గూండాగిరీ నడవదు.. కేసీఆర్‌ తీవ్ర హెచ్చరిక | CM KCR Strong Warning To RTC Employees | Sakshi
Sakshi News home page

గూండాగిరీ నడవదు.. కేసీఆర్‌ తీవ్ర హెచ్చరికలు

Published Sun, Oct 13 2019 3:20 AM | Last Updated on Sun, Oct 13 2019 3:16 PM

CM KCR Strong Warning To RTC Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్లుగా చెప్పుకునే వారు ప్రకటిస్తున్నారు. ఉధృతం చేసినా, పిల్లిమొగ్గలు వేసినా ప్రభుత్వం చలించదు. బెదిరింపులకు భయపడదు. బస్సులు నడిపి, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. బస్సులను ఆపి, బస్టాండ్లు, బస్‌ డిపోల వద్ద అరాచకం చేద్దామని చూస్తే సహించేది లేదు. గూండాగిరీ నడవదు. ఇప్పటివరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉంది. ఇకపై కఠినంగా వ్యవహరిస్తుంది. బస్‌ స్టాండ్లు, బస్‌ డిపోల వద్ద ఎవరు బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది’అని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉత్పన్నమైన పరిస్థితులపై శనివారం ప్రగతి భవన్‌లో సమీక్షించారు. ప్రతి ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తు పెంచాలని, అన్నిచోట్ల సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించాలని, నిఘా పోలీసులను ఉపయోగించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, బస్సులను ఆపేవారిని, ఇతర చట్ట వ్యతిరేక  కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి, కోర్టుకు పంపాలని, ఉద్యమం పేరిట విధ్వంసం సృష్టిస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదని సమావేశం నుంచే డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫోన్‌ చేసి ఆదేశించారు.

ఎవరినీ ఎవరు డిస్మిస్‌ చేయలేదు.. 
‘యూనియన్‌ నేతల పిచ్చి మాటలు నమ్మి కార్మికులు అనధికారికంగా గైర్హాజరయి తమంతట తామే ఉద్యోగాలు వదులుకున్నారు. అంతే తప్ప ఎవరినీ ఎవరు డిస్మిస్‌ చేయలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సూపర్‌ వైజర్లను కూడా సమ్మెలోకి లాగారు. యూనియన్‌ నేతలు అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించి 48 వేల మంది ఉద్యోగాలు పోయేలా చేశారు. విధులకు హాజరుకాని వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశమే లేదు. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదు.. పండుగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఆర్టీసీని నష్టపరిచిన కార్మికులను క్షమించే ప్రసక్తే లేదు. అసలు వారు చేస్తున్నది సమ్మె కానే కాదు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. విధులకు హాజరైన ఉద్యోగులు, కార్మికుల సెప్టెంబర్‌ జీతం వెంటనే విడుదల చేస్తాం’అని సీఎం వివరించారు.

నాదాష్‌ దుష్మన్‌లా పరిస్థితి.. 
‘అర్థరహిత డిమాండ్లతో, చట్ట విరుద్ధంగా కార్మికులు చేస్తున్న సమ్మెకు రాష్ట్రంలో కొన్ని రాజకీయ పక్షాలు మద్దతివ్వడం అనైతికం. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, న్యాయ సమ్మతం కాని కోర్కెలతో సమ్మె చేసే వారికి మద్దతిచ్చే రాజకీయ పక్షాలకు ప్రజల మద్దతు లేదు. అసలు రాష్ట్రంలో సరైన ప్రతిపక్షమే లేదు. రాష్ట్రంలో పరిస్థితి నాదాన్‌ దుష్మన్‌ అనేలా ఉంది. రాజకీయ ప్రయోజనం కోసం గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తున్నాయి. వారి ఆశ ఫలించదు. గతంలో అనేక విషయాల్లో తప్పుడు వైఖరి వల్లే వారు ప్రజల మద్దతు కోల్పోయారు. ఆర్టీసీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో వేటిని కూడా ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయట్లేదు’అని సీఎం పేర్కొన్నారు.

అక్కడ అలా.. ఇక్కడ ఇలాగా? 
‘బీజేపీ నేతలు బాగా మాట్లాడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రైల్వే వ్యవస్థను, రైళ్లను ప్రైవేటీకరిస్తోంది. ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించింది. చివరికి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను కూడా ప్రైవేటీకరించింది. వివిధ ప్రభుత్వ రంగసంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర బడ్జెట్‌లోనే చెప్పింది. అక్కడి వారి ప్రభుత్వం ఇలా చేస్తుంటే, ఇక్కడి ఆ పార్టీ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు’అని మండిపడ్డారు.



వెంటనే నియామకాలు.. 
‘మూడు రోజుల్లో వంద శాతం బస్సులు పునరుద్ధరించాలి. ఇందుకు అసవరమైన సిబ్బందిని వెంటనే తీసుకోవాలి. రిటైర్డ్‌ ఆర్టీసీ డ్రైవర్లు, రిటైర్డ్‌ పోలీస్‌ డ్రైవర్లను ఉపయోగించుకోవాలి. బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం కలిగిన వారిని పనిలోకి తీసుకోవాలి’అని సీఎం ఆదేశించారు. ‘ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం ఆర్టీసీలో 50 శాతం (5,200) సంస్థ సొంత బస్సులు నడపాలి. ఇందుకు అవసరమైన సిబ్బదిని వెంటనే నియమించాలి. 30 శాతం(3,100) అద్దె బస్సులు నడపాలి. ఇందులో ఇప్పటికే 21 శాతం ఉన్నాయి. మరో 9 శాతం బస్సుల కోసం వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలి. 20 శాతం (2,100) ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా పర్మిషన్లు ఇవ్వాలి’అని సీఎం స్పష్టం చేశారు. సమీక్షలో మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, సీనియర్‌ అధికారులు సునీల్‌ శర్మ, నర్సింగ్‌రావు, సందీప్‌ సుల్తానియా, ట్రాన్స్‌పోర్ట్‌ జాయింట్‌ కమిషనర్లు పాండురంగనాయక్, సి.రమేశ్, మమతా ప్రసాద్, డీటీసీలు ప్రవీణ్‌ రావు, పాపారావు, ఆర్టీసీ ఈడీలు టీవీ రావు, యాదగిరి, వినోద్, వెంకటేశ్వర్లు, రమేశ్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement