17 ఏళ్ల గులాబీ | Telangana Rashtra Samithi 17Th Plenary Session In Hyderabad | Sakshi
Sakshi News home page

17 ఏళ్ల గులాబీ

Published Fri, Apr 27 2018 2:04 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Telangana Rashtra Samithi 17Th Plenary Session In Hyderabad - Sakshi

ప్లీనరీలో ప్రతిపాదించనున్న ఆరు తీర్మానాలివే.. 

  • ఇంటింటికీ సంక్షేమం– ప్రతీ ముఖంలో సంతోషం 
  • దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం ఉద్యమం 
  • సమానాభివృద్ధే ధ్యేయంగా మైనారిటీల సంక్షేమం 
  • సుస్థిర అభివృద్ధికి విస్తృత మౌలిక సదుపాయాల కల్పన 
  • దేశానికే ఆదర్శం తెలంగాణ వ్యవసాయ విధానం 
  • భారీ పాలనా సంస్కరణలు– ప్రజల ముంగిట వ్యవస్థలు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీకి హైదరాబాద్‌ ముస్తాబైంది. ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న ఈ ప్లీనరీ కోసం ఇక్కడి కొంపల్లిలో ఉన్న జీబీఆర్‌ గార్డెన్‌లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. వేదికకు ‘ప్రగతి ప్రాంగణం’గా నామకరణం చేశారు. ప్లీనరీలో ఆరు తీర్మానాలు చేయాలని పార్టీ తీర్మానాల కమిటీ ప్రతిపాదించింది. వాటికి టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. అందులో భవిష్యత్‌ రాజకీయాలపై చేయనున్న తీర్మానంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యంగా, జాతీయ రాజకీయాలకు నాయకత్వం వహిస్తానని కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో స్వాతంత్య్రానంతరం నెలకొన్న పరిస్థితులు, వాటిలో కేసీఆర్‌ ఎలాంటి గుణాత్మక మార్పును ఆశిస్తున్నారు, ఈ దిశగా ఎలాంటి రాజకీయ వ్యూహాలను అనుసరిస్తారనే దానిపై ప్లీనరీ వేదికగా కేసీఆర్‌ మార్గనిర్దేశనం చేయనున్నారు. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తామన్న ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగా ఇప్పటిదాకా జరిగిన పురోగతిని కూడా వెల్లడించే అవకాశముంది. 

దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు, నాయకులతో జరిపిన చర్చలు, ఇంకా ఎవరెవరిని కలుస్తారు, స్థూలంగా రాజకీయ వ్యూహం ఏమిటి, దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించడానికి చేపట్టే కార్యక్రమాలు తదితర అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు. ఈ అంశం టీఆర్‌ఎస్‌ శ్రేణులకే కాకుండా అన్ని రాజకీయవర్గాలకు ఆసక్తి కలిగిస్తోంది. ఒకవేళ జాతీయ, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వేర్వేరు తీర్మానాలు చేస్తే.. ప్లీనరీలో మరో తీర్మానం పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

ప్లీనరీలో ఆమోదించబోయే తీర్మానాలివే.. 
టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ఆరు తీర్మానాలను ప్రతిపాదించనున్నారు. వాస్తవానికి తొలుత 12 నుంచి 15 తీర్మానాలదాకా ప్రతిపాదించాలని అనుకున్నారు. కానీ అనుబంధ అంశాలను కలిపి ఒకే తీర్మానంగా కుదించడం ద్వారా రాజకీయ అంశాలను ఎక్కువగా చర్చించడానికి, ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధుల్లో విసుగు లేకుండా ఉండటానికి ఆరుకు కుదించారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కలిపి ఒకే తీర్మానంగా ప్రతిపాదించనున్నారు. వ్యవసాయంపై తీర్మానంలోనే సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ, రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు వంటివన్నీ చేర్చారు. మౌలిక వసతుల కల్పనలోనే పారిశ్రామిక, విద్య, రోడ్లు, ఫ్లైఓవర్లు వంటివన్నీ పొందుపరిచారు. మరీ అత్యవసరమతే అదనంగా ఒకటి లేదా రెండు తీర్మానాలను అప్పటికప్పుడు ప్రతిపాదించే అవకాశముందని కేసీఆర్‌ సన్నిహితులు వెల్లడించారు. ఇక ఒక్కో తీర్మానం ప్రతిపాదన, బలపర్చడం వంటివన్నీ 20 నిమిషాలకు మించకుండా చూడాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. 

13 వేలకుపైగా ప్రతినిధులు 
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు పార్టీ ప్లీనరీకి హాజరుకానున్నారు. ఒక్కో మండల స్థాయిలో ఎంపీపీ, జెడ్పీటీసీ, పార్టీ అధ్యక్షుడు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఇతర ముఖ్య నేతలతో కూడిన జాబితాను సిద్ధం చేసి ఆహ్వానించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 100 మందికి ఆహ్వానాలు పంపారు. వీరితోపాటు దాదాపు 20 దేశాల్లో ఉంటున్న టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖలు, ఇతర ముఖ్యులు 100 మంది వరకు హాజరవుతున్నారు. మొత్తంగా ప్లీనరీకి 13 వేల మందికిపైగా పార్టీ ప్రతినిధులు హాజరవుతారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. 

విశాల ప్రాంగణం.. విస్తృత ఏర్పాట్లు.. 
హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఉన్న జీబీఆర్‌ గార్డెన్‌లో నిర్వహించే ప్లీనరీలో ప్రతినిధులు కూర్చోవడానికి 9 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూలర్లు ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్యం కోసం వైద్యులను అందుబాటులో ఉంచుతున్నారు. ఇక నగరమంతటా హోర్డింగులు, కటౌట్లు, జెండాలతో గులాబీమయం చేశారు. ప్లీనరీ ప్రాంగణంలో ప్రతినిధుల నమోదు కోసం 34 నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

దాదాపు 15 వందల మంది వలంటీర్లు ఇందుకు సహకరించనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారు సభా ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక ద్వారాలను ఏర్పాటు చేశారు. వీఐపీల భోజనాల కోసం కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఉదయం 8.30కే ప్రతినిధుల నమోదు ప్రారంభం కానుంది. ప్రతినిధులు నమోదు చేసుకున్న తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఇక ప్లీనరీకి వచ్చే వారి వాహనాల పార్కింగ్‌ కోసం దాదాపు 90 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. 

మటన్‌ బిర్యానీ.. పాయా.. నాటుకోడి కూర 
టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ప్రతినిధులకు వడ్డించేందుకు పసందైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ప్రత్యేకంగా వండుకునే తలకాయ కూర, పాయా, మటన్‌ బిర్యానీ, మటన్‌ షోర్భా, నాటుకోడి కూర వంటి మాంసాహార వంటకాలను వడ్డించనున్నారు. శాఖాహారంలో దాల్చా, పచ్చి పులుసు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. వీటికితోడు ఇతర మాంసాహార, శాఖాహార వంటలూ సిద్ధం చేస్తున్నారు. ఇక ఎండల వేడి నేపథ్యంలో చల్ల (మజ్జిగ), అంబలిని కూడా అందుబాటులో ఉంచుతున్నారు. తాగునీటి వసతికోసం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయానికే వంటలన్నీ సిద్ధం చేయాలన్న యోచనతో గురువారం అర్ధరాత్రి నుంచే వంటకాల పని మొదలుపెట్టారు.  

పటిష్టంగా బందోబస్తు.. 
టీఆర్‌ఎస్‌ ప్లీనరీ కోసం పోలీసుశాఖ పటిష్టంగా బందోబస్తు ఏర్పాట్లు చేసింది. పోలీసులు ప్లీనరీ జరిగే ప్రాంతాన్ని బుధవారమే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత కోసం రెండు వేల మందికిపైగా సిబ్బంది, అధికారులను మోహరిస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్లను గురువారం సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. 

ప్లీనరీకి ప్రత్యేక రూట్లు.. పార్కింగ్‌ ప్రాంతాలు.. 
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా మార్గాలను, పార్కింగ్‌ ప్రాంతాలను కేటాయించారు. ఆయా చోట్ల వచ్చే వారంతా వారికి సూచించిన రూట్లలో ప్రవేశించి, కేటాయించిన ప్రాంతంలో వాహనాలను పార్కింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

– మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి నుంచి శంషాబాద్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. అక్కడ నుంచి పటాన్‌చెరు, సుతారిగూడ (ఎగ్జిట్‌ నం.6) వద్ద ఓఆర్‌ఆర్‌ దిగి.. 44వ నంబర్‌ జాతీయ రహదారిపైకి చేరుకోవాలి. తర్వాత కండ్లకోయ, బుర్తన్‌గూడ రోడ్‌ జంక్షన్, ఐస్‌ ఫ్యాక్టరీ మీదుగా బృందావన్‌ కాలనీలో కేటాయించిన పార్కింగ్‌ ప్రాంతానికి చేరుకోవాలి. 

– సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట్, పటాన్‌చెరుల నుంచి వచ్చే వాహనాలు బాంబే హైవే, పటాన్‌చెరు, సుతారిగూడ (ఎగ్జిట్‌ నం.6) నుంచి 44వ నంబర్‌ జాతీయ రహదారిపైకి చేరుకోవాలి. తర్వాత కండ్లకోయ, బుర్తన్‌గూడ రోడ్‌ జంక్షన్, ఐస్‌ ఫ్యాక్టరీ మీదుగా బృందావన్‌ కాలనీ పార్కింగ్‌ ప్రాంతానికి చేరుకోవాలి. 

– నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, చౌటుప్పల్, హయత్‌నగర్‌ నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి నుంచి పెద్ద అంబర్‌పేట్‌ వద్ద ఓఆర్‌ఆర్‌ ఎక్కాలి. శామీర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్‌ దిగాలి. రాజీవ్‌ రహదారి ప్రయాణించి.. తూంకుంట, హకీంపేట్, బొల్లారం చెక్‌పోస్ట్, బొల్లారం రైల్వేగేట్, ఐస్‌ ఫ్యాక్టరీ మీదుగా బృందావన్‌ కాలనీ పార్కింగ్‌ ప్రాంతానికి రావాలి. 

– కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్ల, గోదావరిఖని, రామగుండం, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు రాజీవ్‌ రహదారి, శామీర్‌పేట, తూంకుంట, హకీంపేట్, బొల్లారం చెక్‌పోస్ట్, బొల్లారం రైల్వేగేట్, ఐస్‌ ఫ్యాక్టరీ మీదుగా బృందావన్‌ కాలనీ పార్కింగ్‌ ప్రాంతానికి చేరుకోవాలి. 

– రామాయంపేట్, తూప్రాన్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్‌ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి నుంచి మేడ్చల్, కండ్లకోయ, బుర్తన్‌గూడరోడ్‌ జంక్షన్, ఐస్‌ ఫ్యాక్టరీ మీదుగా బృందావన్‌ కాలనీ పార్కింగ్‌ ప్రాంతానికి రావాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement