బిగ్ నూడిల్ రెస్టారెంట్
సనత్‌నగర్/మారేడుపల్లి : ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు ‘కరోనా’ దెబ్బ ప్రభావం నగరంలోని చైనీస్ రెస్టారెంట్లపై పడింది. చైనా రెస్టారెంట్లు అంటే ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే హైదరాబాదీయుల అభీష్టానికి అనుగుణంగా వంటకాలు అందిస్తున్నప్పటికీ చైనీస్ రెస్టారెంట్లుగా ముద్రపడడంతో ‘అమ్మో చైనీస్’ వంటకాలా? అని నోరెళ్లబెడుతున్నారు. ‘కరోనా’ ప్రభావంతో నాలుగైదు రోజులుగా వ్యాపారం కొంతమేర తగ్గినట్లు వ్యాపార వర్గాలే చెబుతున్నాయి. సాధారణ రోజుల్లో 1.50 లక్షల ఆదాయం ఉంటే, వీకెండ్‌లో రూ.2 లక్షల పైచిలుకు ఆదాయం సమకూరేది. కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో గడిచిన నాలుగైదు రోజులుగా చైనీస్ వంటకాల జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో తమ రెస్టారెంట్ ఆదాయం 10 నుంచి 20 శాత మేర తగ్గినట్లు బేగంపేటలోని ఓ చైనీస్ రెస్టారెంట్ ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు.
సాధారణంగా చైనీస్ రెస్టారెంట్లలో ఎక్కువ శాతం వివిధ రకాల సూప్‌లతో పాటు చికెన్, మటన్, చేపలు, రొయ్యలతో వివిధ రకాల వంటకాలను తయారుచేసి అందిస్తుంటారు. ఆయా రకాల వంటకాలు హైదరాబాదీయులను నోరూరించేవే. కానీ చైనీస్ అనే పదం వినిపిస్తే కొన్ని రోజులు దూరం పెడితే మంచిదన్న ధోరణితో భోజన ప్రియులు ఉన్నట్లు తెలుస్తోంది. చైనీస్ వంటకాలు అనగానే చికెన్, ఎగ్ ఫ్రైడ్‌రైస్, చికెన్, ఎగ్ నూడిల్స్ మాత్రమే కాకుండా చికెన్‌తో స్టీమ్డ్ చికెన్ విత్ వెజిటెబుల్స్ ఇన్ ఏ జింజర్ సాస్, బ్రేస్డ్ చికెన్ ఇన్ స్మోక్‌డ్ చిల్లీ సాస్, చికెన్ విత్ చిల్లీస్ అండ్ బసిల్, జనరల్ టోస్ చికెన్, టైసింగ్ హోయి చికెన్, చికెన్ ఇన్ బ్లాక్ పెప్పర్ సాస్, రోస్ట్ లంబ్ హ్యునన్ సిచ్వన్ స్టైల్, బ్రేస్డ్ లంబ్ ఇన్ మహలక్ సాస్, ఇక సీ ఫుడ్ విషయానికొస్తే డైనమిక్ ఫ్రాన్స్, జుంబో ఫ్రాన్స్, కింక్ ఫ్రాన్స్ హునన్ స్టైల్, సింగపూర్ చిల్లీ ఫ్రాన్స్, మలేషియా కర్రీడ్ ఫ్రాన్స్, పాన్ ఫ్రైడ్ ఏషియా చిల్లి ఫిష్, ఫిష్ పెప్పర్ గార్లిక్ అంటూ రకరకాల పేర్లతో కూడిన వంటకాలను చైనీస్ రెస్టారెంట్లు అందిస్తున్నాయి. వీటికి వెజ్, నాన్‌వెజ్ సూప్స్ అదనం. ఈ క్రమంలో పేర్లు కూడా కొత్తగా ఉండడంతో దాని జోలికి వెళ్లడం ఎందుకులే అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
వెళ్లినా లైట్ ఫుడ్‌కే ప్రాధాన్యం...
కొంతమంది రెస్టారెంట్లకు వెళ్ళినా ఫ్రైడ్ రైస్, నూడుల్స్‌తో పాటు లైట్ ఫుడ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఆయా రెస్టారెంట్ల వ్యాపారం కొంత మేర తగ్గినట్లు సమాచారం. వాస్తవంగా ఆయా రెస్టారెంట్లలో హైదరాబాదీయులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వారి అభిరుచులకు తగ్గట్టుగానే ఆయా రకాల వంటకాలు అందిస్తున్నామని, కరోనాకు, ఇక్కడి వంటకాలకు ఎలాంటి సంబంధం లేదని ఆయా రెస్టారెంట్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడివాసులు రెగ్యులర్‌గా భుజించేవే ఇక్కడ లభిస్తాయి తప్ప సోషల్ మీడియాలో చూపిస్తున్నట్లుగా హైదరాబాద్‌లోని చైనీస్ రెస్టారెంట్లలో అలాంటి పరిస్థితులు ఉండవని పేర్కొంటున్నారు.
బోసిపోతున్న రెస్టారెంట్లు
సికింద్రాబాద్ కార్ఖానాలో బిగ్ నూడిల్,నాన్‌కింగ్ సిఆర్ చైనీస్ రెస్టారెంట్లలో కొద్దిరోజులుగా చైనీస్ డిష్‌ల అమ్మకాలు తగ్గాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ రెస్టారెంట్లు కిటకిటలాడేవి. చైనీస్ డిష్‌లను తినేందుకు నగర వాసులు పెద్ద ఎత్తున రెస్టారెంట్‌లకు వస్తుంటారు. రెస్టారెంట్లలో కూర్చోడానికి స్థలంలేక సుమారు 15 నుంచి 30 నిమిషాల వరకు వేచి ఉండేవారు.
సంక్రాంతి నుంచిఅమ్మకాలు తగ్గాయి
సంక్రాంతిపండుగ తరువాత రెస్టారెంట్‌లో అమ్మకాలు తగ్గాయి. రోజుకు సుమారు 50 వేల వరకు అమ్మకాలు జరుగుతుండేవి. ప్రస్తుతం 30–40 వేల రూపాయల మధ్యలో అమ్మకాలు జరుగుతున్నాయి. చైనీస్ డిష్‌లను ఇష్టపడి తింటుంటారు. ఆన్‌లైన్‌లో ఎక్కువగా బుకింగ్‌లు జరుగుతుంటాయి. రెస్టారెంట్‌కు కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం లేదు. – అహ్క్యన్ , రెస్టారెంట్ నిర్వాహకుడు
Comments
Please login to add a commentAdd a comment