సాక్షి, హైదరాబాద్: దశలవారీగా లాక్‌డౌన్‌ను సడలించడంలో భాగంగా సోమవారం నుంచి రాష్ట్రంలో షాపింగ్ మాల్స్, ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆతిథ్య సేవలను అనుమతించనున్నారు. ఈ క్రమంలో ఆయా సంస్థల నిర్వాహకులు పాటించాల్సిన ప్రామాణిక నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలను అమలు చేయడానికి ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌ల నిర్వాహక కమిటీలు/ట్రస్టులు/సొసైటీలే బాధ్యులని స్పష్టం చేసింది. వీటిని అమలు చేయడంలో విఫలమైతే ఆయా స్థలాలను మూసివేయడంతో పాటు జరిమానాలు విధిస్తామని పేర్కొంది.
ఇవీ సాధారణ మార్గదర్శకాలు..
► ప్రవేశద్వారం వద్ద హ్యాండ్‌వాష్/శానిటైజర్, థర్మల్ స్కానింగ్ సదుపాయం ఏర్పాటు చేసి, కరోనా లక్షణాలు లేని వ్యక్తులకు మాత్రమే ప్రవేశం కల్పించాలి.
► భక్తులు, వినియోగదారులు, సిబ్బంది మాస్కు ధరించడం తప్పనిసరి.
► భారీ సమూహాలు/జన సందోహాలపై కఠిన నిషేధం.. ఏసీల టెంపరేచర్‌ను 24–30 సెంటీ గ్రేడ్‌ల మధ్య సెట్ చేయాలి. గాలిలో తేమశాతం 40–70 నిడివిలో ఉండేలా చూడాలి. ఆయా ప్రాంతాలను క్రమం తప్పకుండా పరిశుభ్రం చేయడంతో పాటు క్రిమిసంహారకాలు పిచికారీ చేస్తుండాలి.
► డోర్‌నాబ్స్, లిఫ్టుల బటన్లు, హ్యాండ్ రెయిల్స్, బెంచీలు, వాష్‌రూంలలోని పరికరాలు, తరచుగా జనం ముట్టుకునే వస్తువులను క్రమం తప్పకుండా 1 శాతం సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేయాలి
► వరుసల్లో ప్రజల మధ్య భౌతిక దూరం ఉండేలా మార్కింగ్ చేయాలి.
► వ్యాలెట్ పార్కింగ్ కోసం తీసుకునే వాహనాల స్టీరింగ్, డోర్ హ్యాండిల్స్, తాళం చెవులు తదితరాలను శానిటైజర్‌తో శుభ్రం చేయాలి.
► లిఫ్టుల్లో నియంత్రిత సంఖ్యలో మాత్రమే వ్యక్తులను అనుమతించాలి.
► షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లలోని గేమింగ్, క్రీడా సదుపాయాలపై నిషేధం కొనసాగుతుంది. మాల్స్‌లో దుస్తుల ట్రయల్స్‌పై అనుమతి లేదు.
మత/ప్రార్థనా స్థలాల్లో పాటించాల్సిన నిబంధనలు
► ప్రాంగణంలో ప్రవేశించే ముందు అందరూ తమ చేతులు, కాళ్లను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి
► స్థల పరిమాణంతో పోల్చితే అధిక సంఖ్యలో భక్తులను అనుమతించరాదు.
► వరుసల్లో నిలబడిన వ్యక్తులను నియంత్రించడానికి అవసరమైతే డిస్పోజబుల్ పేపర్ కూపన్లను జారీ చేయాలి.
► విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను, మజార్లను ముట్టుకోవడానికి అనుమతి లేదు.
► ప్రార్థన కోసం సామూహికంగా ఒకే చాప (జానిమాజ్/మ్యాట్) వాడరాదు. ఎవరి చాప వారు తెచ్చుకోవాలి.
► ప్రసాదం, పవిత్ర జలాలు, తదితర పదార్థాల పంపిణీకి అనుమతి లేదు.
► సామూహిక వంటలు, లంగర్లు, అన్నదానాలు వంటి కార్యక్రమాల్లో భౌతిక దూరం పాటిస్తూ ఆహారం తయారు చేసి పంపిణీ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment