవసరమతే అదనంగా ఒకటి లేదా రెండు తీర్మానాలను అప్పటికప్పుడు ప్రతిపాదించే అవకాశముందని కేసీఆర్ సన్నిహితులు వెల్లడించారు. ఇక ఒక్కో తీర్మానం ప్రతిపాదన, బలపర్చడం వంటివన్నీ 20 నిమిషాలకు మించకుండా చూడాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. 13 వేలకుపైగా ప్రతినిధులు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ ప్రతినిధులు పార్టీ ప్లీనరీకి హాజరుకానున్నారు. ఒక్కో మండల స్థాయిలో ఎంపీపీ, జెడ్పీటీసీ, పార్టీ అధ్యక్షుడు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఇతర ముఖ్య నేతలతో కూడిన జాబితాను సిద్ధం చేసి ఆహ్వానించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 100 మందికి ఆహ్వానాలు పంపారు. వీరితోపాటు దాదాపు 20 దేశాల్లో ఉంటున్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు, ఇతర ముఖ్యులు 100 మంది వరకు హాజరవుతున్నారు. మొత్తంగా ప్లీనరీకి 13 వేల మందికిపైగా పార్టీ ప్రతినిధులు హాజరవుతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. విశాల ప్రాంగణం.. విస్తృత ఏర్పాట్లు.. హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఉన్న జీబీఆర్ గార్డెన్లో నిర్వహించే ప్లీనరీలో ప్రతినిధులు కూర్చోవడానికి 9 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూలర్లు ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్యం కోసం వైద్యులను అందుబాటులో ఉంచుతున్నారు. ఇక నగరమంతటా హోర్డింగులు, కటౌట్లు, జెండాలతో గులాబీమయం చేశారు. ప్లీనరీ ప్రాంగణంలో ప్రతినిధుల నమోదు కోసం 34 నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 15 వందల మంది వలంటీర్లు ఇందుకు సహకరించనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు సభా ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక ద్వారాలను ఏర్పాటు చేశారు. వీఐపీల భోజనాల కోసం కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఉదయం 8.30కే ప్రతినిధుల నమోదు ప్రారంభం కానుంది. ప్రతినిధులు నమోదు చేసుకున్న తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఇక ప్లీనరీకి వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం దాదాపు 90 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. మటన్ బిర్యానీ.. పాయా.. నాటుకోడి కూర టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రతినిధులకు వడ్డించేందుకు పసందైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ప్రత్యేకంగా వండుకునే తలకాయ కూర, పాయా, మటన్ బిర్యానీ, మటన్ షోర్భా, నాటుకోడి కూర వంటి మాంసాహార వంటకాలను వడ్డించనున్నారు. శాఖాహారంలో దాల్చా, పచ్చి పులుసు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. వీటికితోడు ఇతర మాంసాహార, శాఖాహార వంటలూ సిద్ధం చేస్తున్నారు. ఇక ఎండల వేడి నేపథ్యంలో చల్ల (మజ్జిగ), అంబలిని కూడా అందుబాటులో ఉంచుతున్నారు. తాగునీటి వసతికోసం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయానికే వంటలన్నీ సిద్ధం చేయాలన్న యోచనతో గురువారం అర్ధరాత్రి నుంచే వంటకాల పని మొదలుపెట్టారు. పటిష్టంగా బందోబస్తు.. టీఆర్ఎస్ ప్లీనరీ కోసం పోలీసుశాఖ పటిష్టంగా బందోబస్తు ఏర్పాట్లు చేసింది. పోలీసులు ప్లీనరీ జరిగే ప్రాంతాన్ని బుధవారమే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత కోసం రెండు వేల మందికిపైగా సిబ్బంది, అధికారులను మోహరిస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్లను గురువారం సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్లీనరీకి ప్రత్యేక రూట్లు.. పార్కింగ్ ప్రాంతాలు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా మార్గాలను, పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు. ఆయా చోట్ల వచ్చే వారంతా వారికి సూచించిన రూట్లలో ప్రవేశించి, కేటాయించిన ప్రాంతంలో వాహనాలను పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. – మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి నుంచి శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. అక్కడ నుంచి పటాన్చెరు, సుతారిగూడ (ఎగ్జిట్ నం.6) వద్ద ఓఆర్ఆర్ దిగి.. 44వ నంబర్ జాతీయ రహదారిపైకి చేరుకోవాలి. తర్వాత కండ్లకోయ, బుర్తన్‌గూడ రోడ్ జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ మీదుగా బృందావన్ కాలనీలో కేటాయించిన పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. – సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట్, పటాన్‌చెరుల నుంచి వచ్చే వాహనాలు బాంబే హైవే, పటాన్చెరు, సుతారిగూడ (ఎగ్జిట్ నం.6) నుంచి 44వ నంబర్ జాతీయ రహదారిపైకి చేరుకోవాలి. తర్వాత కండ్లకోయ, బుర్తన్‌గూడ రోడ్ జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ మీదుగా బృందావన్ కాలనీ పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. – నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, చౌటుప్పల్, హయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి నుంచి పెద్ద అంబర్పేట్ వద్ద ఓఆర్ఆర్ ఎక్కాలి. శామీర్‌పేట వద్ద ఓఆర్ఆర్ దిగాలి. రాజీవ్ రహదారి ప్రయాణించి.. తూంకుంట, హకీంపేట్, బొల్లారం చెక్‌పోస్ట్, బొల్లారం రైల్వేగేట్, ఐస్ ఫ్యాక్టరీ మీదుగా బృందావన్ కాలనీ పార్కింగ్ ప్రాంతానికి రావాలి. – కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్ల, గోదావరిఖని, రామగుండం, మంచిర్యాల, ఆసిఫాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు రాజీవ్ రహదారి, శామీర్‌పేట, తూంకుంట, హకీంపేట్, బొల్లారం చెక్‌పోస్ట్, బొల్లారం రైల్వేగేట్, ఐస్ ఫ్యాక్టరీ మీదుగా బృందావన్ కాలనీ పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. – రామాయంపేట్, తూప్రాన్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి నుంచి మేడ్చల్, కండ్లకోయ, బుర్తన్గూడరోడ్ జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ మీదుగా బృందావన్ కాలనీ పార్కింగ్ ప్రాంతానికి రావాలి. -
'ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన'
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిని దేశంలో నంబర్ వన్ పార్టీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆ దిశలోనే ఈ నెల 27వ తేదీన ఖమ్మంలో పార్టీ 15వ ప్లీనరీని నిర్వహించనున్నామని తెలిపారు. పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, పార్టీ నాయకుడు సుభాష్‌రెడ్డిలతో కలసి ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వ పాలన కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను, పార్టీ కార్యకర్తలను భాగస్వాములను చేసేలా ప్లీనరీ ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేలమంది ప్రతినిధులను ప్లీనరీకి ఆహ్వానించామని, ఆహ్వానాలు అందినవారు మాత్రమే ప్రతినిధుల సభకు హాజరు కావాలని ఈటల సూచించారు. వివిధ అంశాలపై ఈ ప్లీనరీలో చర్చ జరిపి కొత్త ఒరవడికి నాంది పలుకుతామని తెలిపారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 90 శాతం ఇప్పటికే నెరవేర్చామని తెలిపారు. వచ్చే ఏడాది జిల్లాల వారీగా కార్యకర్తలకు శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. -
దీపావళి తర్వాతే టీఆర్ఎస్ ప్లీనరీ..?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీ మళ్లీ వాయిదాపడే అవకాశాలున్నట్టు తెలిసింది. ప్లీనరీని ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించినా హుదూద్ తుపాను కారణంగా 18, 19 తేదీలకు వాయిదా వేశారు. కానీ అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడే అవకాశాలు ఉండటం, దీపావళి వంటి కారణాలతో మళ్లీ వాయిదా పడే అవకాశాలున్నట్టు పార్టీ ముఖ్యులు వెల్లడించారు. దీపావళి తర్వాత జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనే మధ్యలో 2 రోజుల పాటు పార్టీ ప్లీనరీని నిర్వహించాలనే యోచనలో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఉన్నట్టు ఆ నాయకులు తెలిపారు.