ఢిల్లీలో భూకంపం పుట్టిస్తా | CM KCR Fires On BJP And Congress Governments In TRS Plenary | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో భూకంపం పుట్టిస్తా

Published Sat, Apr 28 2018 1:44 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

CM KCR Fires On BJP And Congress Governments In TRS Plenary - Sakshi

సీఎం చంద్రశేఖర్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌ : ‘‘కమలంపై కోపం వస్తే హస్తానికి, హస్తంపై కోపం వస్తే కమలానికి ఓట్లేసే రోజులు మారాలి.. బైడిఫాల్ట్‌గా గెలిచే రాజకీయాల్లో మార్పు రావాలి.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌.. అది ప్రకటన కాదు.. ఓ ప్రకంపన.. తెలంగాణ గడ్డ నుంచి చేసిన ఈ ప్రకటనకు కాంగ్రెస్, బీజేపీలు వణికిపోతున్నాయి.. గంగవెర్రులెత్తుతున్నాయి.. ఇక హైదరాబాద్‌ నుంచే ఢిల్లీలో భూకంపం పుట్టిస్తా..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దేశ ప్రజల ఉసురుపోసుకున్నాయంటూ నిప్పులు చెరిగారు. 

దేశ రాజకీయ వ్యవస్థలోని లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించినట్టే ఈ దేశ ప్రజలకు మంచి దారి చూపే ఆలోచనతో మడమ తిప్పకుండా ముందుకెళ్తానని శపథం చేశారు. తాను తెలంగాణ వదిలిపెట్టి వెళ్లేది లేదని, ఇక్కడ్నుంచే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానని చెప్పారు. శుక్రవారం మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలో జరిగిన పార్టీ 17వ ప్లీనరీలో కేసీఆర్‌ అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. నిజాయితీగా పనిచేసే ప్రభుత్వం మాది రాష్ట్ర సాధన కోసం పార్టీ ప్రారంభించినప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. అందరి అంచనాలను తలకిందులు చేసి రాష్ట్రాన్ని సాధించాం. 

సాధించిన రాష్ట్రంలో అహర్నిశలు కష్టపడ్డాం. ఎవరెన్ని అవాకులు చెవాకులు పేలినా, గాలి మాటలు మాట్లాడినా దేశంలో నిజాయితీగా నిటారుగా పనిచేసే ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. కొన్ని పనులు చేయాలంటే సాహసం, గుండె ధైర్యం కావాలి. గత ప్రభుత్వాల్లో ఎన్నిసార్లు తండాలను పంచాయతీలు చేయమన్నా చేయలేదు. 4 వేల పైచిలుకు తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుని ప్రజలకు అద్భుత ఉపశమనమిచ్చాం. ఇప్పుడు తెలంగాణ 31 జిల్లాలతో అలరారుతోంది. నేనీ మధ్య బెంగళూరు వెళ్లినప్పుడు మాజీ ప్రధాని దేవెగౌడను కలిశా. ‘కేసీఆర్‌ గారూ.. మీ పథకాలన్నీ మా ప్రజలకు తెలిశాయి. 

ఆ పథకాలన్నీ మా దగ్గర అమలు చేయాలని అడుగుతున్నారు’ అని చెప్పారు. షిర్డీ దర్శనానికి వెళ్లినప్పుడు అక్కడి అధికారులు కూడా అదే మాట చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, హోంగార్డులకు మనమిచ్చిన జీతాలు ఎవరూ ఇవ్వడం లేదు. ఈవోడీబీలో ముందున్నాం. సొంత రెవెన్యూ రాబడిలో నంబర్‌వన్‌గా నిలిచాం. ఒక్కో పథకానికి రూపకల్పన చేసి అమలు చేయడమంటే ఆషామాషీ కాదు. రక్తం రంగరించాలి. మేధస్సు కరిగించాలి. తెల్వంది తెల్సుకోవాలి. అధికారులతో చర్చించాలి. పర్యవేక్షణ చేయాలి. నాలుగేళ్ల పసికూన రాష్ట్రమైనా దీక్షా దక్షతతో సమర్థంగా పనిచేసే కేబినెట్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉండబట్టే ఇది సాధ్యమైంది. మా అందరికీ ప్రాణవాయువులా పనిచేసే 75 లక్షల మంది కార్యకర్తలున్నారు. మీరే మా ఆక్సిజన్‌. ఈ గౌరవం, కీర్తి మీకే దక్కుతుంది. 

ఉత్తమ్‌.. నీకు టీపీసీసీ రాదు, టోపీసీసీ రాదు 
ఎన్నడూ రాజ్యం చేయనోళ్లు, ఆంధ్ర నేతలకు సంచులు మోసినోళ్లు టీపీసీసీ అధ్యక్షులుగా, బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. రాష్ట్రంలో చిల్లరమల్లర యాత్రలు చేస్తున్నరు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డీ.. ఒకటి గుర్తు పెట్టుకో. తెలంగాణ తెచ్చింది గులాబీ జెండా. తెలంగాణ వచ్చింది కాబట్టే నువ్వు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నవ్‌. లేదంటే నీకు టీపీసీసీ రాదు టోపీసీసీ రాదు. ఇంకా సంచులు మోసుకుంటూ ఉండెటోనివి. తెలంగాణ సృష్టించిందే గులాబీ జెండా. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలె. అబద్ధాలు చెప్పడానికి కూడా తెలివుండాలె. నాలుకుందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడతవా. ప్రగతి భవన్‌లో 150 గదులు కట్టుకున్నా అని అంటున్నవ్‌. ప్రగతిభవన్‌లో 15 రూంలు చూపెట్టకపోతే నువ్వు ముక్కు నేలకు రాయాలె. ఒకవేళ నువ్వు 16వ రూం చూపెడితే నేను ఈ రోజు 8 గంటలకాల్లా నా సీఎం పదవికి రాజీనామా చేస్తా. 

హరీశ్‌రావు చక్కర్లు కొట్టాడు 
సాగునీటి మంత్రి హరీశ్‌రావు, ఇరిగేషన్‌ అధికారులు, నేను చక్కర్లు కొట్టి కాళేశ్వరం ప్రాజెక్టు, చనాఖా–కొరాటా, ప్రాణహితలకు ఒప్పందం చేసుకుని వస్తే కొత్తగా చేసిందేమీ లేదంటారా? నేను బేగంపేట ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడే ఈ విషయంపై సవాల్‌ చేసిన. ఒక్కరు రాలేదు. దీంతోనే ఎవరు నిజాలు మాట్లాడుతున్నరో, ఎవరు అబద్ధాలు చెబుతున్నరో అర్థమయితోంది. ఎన్నికలు వస్తున్నయ్‌ కాబట్టి ఏది పడితే అది మాట్లాడతారా? మీరు భవనాల్లో కులికారు. అందలాలు ఎక్కారు. ఏనాడైనా పేదలకు కంటితుడుపుగా పెట్టారే కానీ.. కడుపునిండా పెట్టారా? 2014లో ఎన్నికల ముందు పెట్టిన మేనిఫెస్టోను 100 శాతం అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌. 

దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. సొల్లు పురాణాలు చెప్పొద్దు. ప్రాజెక్టులు కడుతుంటే 250 కేసులు వేస్తరా? ఇన్ని రోజులు మర్యాదగా చూసినా శ్రుతి మించితే ప్రజలు ఊర్కోరు. కేసులు విత్‌డ్రా చేసుకునేంతవరకు తరిమికొడతరు. మీ పార్టీకి చెందిన మంత్రులే మమ్మల్ని మెచ్చుకుంటుంటే మీరు సిగ్గుపడాల్సింది పోయి చిల్లరమల్లర రాజకీయాలు చేస్తున్నరు. దీని వల్ల నగుబాటు పాలు కావడం తప్ప ఏమీ ఉండదు. మాది తెలంగాణను సాధించిన పార్టీ అయితే.. కాంగ్రెస్‌ ఏడు దశాబ్దాల పాటు తెలంగాణను వేధించిన పార్టీ అని ప్రజలు గమనించాలి. 

దేశ రాజకీయాల్లో లోపముంది.. సవరించాలి 
గత ఏడాదిన్నరగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని పరిశీలించిన తర్వాత.. గత అనుభవాలను క్రోడీకరించిన తర్వాత.. 40 ఏళ్ల నా రాజకీయ అనుభవసారాన్ని రంగరించిన తర్వాత.. ఈ దేశంలో జరగాల్సింది జరగడం లేదని, దేశ రాజకీయాల్లో లోపముందని, దాన్ని సవరించాల్సి ఉందనే అభిప్రాయానికి వచ్చా. ఇది నేను ఆషామాషీగా చెప్పడం లేదు. నాకు 64 ఏళ్ల వయసొచ్చింది. పానం బక్కపలచదయినా మొండి ఆలోచన ఉంది. ఏదో జరగాలనే తపన, తెలంగాణ గడ్డ నుంచి దేశానికి ఏదో చేయాలనే ఆలోచనతోనే నేను హైదరాబాద్‌ నుంచి ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రకటన చేసిన. అది ప్రకటన కాదు. ప్రకంపన. దానికి గంగవెర్రులెత్తుతున్నరు.. దద్దరిల్లిపోతున్నరు. 

చిన్న పానం తెలంగాణ గడ్డ నుంచి ప్రకటన చేస్తే రాహుల్‌ గాంధీ స్పందించారు. కేసీఆర్‌.. నరేంద్రమోదీ ఏజెంటని అంటున్నారు. అంటే దేశ రాజకీయాలపై మాట్లాడే అధికారం కాంగ్రెస్, బీజేపీలే తీసుకున్నయా? ఎవరికీ అధికారం లేదా? బీజేపీ ఆయన కేసీఆర్‌ ఫ్రంట్‌కు టెంట్‌ లేదంటడు. మరి టెంట్‌ లేనప్పుడు ఎందుకంత భయం? ఆ భయం.. కేసీఆర్‌. మొండి కదా? ఎత్తిన జెండా దించడు కదా? ఆరునూరైనా వెనక్కు తగ్గడు కదా? అదీ భయం. మీరిచ్చిన స్ఫూర్తి, భగవంతుడిచ్చిన శక్తితో పోరాడుతా. రాష్ట్రం తెచ్చినట్టే దేశానికి మంచి దారి చూపెట్టి తెలంగాణ బిడ్డగా మీ గర్వాన్ని పెంచుతా. మడమ తిప్పేది లేదు. 

దేశ ప్రజలు ఆ నిషా నుంచి బయటపడాలె 
స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్లయింది. సిగ్గుపడాలె. 55 ఏళ్లు కాంగ్రెస్, 11 ఏళ్లు బీజేపీ, 5, 6 ఏళ్లు వేరే పార్టీల ప్రధానులు పనిచేశారు. వేరే పార్టీల ప్రధానులను కూడా వీళ్లు బతకనీయలె. కాంగ్రెస్‌ మీద కోపం వస్తే బీజేపీ గెలవాలి. బీజేపీ మీద కోపం వస్తే కాంగ్రెస్‌ గెలవాలి. ఇది అలవాటైపోయింది. బైడిఫాల్ట్‌గా గెలిచే ఈ రాజకీయాల్లో మార్పు రావాలి. దేశ ప్రజలు కూడా ఆ నిషా నుంచి బయటపడాలి. వాస్తవాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికలు జరుగుతుంటే కావేరి నదీ జలాలపై బీజేపీ, కాంగ్రెస్‌ డ్రామాలాడుతున్నాయి. అదేదో 2014లోనే మాట్లాడొచ్చు కదా.. మాట్లాడరు.. చేయరు. దేశంలో నీటి యుద్ధాలంటరు. మీ అసమర్థ చేతకాని పాలన, దద్దమ్మ రాజకీయాల వల్లే నీటి యుద్ధాలు. 

దేశంలో 70 వేల టీఎంసీల నీరు లభ్యమవుతోంది. ఇది నిజమా కాదా? కాంగ్రెస్, బీజేపీలు జవాబు చెప్పాలె. నన్ను విమర్శించే ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పాలె. ఉంటే చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నరు. దేశంలో 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంది. 40 వేల టీఎంసీల నీళ్లిస్తే, ధర్మం, న్యాయం ప్రకారం పంచితే సరిపోతుంది. మరో 5 వేల టీఎంసీలు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు సరిపోతాయి. ఇంకా 25 వేల టీఎంసీలు మిగులుతాయి. చేతకాక, తెలివిలేక, ఆలోచన లేక నీటి యుద్ధాలు తెస్తున్నరు. కృష్ణా జలాల పంపిణీ కోసం 2004లో బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. 

ఆరు నెలల్లో తీర్పు ఇవ్వమని కేంద్రం ట్రిబ్యునల్‌ని ఆదేశించలేదా? ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చినా దాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేయొచ్చు. ఇదంతా జరిగేసరికి ఒక తరం పోతది. కానీ నీళ్లు రావు. చాటలో తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు నీటి యుద్ధాలు పెడుతున్నరు. రెండు జాతీయ పార్టీలు దేశ రైతాంగాన్ని అరిగోసకు గురిచేసి ఆత్మహత్యల పాలు చేస్తున్నాయ్‌. హర్‌ ఏకర్‌మే పానీ, హర్‌ కిసాన్‌ కో పానీ, హర్‌ ఖేత్‌ మే పానీ అంటూ వాళ్ల మొఖాలు వెలవెలబోయే విధానం రూపొందిస్తాం. మీ కాలం చెల్లిపోయింది. ప్రాంతీయ పార్టీల సమన్వయ కూటమి రైతాంగానికి మంచి చేయడానికి నడుం బిగిస్తోంది. 

వాళ్ల మాటలింటే షెక్కరొస్తది 
దేశం బాగుపడాలంటే మౌలిక వసతుల కల్పన జరగాలి. కాంగ్రెస్, బీజేపోళ్ల మాటలు వింటే షెక్కరొస్తది. అంతర్జాతీయంగా సరుకు రవాణా ట్రక్‌ వేగం గంటలకు 80 కిలోమీటర్లుంటే.. మన దేశంలో 26–36 కిలోమీటర్లుంది. చైనాలో 1.23 లక్షల కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌ హైవేలుంటే, మన దేశంలో 2 వేల కిలోమీటర్లు లేవు. ఇదా మీ గొప్పతనం? ఇది చూసి మురవాల్నా. మీకు దండం పెట్టాల్నా. ఇది ఎవరి గొప్పతనం. కాంగ్రెస్, బీజేపీలు ఈ దేశం ఉసురు పోసుకున్నాయి. చైనాలో గూడ్సు రైళ్లు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పోతే.. మన దేశంలో 24 కిలోమీటర్లు దాటవు. ఇదే మీ ప్రతిభకు ప్రబల నిదర్శనం. పర్యాటక రంగంలో విదేశీయులను ఆకర్షించే తెలివితేటల్లేక.. మనోళ్లు వేల కోట్లు బయట దేశాల్లో ఖర్చు పెడుతున్నరు. 

హైదరాబాద్‌లో సగం ఉండే సింగపూర్‌లో 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటే అక్కడ సరుకు రవాణాకు 4 కోట్ల కంటెయినర్లున్నాయి. చైనాలో 19.59 కోట్ల కంటెయినర్లున్నాయి. 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న మనదేశంలో ఉన్నది 87 లక్షల కంటెయినర్లే. మీ నాయకత్వాన్ని నమ్ముకుంటే, మీ ప్రభుత్వాలే పనిచేస్తే ఈ దేశం బాగుపడతదా? గరీబీ హఠావో లాంటి ఫాల్తు పనికిరాని నినాదాలతో దశాబ్దాల తరబడి ప్రజలను మోసం చేశారు. 1968లో మన దేశ జీడీపీ 180 బిలియన్‌ డాలర్లుంటే.. చైనా జీడీపీ 134 బిలియన్‌డాలర్లుంది. అదే 2016లో మన దేశ జీడీపీ 2,465 బిలియన్‌ డాలర్లుంటే, చైనా జీడీపీ 9,504 బిలియన్‌ డాలర్లుంది. చైనా పురోగమిస్తుంటే మనమేం చేస్తున్నాం? బాధ్యత వహించే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు ప్రజలకేం కావాలో అవి చేయవు. ఏం చేయకూడదో అవే చేస్తాయి. 

మున్సిపాలిటీలకన్నా హీనంగా రాష్ట్రాలు 
ఉమ్మడి జాబితా అంటూ పెత్తనం చెలాయించేందుకు కేంద్రం దగ్గర కొన్ని అంశాలు పెట్టుకున్నరు. రాష్ట్రాలను మున్సిపాలిటీలకన్నా హీనంగా దిగజార్చారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖలు, తాగునీటి వసతి మీ వద్ద ఎందుకు? తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా గట్టు మండలంలో నడిపే స్కూల్‌ గురించి మీకెందుకు? ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన అవసరమా? గ్రామానికి రోడ్డు వేసేందుకు సర్పంచి లేడా? ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వం లేదా? ఉపాధి కూలీలకు ఢిల్లీ పోస్టాఫీసుల నుంచి డబ్బులు వేస్తే అది ప్రజాస్వామ్యమా? ఇది స్థానిక సంస్థలను గౌరవించే విధానమా? కశ్మీర్‌లో రోజూ బాంబులే.. అమాయక ప్రజలను చంపుతున్నరు. పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు జవాన్లు చనిపోతున్నరు. అంతర్జాతీయ దౌత్యంలో తెలివితేటల్లేవు. 

అది చేయకుండా స్కూళ్లు, నీళ్ల కాడ ఉంటరా? సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ న్యూయార్క్‌ రైల్వేస్టేషన్‌లోని టాయిలెట్‌ కన్నా దరిద్రంగా ఉంటది. ఇదేనా వైకుంఠం, ఇదేనా కైలాసం. కమలం మీద కోపం వస్తే హస్తానికి గుద్దురి.. హస్తం మీద కోపం వస్తే కమలానికి గుద్దురి.. దేశం అవమానకర పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటే ధీరేంద్రబ్రహ్మచారిలు, చంద్రస్వామిలు, బీజేపీ ఉంటే ఆశారాంబాపూలు, డేరా రహీంబాబులు వస్తారు. నీరవ్, లలిత్‌ మోడీలు బోడిగుండు కొట్టి పోతరు. వీళ్లెవరు అధికారంలో ఉన్నా స్కీంల పేర్లు, స్కాంల పద్ధతులు మారతాయి తప్ప ప్రజల తలరాత మారుతుందా? ఇంకా మీకు డబ్బా కొట్టి, మిమ్మల్ని పొగిడి మంగళారతులు పాడాల్నా? రాహుల్, అమిత్‌షాలు చెప్పాలి. ఈ రోజులు మారాలే. కేసీఆర్‌ ఏ విధమైన మొండి పట్టుదలతో భూకంపం సృష్టించి, దేశాన్ని ఒప్పించి రాష్ట్రాన్ని సాధించిండో.. రానున్న 2,3 నెలల్లో పక్షిలా తిరిగి దేశంలోని ప్రాంతీయ పార్టీలనన్నింటిని ఏకం చేస్తా. 

ఢిల్లీ పోతా అనుకోవద్దు.. 
ఇప్పుడు నేను హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ పోతా అనుకోవద్దు. హైదరాబాద్‌ నుంచే భూకంపం సృష్టిస్తా. తెలంగాణ వదిలిపెట్టిపోను. ఇక్కడ్నుంచే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తా. మీ ఆశీస్సులు, దీవెనలతో పురోగమిస్తూ దేశం  నలుమూలలా గులాబీ పరిమళాలు వెదజల్లేలా చేస్తా. కాంగ్రెస్, బీజేపీల కబంధ హస్తాల నుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పిస్తా. దేశంలో వేడి నెత్తురుంది. అద్భుత వనరులున్నాయి. కష్టపడి పనిచేసే ప్రజలున్నారు. అయినా పాలించిన నేతల నిష్క్రియా పరత్వమే ఈ దేశానికి శాపంగా మారింది. ఏడు దశాబ్దాలు వేచిచూసినం. ఇంక వేచి చూడం. దేశ రాజకీయాల్లో ప్రభావశీల, క్రియాశీల పాత్ర పోషించి, ఈ తెలంగాణ గడ్డపేరు దేశంలో వేనోళ్ల పొగిడేలా చేస్తా. తెలంగాణ గడ్డ మీదే కాదు.. దేశంలోనూ ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తా. జై తెలంగాణ.. జై భారత్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement