‘సైన్మా’ సూపర్‌ హిట్‌ | Sainma Restaurant in Kompalli hyderabad | Sakshi
Sakshi News home page

‘సైన్మా’ సూపర్‌ హిట్‌

Published Wed, Apr 24 2019 7:25 AM | Last Updated on Sat, Apr 27 2019 11:57 AM

Sainma Restaurant in Kompalli hyderabad - Sakshi

హిమాయత్‌నగర్‌: అక్కడకు వెళ్తే సినిమా థియేటర్‌కు వెళ్లినట్టుంటుంది. లోనికి అడుగుపెట్టగానే సినిమాకు వచ్చినట్టు అనుభూతి కలుగుతుంది. మనకు కేటాయించిన సీట్లో కూర్చోగానే.. పాత సినిమాల్లోని ఎవర్‌గ్రీన్‌ హిట్‌ సాంగ్స్‌ వీనులకు విందు చేస్తాయి. అదే కొంపల్లిలోని ‘సైన్మా’ రెస్టారెంట్‌. ఈ హోటల్‌ సినిమా వాతావరణాన్ని గుర్తు చేస్తే.. ఫుడ్‌ మాత్రం బాహుబలి సినిమాను తలపిస్తుంది. సరికొత్త థీమ్‌కు కేరాఫ్‌గా నిలుస్తున్న ఈ రెస్టారెంట్‌ నగర టెక్కీలు, యువతకు తెగ నచ్చేసింది.  

అంతా ‘సైన్మా’నే
తెలంగాణలో సినిమా అనే పదాన్ని ‘సైన్మా’ అని పలుకుతారు. అదే పేరుతో ఓ కొత్త రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలని నగరానికి చెందిన సందీప్‌రెడ్డి, అక్షయ్‌రెడ్డిలు డిసెంబర్‌లో కొంపల్లిలో ఏర్పాటు చేశారు. రెస్టారెంట్‌ ఎంట్రన్స్‌ నుంచే ‘సైన్మా’ సందడి మొదలవుతుంటుంది. రెస్టారెంట్‌ లోపల మొదటి సినిమా నుంచి ఇటీవల విడుదలైన సినిమాల పోస్టర్లు, హీరో, హీరోయిన్ల స్టిల్స్‌ ఆకట్టుకుంటాయి. ఈ రెస్టారెంట్‌లో ఉన్నంతసేపు థియేటర్‌లో ఉన్నట్లే అనిపించడం గమనార్హం. 

పగలు ఆడియో..రాత్రి వీడియో..
రెస్టారెంట్‌లో లంచ్‌ టైంలో ఆపా మధురాలు.. ఓల్డ్‌ మెలోడీ పాటలు శ్రావ్యంగా వినిపిస్తాయి. లంచ్‌ అవర్‌ అంతా ఆడియో సాంగ్స్‌ను వింటూ ఎంచక్కా మనకు నచ్చిన ఫుడ్‌ని ఎంజాయ్‌ చేయోచ్చు. ఇక రాత్రి డిన్నర్‌ సెక్షన్‌కు రూటు మార్చుతారు. లోపల పెద్ద స్క్రీన్‌పై అలనాటి వీడియో సాంగ్స్‌ను ప్లే చేస్తారు. ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్, అమితాబ్‌ బచ్చన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ.. ఇలా అందరి హీరోల ఎవర్‌గ్రీన్‌ వీడియో సాంగ్స్‌తో రెస్టారెంట్‌ సరికొత్తగా మారిపోతుంది. అంతేకాదు ఇక్కడ వడ్డించే ఫుడ్‌ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది.

బాహుబలి చికెన్‌.. తమలపాకు కబాబ్‌..  
బాహుబలి పార్ట్‌–1, పార్ట్‌–2 సినిమాలకు ఎంత క్రేజ్‌ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న ఈ రెస్టారెంట్‌ నిర్వాహకులు ‘బాహుబలి చికెన్‌’ అనే కొత్త కాన్సెప్ట్‌ని పరిచయం చేశారు. బాహుబలి సినిమాలో తల్వార్‌తో హీరో ప్రభాస్‌ ప్రత్యర్థులను మట్టికరిపించాడు. ఇప్పుడు అదే తరహాలో తల్వార్‌తో చికెన్‌ పీసులు గుచ్చి అందిస్తారు. చికెన్‌ కబాబ్‌లో చాలా వెరైటీలే ఇక్కడ ఉన్నాయి. ఈ రెస్టారెంట్‌లో మరో ప్రత్యేకం ‘తమలపాకు కబాబ్‌’. పాన్‌ తింటుంటే ఎలా ఉంటుందో అదే రీతిలో ఈ కబాబ్‌ ఉంటుంది. ఇది ఇండియాలోనే ఫస్ట్‌ టైం తాము ప్రవేశపెట్టినట్లు నిర్వాహకులు సందీప్‌రెడ్డి, అక్షయ్‌రెడ్డి చెబుతున్నారు. జింజర్‌ చికెన్‌ బిర్యానీ కూడా హైదరాబాద్‌ బిర్యానీ తరహీ ఫేమస్‌. మంచి ఘాటుగా ఉండే ఈ బిర్యానీకి నగర టెక్కీలు ఇష్టంగా లాగించేస్తున్నారు.

సరికొత్త రుచులుమా ప్రత్యేకత 
ఇండియాలోనే ఈ థీమ్‌తో వచ్చిన తొలి రెస్టారెంట్‌ మాదే. నగర వ్యాప్తంగా మారెస్టారెంట్‌ హాట్‌ టాపిక్‌గా ఉంది. అందరికీ ‘సైన్మా’ వాతావరణంలో ఫుడ్‌ని తినిపించాలనే కాన్సెప్ట్‌తో దీన్ని ప్రారంభించాం. భోజనప్రియుల కోరికలకు అనుగుణంగా రుచులను అందిస్తాం.     – సందీప్‌రెడ్డి, అక్షయ్‌రెడ్డి,     ‘సైన్మా’ యాజమాన్యం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement