- సీఎం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నం
- జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష
- అధికారులతో కలిసి నగరంలో పర్యటన
సాక్షి ప్రతినిధి,ఖమ్మం: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మే 4, 5 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. గతనెల శ్రీ రామనవమి సందర్భంగా భద్రాచలం, మణుగూరు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం మరోసారి జిల్లా వస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఇక్కడకు వస్తున్నట్లు తెలియవస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.
ఇదిగో షెడ్యూల్..అదిగో ఏర్పాట్లు..
ముఖ్యమంత్రి వచ్చేనెల 4వ తేదీ నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నుంచి నేరుగా ఖమ్మం చేరుకుని ఇక్కడే బస చేస్తారు. 5వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలిస్తారు. పలు మురికివాడల్లో ఈ పర్యటన కొనసాగుతుంది. అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సీఎం చేత అభివృద్ధి పనులను ప్రారంభింపజేసేందుకు జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు కసరత్తు ప్రారంభించారు.
కేసీఆర్ పర్యటన దాదాపు ఖరారు కావడంతో ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏయే ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారో.. తదితర అంశాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి, ఎస్పీ షానవాజ్‌ఖాసిం, జాయింట్ కలెక్టర్ దివ్య, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులతో సమావేశమై పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.
సీఎం దృష్టికి తీసుకెళ్లండి..
ఖమ్మం నగరంలో అర్హులైన పేదలకు పట్టాలు ఇచ్చినప్పటికీ ఇళ్ల స్థలాలు చూపించాల్సి ఉంది. రఘునాథపాలెం మండలం బాలపేట సమీపంలో గతంలో నిర్ణయించిన స్థలంలో దాదాపు 3,400 మందికి పైగా ఇళ్లస్థలాలు ఇప్పించే అంశంపై అధికారులతో మంత్రి చర్చించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం- ఆవశ్యకతను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని తుమ్మల అధికారులకు సూచించారు. ఈ మేరకు బుధవారం మంత్రి, జిల్లా అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అలాగే వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న అటవీశాఖకు సంబంధించిన నర్సరీని తుమ్మల సందర్శించారు.
వరంగల్ క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఏ మేరకు వినియోగించవచ్చునో అధికారులతో చర్చించారు. అనంతరం రోటరీనగర్‌లో ఉన్న ప్రభుత్వ డెయిరీని మంత్రి పరిశీలించారు. గతంలో ఈ డెయిరీ ప్రదేశంలో నూతన బస్టాండ్ నిర్మించాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి బస్టాండ్ కోసం ఈ స్థలాన్ని పరిశీలించారు.
అలాగే రఘునాథపాలెం మండల రెవెన్యూ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయానికి అనువైన స్థలాన్ని మండలంలోని బల్లేపల్లి తదితర ప్రాంతాల్లో మంత్రి, జిల్లా ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. నగరంలోని రమణగుట్ట, కాల్వొడ్డు, బొక్కలగడ్డ, గోళ్లపాడు చానల్ ప్రాంతాలను పరిశీలించారు. సీఎం 5వ తేదీ నగరంలో భారీ బహిరంగ సభలో పాల్గొనే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే ఆ కార్యక్రమంలో నగరంలోని పలువురు లబ్ధిదారులకు సీఎం చేతులమీదుగా రుణాలు, యంత్ర పరికరాలను అందించేందుకు సంబంధిత కార్పొరేషన్ అధికారులు సమాయత్తం అవుతున్నారు.
ప్రాధాన్యత సంతరించుకున్న పర్యటన
త్వరలో ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని స్పష్టం కావడంతో సీఎం నగర పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లా అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు సీఎం పర్యటనకు సంబంధించి భారీ బందోబస్తుకు కసరత్తు ప్రారంభించారు. ఇటు టీఆర్‌ఎస్ శ్రేణులు సైతం ముఖ్యమంత్రి ఖమ్మం నగరంలో తొలిసారి పర్యటిస్తున్నందున భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం ముందుగా మూడు రోజులు పర్యటిస్తారని అనుకున్నప్పటికీ 4, 5 తేదీల్లో మాత్రమే సీఎం పర్యటన ఖరాారైనట్లు అధికారులు చెబుతున్నారు. 6వ తేదీన సీఎం ఢిల్లీ పర్యటన ఉండటంతో 5వ తేదీ సాయంత్రం నగరంలో పర్యటన ముగించుకుని నేరుగా హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
4న సారొస్తారు..!
Published Fri, May 1 2015 1:44 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM
Advertisement
Advertisement