
హైదరాబాద్ : నగరాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, మున్సిపల్ పరిపాలన కమిషనర్ శ్రీదేవి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం మేయర్లు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాబోయే మూడేళ్లలో రూ.55 వేల కోట్లతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటీగా మార్చడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ‘ ఫోకసింగ్ ఆన్ అర్బన్ తెలంగాణ’ అనే కార్యక్రమం మిషన్ మోడ్‌లో చేపట్టాలని ఆదేశించారు.
వచ్చే ఏడాది నుంచి వరసగా మూడేళ్లపాటు రాష్ట్రంలోని అన్ని నగరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సీఎం సూచన చేశారు. నగరాలు, పట్టణాల అభివృద్ధి ప్రణాళికాబద్దంగా జరగాలని కోరారు. అక్రమ లేఅవుట్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. లే అవుట్లలో గ్రీన్ లాండ్ కోసం స్థలం తీసినా, తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేసే విధానానికి స్వస్తి పలకాలన్నారు. హైదరాబాద్‌లోని గండిపేట, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ లాంటి చెరువులను గోదావరి నీటితో నింపాలని, అలాగే మురికి నీరు చెరువుల్లో కలవకుండా చూడాలని సూచించారు. మురికి నీటిని శుభ్రం చేయడానికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment