పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి త్వరలో సీఎం కె.చంద్ర శేఖర్‌రావు జిల్లాకు...
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే ఆల
నేడు సీఎం పర్యటన తేదీ ఖరారయ్యే అవకాశం
భూత్పూర్ : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి త్వరలో సీఎం కె.చంద్ర శేఖర్‌రావు జిల్లాకు రానుండటంతో ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకదృష్టి సారించారు. బుధవారం మండలకేంద్రంలో కలెక్టర్ టీకే శ్రీదేవి స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి పర్యటించారు. తహశీల్దార్ కార్యాలయం వెనకభాగంలో సీఎం సభా ప్రాంగణాన్ని ఏర్పాటుచేసే స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సీఎం పర్యటన రూట్‌మ్యాప్‌లపై స్థానిక అధికారులతో చర్చించారు. అంతేకాకుండా మండల పరిధిలోని కర్వెన వద్ద నిర్మించనున్న రిజర్వాయర్ పనుల శంకుస్థాపనకు మండల కేంద్రంలో పైలాన్ నిర్మాణంపై చర్చించారు.
సభాప్రాంగణం, పైలాన్ ఏర్పాట్లపై వెంటనే ఇంజనీర్లు స్థలాలను ఎంపికచేసి నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం హెలిప్యాడ్ ప్రాంగణం, సభ ప్రాంగానికి సీఎం వెళ్లే మార్గాలు గుర్తించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సభాప్రాంగణానికి చుట్టుపక్కల దారులను గుర్తించాలని అధికారులకు సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. కలెక్టర్ వెంట భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ వనజాదేవి, మహబూబ్‌నగర్ ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ గిరిష్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రమౌళి, తహశీల్దార్ పాండు, ఎంపీడీఓ గోపాల్, భూత్పూర్ సర్పంచ్ శోభరత్నం, టీఆర్‌ఎస్ నాయకులు నారాయణగౌడ్, భూషణ్‌కుమార్, మురళీధర్‌గౌడ్ ఉన్నారు.