kompalli
-
యథేచ్ఛగా ‘ప్రీలాంచ్’ దందా!
సాక్షి, హైదరాబాద్: సామాన్యుల సొంతింటి ఆశలను కొందరు బిల్డర్లు అడియాసలు చేస్తున్నారు. ప్రీ లాంచ్ దందా నిర్వహిస్తూ, ఆకర్షణీయమైన హామీలు ఎరవేస్తూ కోట్లు కొట్టేస్తున్నారు. కొనుగోలుదారులను నట్టేట ముంచేస్తున్నారు. ఇలాంటి అవకతవకలకు పాల్పడిన సాహితీ, భువనతేజ, ఓబిలీ హౌసింగ్ వంటి సంస్థల యజమాను లను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయినా ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి, కొనుగోలుదారుల సొమ్ముతోనే అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తి చేసేలా ఎత్తుగడలు వేస్తూ చివరికు బిచాణా ఎత్తేస్తున్నారు. తాజాగా కొంపల్లిలో భారతి లేక్‌వ్యూ పేరిట అపార్ట్మెంట్ల నిర్మాణానికి ప్రీలాంచ్ ఆఫర్ పెట్టి రూ.60 కోట్లు వసూలు చేసిన ముగ్గురు రియల్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వరకు వెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి రాగా, ప్రీలాంచ్ ఆఫర్ల వలలో చిక్కుకుని అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కోసం ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు హైదరాబాద్‌లో కోకొల్లలుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ తరహా రియల్టర్ల విషయంలో ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో ఈ దందా ఇష్టారాజ్యంగా సాగుతోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇతర పట్టణాభివృద్ధి సంస్థల అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రియల్ వెంచర్ల విషయంలో తగిన చర్యలు చేపట్టాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) సైతం చేష్టలుడిగి చూస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తక్కువ ధరకే చదరపు అడుగు పేరిట..హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు అవతల కూడా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు గృహ నిర్మాణ వ్యయాలు కూడా బాగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో చాలామందికి సొంతంగా 100 లేదా 200 గజాల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకునే పరిస్థితి లేదు. దీంతో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడుతున్న ఉద్యోగులు, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వలస వస్తున్న వారు అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కోకాపేట, గచ్చిబౌలి, మియాపూర్, పటాన్చెరు తదితర డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో బడా సంస్థలు నిర్మించే బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లలో చదరపు అడుగు విస్తీర్ణం ధర రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంది. ఈ పరిస్థితుల్లో రియల్టర్లు, భూదందాలు చేసేవాళ్లు కరీంనగర్, వరంగల్, విజయవాడ, మెదక్ హైవేల వైపు దృష్టి సారించి నాలుగైదేళ్ల క్రితమే ఈ ప్రీలాంచ్ దందాకు తెరతీశారు. అంటే ప్రజల ఆశనే పెట్టుబడిగా పెట్టి ఫ్లాట్లు నిర్మించి ఇవ్వడం అన్నమాట. అపార్ట్మెంటులో ఫ్లాట్ చదరపు అడుగు ధర రూ.3వేల నుంచి రూ.5వేల లోపు నిర్ణయించి, నిర్మాణానికి ముందే చెల్లించే పక్షంలో ఇలా తక్కువ ధరకు ఇస్తామని చెబుతూ లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈ తరహా వెంచర్లు హైదరాబాద్ పరిసరాల్లో వందలాదిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తవుతున్నప్పటికీ మోసపోయిన వాళ్లే అధికంగా ఉంటుండటం గమనార్హం. డబ్బులు చెల్లించినప్పటికీ సరైన సమయంలో ఫ్లాట్లు నిర్మించి ఇవ్వకపోవడంతో బిల్డర్ల చుట్టూ కోర్టులు, పురపాలక సంస్థలు, ‘రెరా’ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. నోటీసులకే పరిమితమవుతున్న ‘రెరా’రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు అడ్డుకట్ట వేయడం, వినియోగదారుడి ప్రయోజనాలను పరిరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2017లో ‘రెరా’ను అమల్లోకి తెచ్చింది. అయితే ఇది ఏడాది క్రితం వరకు నామ మాత్రంగానే ఉండిపోయింది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి సత్యనారాయణ గత సంవత్సరం జూన్‌లో ‘రెరా’ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత కొంత కార్యాచరణ మొదలైందని చెప్పవచ్చు. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా 8 ఫ్లాట్లకు మించిన అపార్ట్మెంట్ల నిర్మాణం జరిపినా, ప్రకటనలు విడుదల చేసినా చర్యలు ఉంటాయని ప్రకటించి, తదనుగుణంగా నోటీసులు జారీ చేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. అయితే ప్రీలాంచ్ ఆఫర్ల విషయంలో ‘రెరా’కు సైతం పూర్తిస్థాయి అధికారాలు లేకపోవడంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేకపోతోంది. ప్రీలాంచ్ ఆఫర్ల గురించి ఎవరైనా ఫిర్యాదు చేసినా, ప్రకటనలు విడుదల చేసినా నోటీసులు జారీ చేసి, చర్యలకు స్థానిక పురపాలక, పంచాయతీ సంస్థలకు రిఫర్ చేయడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ కారణంగానే ప్రీలాంచ్ మోసాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని, ముఖ్యమంత్రి స్థాయిలో ఈ ప్రీలాంచ్ దందాల విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాధితులు కూడా ప్రభుత్వం వీటిపై సరైన చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. -
భూముల కొనుగోళ్లకు టాప్–5 కారిడార్లు
న్యూఢిల్లీ: తెలంగాణలోని కొంపల్లి–మేడ్చల్–శామీర్‌పేట, మహారాష్ట్రలోని నేరల్–మాతేరన్, గుజరాత్ లోని సనంద్–నల్సరోవర్ భూములపై పెట్టుబడులకు టాప్–5 కారిడార్లుగా కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. వచ్చే పదేళ్లలో వీటి నుంచి పెట్టుబడులపై ఐదు రెట్ల వరకు రాబడులు రావచ్చ ని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో భూములను కొనుగో లు చేసే ఇన్వెస్టర్లు.. వాటిని వీకెండ్ హోమ్స్, హాలీడే హోమ్స్, రిటైర్మెట్ హోమ్స్‌గా అభివృద్ధి చేయడం ద్వారా స్థిరమైన అద్దె ఆదాయం పొందొచ్చని పేర్కొంది. దీనికితోడు పెట్టుబడి సైతం వృద్ధి చెందుతుందని, తద్వారా మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ‘‘భూమి పై పెట్టుబడి పెట్టడం రాబోయే రోజుల్లో బంగారం గనిని వెలికి తీసినట్టే అవుతుంది. మెరుగైన రాబడులకు వీలుగా ఆ భూమిని వినయోగించుకోవడం తెలిస్తే పెట్టుబడి కలిసొస్తుంది’’అని కొలియర్స్ ఇండియా పేర్కొంది. మూడు రెట్లు హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి–మేడ్చల్–శామీర్‌పేట కారిడార్‌లో భూములపై రాబడులు వచ్చే పదేళ్లలో మూడు రెట్లు ఉంటాయని కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. పెట్టుబడిని భూమి ఎన్నో రెట్లు పెంచగలదని, సరైన రీతిలో వినియోగిస్తే స్థిరమైన ఆదాయానికి వనరుగా మారుతుందని సూచించింది. అద్దె ఆదాయం, పెట్టుబడి వృద్ధి, వ్యాపార కార్యకలాపాల ద్వారా ఇలా ఎన్నో రూపాల్లో ఆదాయం పొందొచ్చని వివరించింది. దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో వచ్చే సూక్ష్మ మార్కెట్లకు రానున్న సంవత్సరాల్లో మంచి డిమాండ్ ఏర్పడుతుందని, స్మార్ట్ ఇన్వెస్టర్లకు ఇవి మంచి రాబడులు ఇస్తాయని అంచనా వేసింది. -
పెళ్లి హాలులోనే వరుడి ఆత్మహత్య
దుండిగల్: మరికొద్ది గంటల్లో తాళి కట్టా ల్సిన చేతులతో తనమెడకే ఉరితాడు బిగించుకున్నాడు ఓ వరుడు. తల్లి లేని బాధ తెలియనివ్వకుండా పెంచి న తాతయ్య..పెళ్లికి నెల రోజులు ముందే తనువు చాలించడం.. ‘పెళ్లి కొడుకు’ను చేసే కార్యక్రమం విషయ మై తండ్రితో గొడవ వంటి కారణా లతో కుంగిపోయిన వరుడు ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. వరుడిగా పెళ్లిపీట లెక్కితే చూద్దామని మురిసిపోయిన బంధుమిత్రులకు, కుటుంబ సభ్యు లకు గుండెకోత మిగిల్చాడు. వధూవరులను ఆశీర్వదించడానికి వేడుకకు వచ్చిన వారు ఘటన గురించి తెలిసి నివ్వెరపోయారు. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. అల్లారుముద్దుగా పెంచిన తాతయ్య మలక్‌పేటకు చెందిన రిటైర్డ్ లెక్చరర్ నక్కెర్తి శ్రీనివాస్‌చారి, పద్మజ రాణిల కుమారుడు సందీప్(24). చిన్నతనంలోనే సందీప్ తల్లి మృతి చెందింది. దీంతో శ్రీనివాస్‌చారి రెండో వివాహం చేసుకోవడంతో సందీప్ చిన్నతనం నుంచి తాతయ్య జాగేశ్వరరావు వద్ద పెరిగాడు. జాగేశ్వరరావు కూడా సందీప్‌కు తన తల్లి లేని లోటు తెలియనివ్వకుండా పెంచాడు. బీటెక్ వరకు చదువుకున్న సందీప్‌కు బోయిన్‌పల్లికి చెందిన ఓ యువతితో ఏప్రిల్ నెలలో నిశ్చితార్థం చేశారు. అయితే చిన్నప్పటినుంచి తనను అల్లారుముద్దుగా పెంచిన తాతయ్య జాగేశ్వరరావు నెలక్రితం మృతి చెందడంతో సందీప్ బాగా కుంగిపోయాడు. తాతయ్య చనిపోయి నెల కూడా గడవకుండానే తనకు పెళ్లి ఏమిటంటూ వ్యతిరేకిస్తూ వచ్చాడు. అయినప్పటికీ పెద్దలు ఈనెల 10న కొంపల్లి టీ–జంక్షన్లో ఉన్న శ్రీకన్వెన్షన్‌లో పెళ్లి నిశ్చయించారు. ‘పెళ్లి కొడుకు’తంతుపై రేగిన వివాదం.. సాంప్రదాయం ప్రకారంగా తండ్రి ఇంట్లో పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా సందీప్ దీన్ని వ్యతిరేకించాడు. ‘తన తల్లి చనిపోయిన ఇంట్లో నేను ‘పెళ్లి కొడుకు’కార్యక్రమాన్ని చేసుకోలేను’అని సందీప్ చెప్పడంతో ఆ కార్యక్రమానికి ఓ ఇంటిని అద్దెకు కూడా తీసుకుని నిర్వహించారు. ఈ క్రమంలో తండ్రి సందీప్ వైఖరిని తప్పుపట్టగా..ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సందీప్ ఆదివారం తెల్లవారుజామున కొంపల్లిలో ఉన్న వివాహ వేదిక వద్దకు వచ్చి తనకు కేటాయించిన గదిలోకి వెళ్లిపోయాడు. సర్దుకుంటుందనుకుంటే.. సందీప్ కోపాన్ని కుటుంబ సభ్యులు అంతగా పట్టించుకోలేదు. గదిలోకి వెళ్లిన సందీప్‌ను చూసి అంతా సర్దుకుపోతుందనుకుని ఒంటరిగా వదిలేశారు కుటుంబ సభ్యులు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు వివాహ వేడుకలకు సిద్ధం చేసేందుకు సందీప్ గది తలుపును తట్టగా ఎంతకీ స్పందన లేదు. దీంతో మాస్టర్ కీ తో తలుపులు తెరిచి చూడగా సీలింగ్‌కు వేలాడుతూ సందీప్ కనిపించాడు. వెంటనే సందీప్‌ను సుచిత్ర సర్కిల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా..అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరైన బంధువులు ఉదయం 7.30 గంటలకు వరుడు సందీప్ ఆత్మహత్య చేసుకోవడంతో వివాహ వేదికైన శ్రీకన్వెన్షన్ గేట్లు మూసుకుపోయాయి. విషయం తెలియని ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, మిత్రులు ఒక్కొక్కరిగా కన్వెన్షన్ సెంటర్‌కు రాగా జరిగిన విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ‘‘సందీప్ చాలా మంచి పిల్లవాడని, అతను ఇలా చేసుకోవడమేమిట’’ని చెప్పుకుంటున్నారు. ‘సందీప్ ను ఎప్పుడో పదవ తరగతి చదువుతున్నప్పుడు చూశా..ఇప్పుడు పెళ్లి కొడుగ్గా చూద్దామని ఏలూరు నుంచి వచ్చాను.. కాని అతను ఇలా చేసుకుంటాడని అనుకోలేదంటూ’ఓ బంధువు చెప్పుకొచ్చారు. ఆస్పత్రిలో ఘర్షణ పడ్డ సందీప్ తండ్రి.. చిన్నతనం నుంచే తన కొడుకును తనకు కాకుండా దూరం చేశారంటూ సందీప్ తండ్రి శ్రీనివాస చారి గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఈ క్రమంలో జాగేశ్వరరావు తరఫుబంధువులతో సందీప్‌ను తన నుంచి దూరం చేయడమే కాకుండా, తాత, పిన్ని దగ్గరకు రాకుండా కట్టడి చేశారంటూ శ్రీనివాసచారి ఘర్షణ పడగా...పేట్ బషీరాబాద్ పోలీసులు వారిని విడదీశారు. సందీప్ ఆత్మహత్యకు గల ప్రధాన కారణం తాతయ్య మరణమేనా మరేదైనా వ్యవహారం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. సందీప్ ఫోన్ తెరిచిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముందని పేట్ బషీరాబాద్ సీఐ మహేశ్ తెలిపారు. వివాహ వేదిక వద్దనే సందీప్ ఆత్మహత్య కేసును పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఫంక్షన్హాల్లో పెళ్లికుమారుడు ఆత్మహత్య
-
కాసేపట్లో పెళ్లి.. ఫంక్షన్హాల్లో తీవ్ర విషాదం!
సాక్షి, హైదరాబాద్: మరికాసేపట్లో పెళ్లి.. బంధుమిత్రపరివారం రాక మొదలైంది. పచ్చటి పందిరి, మేళతాళాలతో ఫంక్షన్‌హాల్ కూడా ముస్తాబైంది. కాసేపట్లో నూతన వధూవరులు పెళ్లిపీఠాలు ఎక్కాల్సి ఉంది. మూడుముళ్లు, ఏడు అడుగులతో దంపతులై కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. కానీ, ఇంతలో ఏమైంది తెలియదు. పచ్చగా కళకళలాడుతున్న పెళ్లి ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. చక్కగా ముస్తాబై పెళ్లిపీఠాలు ఎక్కాల్సిన వరుడు ఉరిపోసుకున్నాడు. వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన అతడు అంతలో తనువు అర్ధంతరంగా చాలించాడు. ఈ ఘోర విషాద ఘటన షేక్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో పెళ్లి వేడుక నిండుగా జరుగుతుండగానే వరుడు సందీప్ అనూహ్యంగా ఉరేసుకొని చనిపోయాడు. ఉదయం పది గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా.. ఉదయమే వరుడి కుటుంబసభ్యులు, బంధువులు ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్నారు. ఫంక్షన్ హాల్లోని గదిలో వరుడికి మేకప్ చేస్తుండగా ఉదయం ఏడు గంటల సమయంలో ఒంటరిగా గదిలోపలి నుంచి సందీప్ గడియపెట్టుకున్నాడు. ఎంతకూ వరుడు బయటకు రాకపోవడంతో అనుమానించిన కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు బద్దలుకొట్టి తెరవడంతో సందీప్ అప్పటికే ఉరికి వేసుకొని ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే పెళ్లిని రద్దు చేశారు. ఈ ఘటనతో ఫంక్షన్హాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. వధూవరుల కుటుంబాలు దిగ్భ్రాంతి చెందాయి. వరుడి కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస చారి, పద్మ దంపతుల కుమారుడైన సందీప్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతని ఆత్మహత్యకు కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. -
‘సైన్మా’ సూపర్ హిట్
హిమాయత్‌నగర్: అక్కడకు వెళ్తే సినిమా థియేటర్‌కు వెళ్లినట్టుంటుంది. లోనికి అడుగుపెట్టగానే సినిమాకు వచ్చినట్టు అనుభూతి కలుగుతుంది. మనకు కేటాయించిన సీట్లో కూర్చోగానే.. పాత సినిమాల్లోని ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ వీనులకు విందు చేస్తాయి. అదే కొంపల్లిలోని ‘సైన్మా’ రెస్టారెంట్. ఈ హోటల్ సినిమా వాతావరణాన్ని గుర్తు చేస్తే.. ఫుడ్ మాత్రం బాహుబలి సినిమాను తలపిస్తుంది. సరికొత్త థీమ్‌కు కేరాఫ్‌గా నిలుస్తున్న ఈ రెస్టారెంట్ నగర టెక్కీలు, యువతకు తెగ నచ్చేసింది. అంతా ‘సైన్మా’నే తెలంగాణలో సినిమా అనే పదాన్ని ‘సైన్మా’ అని పలుకుతారు. అదే పేరుతో ఓ కొత్త రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలని నగరానికి చెందిన సందీప్‌రెడ్డి, అక్షయ్రెడ్డిలు డిసెంబర్లో కొంపల్లిలో ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ ఎంట్రన్స్ నుంచే ‘సైన్మా’ సందడి మొదలవుతుంటుంది. రెస్టారెంట్ లోపల మొదటి సినిమా నుంచి ఇటీవల విడుదలైన సినిమాల పోస్టర్లు, హీరో, హీరోయిన్ల స్టిల్స్ ఆకట్టుకుంటాయి. ఈ రెస్టారెంట్లో ఉన్నంతసేపు థియేటర్లో ఉన్నట్లే అనిపించడం గమనార్హం. పగలు ఆడియో..రాత్రి వీడియో.. రెస్టారెంట్లో లంచ్ టైంలో ఆపా మధురాలు.. ఓల్డ్ మెలోడీ పాటలు శ్రావ్యంగా వినిపిస్తాయి. లంచ్ అవర్ అంతా ఆడియో సాంగ్స్‌ను వింటూ ఎంచక్కా మనకు నచ్చిన ఫుడ్‌ని ఎంజాయ్ చేయోచ్చు. ఇక రాత్రి డిన్నర్ సెక్షన్‌కు రూటు మార్చుతారు. లోపల పెద్ద స్క్రీన్‌పై అలనాటి వీడియో సాంగ్స్‌ను ప్లే చేస్తారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ.. ఇలా అందరి హీరోల ఎవర్గ్రీన్ వీడియో సాంగ్స్‌తో రెస్టారెంట్ సరికొత్తగా మారిపోతుంది. అంతేకాదు ఇక్కడ వడ్డించే ఫుడ్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. బాహుబలి చికెన్.. తమలపాకు కబాబ్.. బాహుబలి పార్ట్–1, పార్ట్–2 సినిమాలకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న ఈ రెస్టారెంట్ నిర్వాహకులు ‘బాహుబలి చికెన్’ అనే కొత్త కాన్సెప్ట్‌ని పరిచయం చేశారు. బాహుబలి సినిమాలో తల్వార్‌తో హీరో ప్రభాస్ ప్రత్యర్థులను మట్టికరిపించాడు. ఇప్పుడు అదే తరహాలో తల్వార్‌తో చికెన్ పీసులు గుచ్చి అందిస్తారు. చికెన్ కబాబ్‌లో చాలా వెరైటీలే ఇక్కడ ఉన్నాయి. ఈ రెస్టారెంట్లో మరో ప్రత్యేకం ‘తమలపాకు కబాబ్’. పాన్ తింటుంటే ఎలా ఉంటుందో అదే రీతిలో ఈ కబాబ్ ఉంటుంది. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం తాము ప్రవేశపెట్టినట్లు నిర్వాహకులు సందీప్‌రెడ్డి, అక్షయ్‌రెడ్డి చెబుతున్నారు. జింజర్ చికెన్ బిర్యానీ కూడా హైదరాబాద్ బిర్యానీ తరహీ ఫేమస్. మంచి ఘాటుగా ఉండే ఈ బిర్యానీకి నగర టెక్కీలు ఇష్టంగా లాగించేస్తున్నారు. సరికొత్త రుచులుమా ప్రత్యేకత ఇండియాలోనే ఈ థీమ్‌తో వచ్చిన తొలి రెస్టారెంట్ మాదే. నగర వ్యాప్తంగా మారెస్టారెంట్ హాట్ టాపిక్‌గా ఉంది. అందరికీ ‘సైన్మా’ వాతావరణంలో ఫుడ్‌ని తినిపించాలనే కాన్సెప్ట్‌తో దీన్ని ప్రారంభించాం. భోజనప్రియుల కోరికలకు అనుగుణంగా రుచులను అందిస్తాం. – సందీప్‌రెడ్డి, అక్షయ్‌రెడ్డి, ‘సైన్మా’ యాజమాన్యం -
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు
సాక్షి, మేడ్చల్: దేశ రాజకీయాల్లో సమూల మార్పు రావాలని రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ‘దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం’ అనే మొదటి తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్లీనరీ ద్వారా నూతక శకాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. 14 సంవత్సరాల పాటు పోరాడి తెలంగాణ సాధించుకున్నామని, నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా ఏర్పడిదంటే కారణం కేసీఆరేనని కొనియాడారు. అన్ని రాష్ట్రాలను కేంద్రం ఒకే పద్ధతిలో చూడటం లేదని ఆరోపించారు. దేశం రాజకీయాల్లో సమూల మార్పు రావాలన్నారు. కొన్ని అంశాల్లో కేంద్రం మితిమీరిన జోక్యం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్నిఎదుర్కోవడానికి ఫెడరల్ ఫ్రంట్‌గా ఏర్పడి ముందుకు పోవాలని సూచించారు. దేశ రాజకీయాల్లో సమైక్య స్ఫూర్తి వర్ధిల్లాలని, కేంద్ర నిర్ణయాలు ఏకపక్షంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నారు. దేశంలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కి అభినందనలు తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్‌కు అందరూ మద్దతు పలకాలని కేకే కోరారు. ఈ తీర్మానాన్ని ఎంపీ వినోద్ కుమార్‌తో పాటు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ బలపరిచారు. -
17 ఏళ్ల గులాబీ
ప్లీనరీలో ప్రతిపాదించనున్న ఆరు తీర్మానాలివే.. ఇంటింటికీ సంక్షేమం– ప్రతీ ముఖంలో సంతోషం దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం ఉద్యమం సమానాభివృద్ధే ధ్యేయంగా మైనారిటీల సంక్షేమం సుస్థిర అభివృద్ధికి విస్తృత మౌలిక సదుపాయాల కల్పన దేశానికే ఆదర్శం తెలంగాణ వ్యవసాయ విధానం భారీ పాలనా సంస్కరణలు– ప్రజల ముంగిట వ్యవస్థలు సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీకి హైదరాబాద్ ముస్తాబైంది. ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న ఈ ప్లీనరీ కోసం ఇక్కడి కొంపల్లిలో ఉన్న జీబీఆర్ గార్డెన్లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. వేదికకు ‘ప్రగతి ప్రాంగణం’గా నామకరణం చేశారు. ప్లీనరీలో ఆరు తీర్మానాలు చేయాలని పార్టీ తీర్మానాల కమిటీ ప్రతిపాదించింది. వాటికి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. అందులో భవిష్యత్ రాజకీయాలపై చేయనున్న తీర్మానంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యంగా, జాతీయ రాజకీయాలకు నాయకత్వం వహిస్తానని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో స్వాతంత్య్రానంతరం నెలకొన్న పరిస్థితులు, వాటిలో కేసీఆర్ ఎలాంటి గుణాత్మక మార్పును ఆశిస్తున్నారు, ఈ దిశగా ఎలాంటి రాజకీయ వ్యూహాలను అనుసరిస్తారనే దానిపై ప్లీనరీ వేదికగా కేసీఆర్ మార్గనిర్దేశనం చేయనున్నారు. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తామన్న ఫెడరల్ ఫ్రంట్ దిశగా ఇప్పటిదాకా జరిగిన పురోగతిని కూడా వెల్లడించే అవకాశముంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు, నాయకులతో జరిపిన చర్చలు, ఇంకా ఎవరెవరిని కలుస్తారు, స్థూలంగా రాజకీయ వ్యూహం ఏమిటి, దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించడానికి చేపట్టే కార్యక్రమాలు తదితర అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు. ఈ అంశం టీఆర్ఎస్ శ్రేణులకే కాకుండా అన్ని రాజకీయవర్గాలకు ఆసక్తి కలిగిస్తోంది. ఒకవేళ జాతీయ, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వేర్వేరు తీర్మానాలు చేస్తే.. ప్లీనరీలో మరో తీర్మానం పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్లీనరీలో ఆమోదించబోయే తీర్మానాలివే.. టీఆర్ఎస్ ప్లీనరీలో ఆరు తీర్మానాలను ప్రతిపాదించనున్నారు. వాస్తవానికి తొలుత 12 నుంచి 15 తీర్మానాలదాకా ప్రతిపాదించాలని అనుకున్నారు. కానీ అనుబంధ అంశాలను కలిపి ఒకే తీర్మానంగా కుదించడం ద్వారా రాజకీయ అంశాలను ఎక్కువగా చర్చించడానికి, ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధుల్లో విసుగు లేకుండా ఉండటానికి ఆరుకు కుదించారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కలిపి ఒకే తీర్మానంగా ప్రతిపాదించనున్నారు. వ్యవసాయంపై తీర్మానంలోనే సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు వంటివన్నీ చేర్చారు. మౌలిక వసతుల కల్పనలోనే పారిశ్రామిక, విద్య, రోడ్లు, ఫ్లైఓవర్లు వంటివన్నీ పొందుపరిచారు. మరీ అత్యవసరమతే అదనంగా ఒకటి లేదా రెండు తీర్మానాలను అప్పటికప్పుడు ప్రతిపాదించే అవకాశముందని కేసీఆర్ సన్నిహితులు వెల్లడించారు. ఇక ఒక్కో తీర్మానం ప్రతిపాదన, బలపర్చడం వంటివన్నీ 20 నిమిషాలకు మించకుండా చూడాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. 13 వేలకుపైగా ప్రతినిధులు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ ప్రతినిధులు పార్టీ ప్లీనరీకి హాజరుకానున్నారు. ఒక్కో మండల స్థాయిలో ఎంపీపీ, జెడ్పీటీసీ, పార్టీ అధ్యక్షుడు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఇతర ముఖ్య నేతలతో కూడిన జాబితాను సిద్ధం చేసి ఆహ్వానించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 100 మందికి ఆహ్వానాలు పంపారు. వీరితోపాటు దాదాపు 20 దేశాల్లో ఉంటున్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు, ఇతర ముఖ్యులు 100 మంది వరకు హాజరవుతున్నారు. మొత్తంగా ప్లీనరీకి 13 వేల మందికిపైగా పార్టీ ప్రతినిధులు హాజరవుతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. విశాల ప్రాంగణం.. విస్తృత ఏర్పాట్లు.. హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఉన్న జీబీఆర్ గార్డెన్లో నిర్వహించే ప్లీనరీలో ప్రతినిధులు కూర్చోవడానికి 9 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూలర్లు ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్యం కోసం వైద్యులను అందుబాటులో ఉంచుతున్నారు. ఇక నగరమంతటా హోర్డింగులు, కటౌట్లు, జెండాలతో గులాబీమయం చేశారు. ప్లీనరీ ప్రాంగణంలో ప్రతినిధుల నమోదు కోసం 34 నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 15 వందల మంది వలంటీర్లు ఇందుకు సహకరించనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు సభా ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక ద్వారాలను ఏర్పాటు చేశారు. వీఐపీల భోజనాల కోసం కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఉదయం 8.30కే ప్రతినిధుల నమోదు ప్రారంభం కానుంది. ప్రతినిధులు నమోదు చేసుకున్న తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఇక ప్లీనరీకి వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం దాదాపు 90 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. మటన్ బిర్యానీ.. పాయా.. నాటుకోడి కూర టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రతినిధులకు వడ్డించేందుకు పసందైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ప్రత్యేకంగా వండుకునే తలకాయ కూర, పాయా, మటన్ బిర్యానీ, మటన్ షోర్భా, నాటుకోడి కూర వంటి మాంసాహార వంటకాలను వడ్డించనున్నారు. శాఖాహారంలో దాల్చా, పచ్చి పులుసు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. వీటికితోడు ఇతర మాంసాహార, శాఖాహార వంటలూ సిద్ధం చేస్తున్నారు. ఇక ఎండల వేడి నేపథ్యంలో చల్ల (మజ్జిగ), అంబలిని కూడా అందుబాటులో ఉంచుతున్నారు. తాగునీటి వసతికోసం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయానికే వంటలన్నీ సిద్ధం చేయాలన్న యోచనతో గురువారం అర్ధరాత్రి నుంచే వంటకాల పని మొదలుపెట్టారు. పటిష్టంగా బందోబస్తు.. టీఆర్ఎస్ ప్లీనరీ కోసం పోలీసుశాఖ పటిష్టంగా బందోబస్తు ఏర్పాట్లు చేసింది. పోలీసులు ప్లీనరీ జరిగే ప్రాంతాన్ని బుధవారమే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత కోసం రెండు వేల మందికిపైగా సిబ్బంది, అధికారులను మోహరిస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్లను గురువారం సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్లీనరీకి ప్రత్యేక రూట్లు.. పార్కింగ్ ప్రాంతాలు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా మార్గాలను, పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు. ఆయా చోట్ల వచ్చే వారంతా వారికి సూచించిన రూట్లలో ప్రవేశించి, కేటాయించిన ప్రాంతంలో వాహనాలను పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. – మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి నుంచి శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. అక్కడ నుంచి పటాన్చెరు, సుతారిగూడ (ఎగ్జిట్ నం.6) వద్ద ఓఆర్ఆర్ దిగి.. 44వ నంబర్ జాతీయ రహదారిపైకి చేరుకోవాలి. తర్వాత కండ్లకోయ, బుర్తన్‌గూడ రోడ్ జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ మీదుగా బృందావన్ కాలనీలో కేటాయించిన పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. – సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట్, పటాన్‌చెరుల నుంచి వచ్చే వాహనాలు బాంబే హైవే, పటాన్చెరు, సుతారిగూడ (ఎగ్జిట్ నం.6) నుంచి 44వ నంబర్ జాతీయ రహదారిపైకి చేరుకోవాలి. తర్వాత కండ్లకోయ, బుర్తన్‌గూడ రోడ్ జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ మీదుగా బృందావన్ కాలనీ పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. – నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, చౌటుప్పల్, హయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి నుంచి పెద్ద అంబర్పేట్ వద్ద ఓఆర్ఆర్ ఎక్కాలి. శామీర్‌పేట వద్ద ఓఆర్ఆర్ దిగాలి. రాజీవ్ రహదారి ప్రయాణించి.. తూంకుంట, హకీంపేట్, బొల్లారం చెక్‌పోస్ట్, బొల్లారం రైల్వేగేట్, ఐస్ ఫ్యాక్టరీ మీదుగా బృందావన్ కాలనీ పార్కింగ్ ప్రాంతానికి రావాలి. – కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్ల, గోదావరిఖని, రామగుండం, మంచిర్యాల, ఆసిఫాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు రాజీవ్ రహదారి, శామీర్‌పేట, తూంకుంట, హకీంపేట్, బొల్లారం చెక్‌పోస్ట్, బొల్లారం రైల్వేగేట్, ఐస్ ఫ్యాక్టరీ మీదుగా బృందావన్ కాలనీ పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. – రామాయంపేట్, తూప్రాన్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి నుంచి మేడ్చల్, కండ్లకోయ, బుర్తన్గూడరోడ్ జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ మీదుగా బృందావన్ కాలనీ పార్కింగ్ ప్రాంతానికి రావాలి. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి
హైదరాబాద్: నగరంలోని కొంపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయరహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగి ఉన్నలారీని ఢీకొట్టిన కారు : ఇద్దరి మృతి
హైదరాబాద్: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని కొంపల్లి జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతులు బోరంపేటకు చెందినవారిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వాటర్ ట్యాంక్ ఢీకొని విద్యార్థి మృతి
హైదరాబాద్: నగరంలోని కుత్బుల్లాపూర్ పరిధిలోని కొంపల్లి జాతీయరహదారిపై వాటర్ ట్యాంకు ఢీకొని రాజేష్(21) అనే విద్యార్థి మృతి చెందాడు. స్నేహితునితో కలిసి కొంపల్లిలోని సాయిచైతన్య కళాశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాజేష్ బీకాం సెకండియర్ చదువుతున్నాడు. ఈ ప్రమాదంతో సంఘటనాస్థలంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.