మార్కెట్‌ మళ్లీ కళకళ! | Hyderabad People Back To Shopping | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ మళ్లీ కళకళ!

Published Fri, May 22 2020 3:14 AM | Last Updated on Fri, May 22 2020 8:18 AM

Hyderabad People Back To Shopping - Sakshi

ఈ మోడల్‌లో కలర్, సౌండ్‌ బాగుంటుంది..

మోస్ట్‌ హాపెనింగ్‌ సిటీ ఇండియాలో ఏది..? హైదరాబాద్‌ అని ఓ మూడు నాలుగు నెలల క్రితం చాలామంది ఠక్కున సమాధానం చెప్పేవారు. తెలుగువారే కాదు.. ఈ ప్రశ్నకు ఉత్తరాదిన కూడా ఇలాంటి జవాబే వినిపించేది. ఐటీ ఎగుమతుల్లో బెంగళూరుకు కంగారు పెట్టిస్తున్న వేగాన్ని నమోదు చేసుకుంటుం డటం, పారిశ్రామికంగా వేగంగా అడుగులు ముందుకు పడుతుండటం, నిర్మాణ రంగంలో రెక్కలు కట్టుకున్నట్లు రివ్వున ఎగురుతుండటం.. ఈ చారిత్రక నగరం ప్రత్యేకత. మినీ భారత్‌గా వందల ఏళ్ల నుంచి గుర్తింపు పొందిన భాగ్యనగరం ఇప్పుడు దేశంలో వేగంగా పురోగమిస్తున్న నగరాల జాబితాలో ముందు వరుసలో ఉంది. అందుకే మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సిటీ అంటే షహర్‌ హమారానే.

ఇప్పుడు తన మార్కును లాక్‌డౌన్‌ సమయంలోనూ నిరూపించుకుంటోంది. దేశంలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదు చేసుకుని భయం భయంగా కేంద్రం లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తున్న తరుణంలో.. జనం గడప దాటేందుకు జంకుతారన్న అభిప్రాయం ఉండేది. కానీ.. దుకాణాలు తెరుచుకుని నాలుగు రోజులే అయినా.. హైదరాబాద్‌ యావత్తూ కళకళలాడుతోంది. ఈ సమయంలో జనం రోడ్లపైకి రావటం కరోనా కోణంలో ప్రమాదమే అయినా, జాగ్రత్తలు పాటిస్తూ సిటిజన్లు మళ్లీ బిజీగా మారిపోయారు. నాలుగు రోజుల్లోనే మళ్లీ కార్యాలయాలు తెరుచుకున్నాయి.. కార్యకలాపాలు మొదలయ్యాయి. కొనుగోళ్లు మొదలయ్యాయి. దక్షిణాదిలో చెన్నై, బెంగళూరులు బిక్కుబిక్కుమంటూ ఉంటే హైదరాబాద్‌ మాత్రం ధైర్యంగానే అడుగులు వేస్తోంది. దుకాణాలన్నీ ఒకేసారి తెరిస్తే వీధులు జనంతో నిండిపోయే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం సరి–బేసి పద్ధతిలో తెరవాలని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వాటికి నంబరింగ్‌ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కో రోజు ఒక్కో నంబర్‌ ఆధారంగా దుకాణాలు తెరుస్తున్నారు.

చిరువ్యాపారాల నుంచి..
పురానాపూర్‌ వంతెన.. ఒకప్పుడు మూసీకి రెండు వైపులా ఉన్న నగరాన్ని అనుసంధానిం చేందుకు నిర్మించిన వంతెన. ఇప్పుడు చిరువ్యాపారుల అడ్డా. లాక్‌డౌన్‌ వల్ల బోసిపోయిన ఈ వంతెన ఇప్పుడు మళ్లీ కళకళలాడు తోంది. అఫ్జల్‌గంజ్‌ బ్రిడ్జి, చార్మినార్‌కు వెళ్లే ప్రధాన రహదారి, అమీర్‌పేట, సుల్తాన్‌ బజార్, బడీచౌడీ, సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌.. ఇలా చిల్లర వ్యాపారుల ప్రధాన కేంద్రాలన్నీ పాత రూపును సంతరించుకున్నాయి. కొనుగోలు దారులతో కిక్కిరిసి పోయాయి.

అదే బాటలో నగల దుకాణాలు..
ఇప్పుడిప్పుడే నగల దుకాణాలు తెరుచుకుంటున్నాయి. షాపులను పూర్తి శానిటైజ్‌ చేసి, సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా శాఖలున్న ఓ ప్రధాన నగల దుకాణం గురువారం తెరుచుకుంది. తొలి రోజే పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు వచ్చారు. గొలుసు కట్టు దుకాణాలున్న మరో పెద్ద దుకాణ సముదాయం శుక్రవారం తెరుస్తున్నారు. పైగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు ఫోన్ల ద్వారా కావాల్సిన డిజైన్‌ నగల ఆర్డర్లు ఇవ్వటం విశేషం. ఇవి కాకుండా నగరవ్యాప్తంగా ఉండే చిన్న దుకాణాలు దాదాపు తెరుచుకున్నాయి.

ఊపందుకున్న వాహనాల కొనుగోళ్లు..
విలాసవంతమైన కార్ల కొనుగోలులో హైదరాబాద్‌ మొదటి మూడు, నాలుగు స్థానాల్లో ఉంటోంది. లాక్‌డౌన్‌ సడలింపులతో మళ్లీ కార్ల కొనుగోళ్లు ఊపందుకుంటోంది. వాటితోపాటు బైక్‌లు కూడా బాగా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని షోరూమ్‌లు తెరుచుకున్నాయి. గత నాలుగు రోజుల్లో దాదాపు 2 వేల వరకు వాహనాలు అమ్ముడయ్యాయి.

ఈ డిజైన్‌ చూడండి మేడమ్‌..

మామూలు రోజుల కంటే ఎక్కువగా..
గత రెండు నెలల లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది ఇళ్లలో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు పాడయ్యాయి. ఇప్పుడు దుకాణాలు తెరుచుకోగానే వాటికి ఒక్కసారిగా తాకిడి పెరిగింది. ఈ కేటగిరీ దుకాణాలు దాదాపు వారం కిందటే తెరుచుకున్నాయి. అప్పటి నుంచి అవి కిటకిటలాడుతూనే ఉన్నాయి. ‘లాక్‌డౌన్‌ కంటే ముందు సాధారణ రోజుల్లో మా షోరూమ్‌కు నిత్యం సగటున దాదాపు 50 మంది వరకు కొనుగోలుదారులు వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య సగటున 70 వరకు ఉంటోంది. కొంతకాలం ఇలాగే సాగే అవకాశం ఉంది’అని నగరంలోని ఓ చైన్‌ ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌ నిర్వాహకుడు పేర్కొన్నారు.

సవాళ్లు నగరానికి కొత్త కాదు..
► 1908 సెప్టెంబర్‌.. దాదాపు 17 సెంటీమీటర్ల వర్షపాతం ఏకధాటిగా గంటల తరబడి కొనసాగటంతో మూసీ నది ఉప్పొంగింది. దాదాపు 60 అడుగుల మేర నీళ్లు ప్రవహించి నగరాన్ని ఛిన్నాభిన్నం చేసింది. అఫ్జల్‌గంజ్, ముస్లింజంగ్, చాదర్‌ఘాట్‌ వంతెనలు కొట్టుకుపోయాయి. జనావాసాలను ధ్వంసం చేశాయి. 85 వేల ఇళ్లు నేలమట్టమై 50 వేల మంది మృత్యువాత పడ్డారు. ఇంత భారీ విధ్వంసం తర్వాత వెంటనే నగరం కోలుకుంది. మళ్లీ జనజీవనం సాధారణంగా మారింది.
► 1919–20 స్పానిష్‌ ఇన్‌ఫ్లూయెంజా భీకరంగా విరుచుకుపడటంతో నగరంలో భారీ ప్రాణనష్టం సంభవించింది. లక్షల్లో జనం చనిపోయారు. కానీ నాటి ప్రభుత్వం మృతుల వివరాలు తొక్కి పెట్టడంతో అవి వెలుగు చూడలేదు. కానీ నగరం భారీగా అల్లాడింది. అయినా చూస్తుండగానే కోలుకుంది.


ఇలాంటి జరీ వర్క్‌ వేరే షాపులో దొరకదు..
పుంజుకున్న వస్త్ర వ్యాపారం
వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే సుముహూర్తాలున్న సమయంలోనే లాక్‌డౌన్‌ వచ్చి పడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 వేల వివాహాలు, ఇతర శుభకార్యాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు బట్టల దుకాణాలు తెరుచుకోవటంతో ఒక్కసారిగా కొనుగోళ్లు ఊపం దుకున్నాయి. బుధ, గురువారాల్లో నగరంలోని ప్రధాన వస్త్ర దుకా ణాలు రద్దీగా కన్పించాయి. ‘శుభ కార్యాలు జరిగే సమయంలో లాక్‌ డౌన్‌ వచ్చిపడటంతో మేం దుకా ణాలు తెరవలేదు. లాక్‌డౌన్‌ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో, వ్యాపా రంలో ఎంత నష్టం మిగులుతుందో నన్న చింత వెంటాడింది. షాపులు తెరుచుకున్న తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు ఉంటుం దనుకోలేదు. కానీ ఊహించిన దాని కంటే కొనుగోళ్లు మెరుగ్గానే ఉన్నాయి’అని కోఠిలోని ఓ వస్త్ర వ్యాపారి ముకుంద్‌ దాస్‌ పేర్కొన్నారు.

ఇంత వేగంగా పుంజుకుంటుందనుకోలేదు
‘దుకాణం తెరిచిన మొదటిరోజే 15 కూలర్లు విక్రయించాం. కరోనా ఇంతలా భయపెడుతున్న సమయంలో కూడా జనం ఈమాత్రం కొనుగోలు చేస్తారని మేం ఊహించలేదు. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఇది మరింతగా పెరుగుతుంది. ఇంకా దాదాపు నెల రోజుల పాటు ఎండలు ఉండనున్నందున కూలర్ల కొనుగోలు బాగా జరుగుతాయన్న ఆశాభావం ఉంది.’ – మహ్మద్‌ జావీద్, కూలర్ల దుకాణం నిర్వాహకుడు, అబిడ్స్‌

మరో రెండు చేతులుంటే బాగుండేది
‘రెండే రోజులైంది దుకాణం తెరిచి. 35 మిక్సీల మరమ్మతు చేశాను. నాకు మరో రెండు చేతులుంటే.. ఇంకొన్ని బాగు చేసే వాడిని కదా అనుకున్నాను. ఇన్ని రోజుల తర్వాత దుకాణం తెరిచాను కదా.. ఎవరూ రారేమో అనుకున్నా. కానీ, తొలి రోజు నుంచే జనం వస్తున్నారు.’ – అజీమ్, మిక్సీల మరమ్మతుదారు, ట్రూప్‌బజార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement