సాక్షి, హైదరాబాద్ : కరోనావైరస్(కోవిడ్-19)ను ఎదుర్కొనేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం పెద్దగా లేదని, అయినప్పటికీ తాము అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. శనివారం శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని.. కరోనాపై ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అవసరమైతే రూ.1000 కోట్లు కాదు రూ.5000 కోట్లు ఖర్చు చేసైనా కరోనాను కట్టడి చేస్తామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, శానిటైజర్లు, సూట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
గతంలో కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి కోలుకున్నాడని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామన్నారు. తెలంగాణలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదైందని చెప్పారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని సభలో కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, శాంపిల్స్‌ను పుణె ల్యాబ్‌కు పంపామని కేసీఆర్ చెప్పారు.
‘కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హైలెవల్ కమిటీ చర్చిస్తోంది. ప్రస్తుతం ప్రమాదం లేకున్నా ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. బెంగళూరులో కూడా సంస్థలను మూసేశారు. చాలా రాష్ట్రాలలో థియేటర్లు, స్కూళ్లు బంద్ చేశారు. మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరోనా కోసం సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. డీసీపీ ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన కమిటీని పర్యవేక్షిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో 200 మంది స్క్రీనింగ్ చేస్తున్నారు. హైలెవల్ కమిటీ చర్చించిన అంశాలను రాష్ట్ర మంత్రివర్గం కూడా చర్చిస్తుంది. ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తాం’ అని కేసీఆర్ అన్నారు.
దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా వైరస్ సోకగా ఇందులో 17 మంది విదేశీయులు ఉన్నారని సీఎం తెలిపారు. 65 మందిలో 10 మందిని డిశ్చార్జి చేశారని పేర్కొన్నారు. ఈ వైరస్ వల్ల కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారని కేసీఆర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో కరోనాపై విస్తృతంగా చర్చిస్తామని చెప్పారు. పాఠశాలల బంద్, తదితర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి సాయంత్రం ప్రకటిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment