'చేనేత సమస్యలు పరిష్కరిస్తాం' | CM KCR Speaks over Weavers Problems in telangana | Sakshi
Sakshi News home page

'చేనేత సమస్యలు పరిష్కరిస్తాం'

Published Fri, Jan 13 2017 3:01 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

'చేనేత సమస్యలు పరిష్కరిస్తాం' - Sakshi

'చేనేత సమస్యలు పరిష్కరిస్తాం'

శాశ్వత ఉపాధి కోసం ఖర్చుకు వెనుకాడం: కేసీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌:
చేనేత కార్మికుల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకయినా వెనకాడబోదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పద్మశాలి, దాని ఉపకులాలకు చెందిన చేనేత కార్మికులను కాపాడే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కె.తారకరామారావును ఆదేశించారు. చేనేత కార్మికుల సంక్షేమం అంశంపై గురువారం ప్రగతి భవన్‌లో సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు చేనేత శాఖ డైరెక్టర్‌ శైలజారామయ్యార్, ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్, సమాచార శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు,  సీఎంవో అధికారులు భూపాల్‌రెడ్డి, స్మితా సబర్వాల్, శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన కులాలవారి సంక్షేమం, ఆ కులాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ చెప్పారు. యాదవులు, గొల్ల కుర్మల కోసం గొర్రెల పెంపకం; ముదిరాజ్, బెస్త, గంగపుత్రుల కోసం చేపల పెంపకం వంటి కార్యక్రమాలను విప్లవాత్మక రీతిలో ప్రారంభించినట్లుగానే... చేనేతపై ఆధారపడి జీవిస్తున్న పద్మశాలి, ఉప కులాల కోసం కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. వినియోగదారుల ఇష్టాయిష్టాలను గుర్తించి ఉత్పత్తికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. సామాజిక పరిణామ క్రమంలో దేశవ్యాప్తంగా కుల వృత్తులు కనుమరుగు అవుతున్నాయని, కుల వృత్తులపై ఆధారపడి జీవించేవారికి మేలు కలిగేలా ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేపట్టాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

సమగ్ర నివేదిక ఇవ్వండి
భేటీ సందర్భంగా చేనేత పరిశ్రమల నుంచి వినియోగదారులకు అందుతున్న ఉత్పత్తుల గురించి సీఎం ఆరా తీశారు. సిరిసిల్ల, నల్లగొండ, వరంగల్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత మగ్గాలు, మరమగ్గాల సంఖ్య, వాటిపై ఆధారపడి జీవిస్తున్నవారి సంఖ్య, నెలసరి ఆదాయం, చేనేత కార్మికుడు స్వయం సమృద్ధి చెంది తన కుటుంబంతో సుఖంగా జీవించేందుకు చేపట్టాల్సిన పనులు, వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుతో చేనేత కుటుంబాలకు దొరికే ఉపాధి విస్తృతి, సూరత్‌–ముంబై తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన చేనేత కార్మికులను తెలంగాణకు తిరిగి రప్పించి ఉపాధి కల్పించేందుకు ఉన్న అవకాశాలు..వంటి అంశాలపై నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement