సాక్షిప్రతినిధి, ఖమ్మం : పార్టీ కోసం ఇన్నాళ్లూ కష్టపడ్డారు. ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కొందరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగానే.. వీరిలో అసంతృప్తి మొదలైంది. దానిని తొలగించేందుకు పార్టీ నేతలు నడుం బిగించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను వివరిస్తూ.. వారిని బుజ్జగిస్తూ.. రాజకీయ భవిష్యత్‌కు భరోసా ఇచ్చేందుకు ముఖ్య నేతలు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది.
టికెట్ల ఖరారు పూర్తి కావడంతో ఇక నియోజకవర్గాల్లో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలు, సొంత పార్టీలో అసమ్మతి స్వరాలను బుజ్జగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా నేతలు దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలకు కేసీఆర్ టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. ఇందులో సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు ప్రకటించిన అభ్యర్థులపై టీఆర్‌ఎస్ నేతల్లో రగులుతున్న అంతర్గత అసంతృప్తులు ప్రకంపనలు సృష్టిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పాలేరు, ఖమ్మం, వైరా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్‌కుమార్, బానోత్ మదన్‌లాల్‌కు టికెట్ ఖాయమని ముందు నుంచే ప్రచారమైంది.
ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలు సైతం లేకపోవడంతో టీఆర్‌ఎస్ ఎప్పుడు అభ్యర్థులను ప్రకటించినా.. వీరికి టికెట్లు ఖాయమని పార్టీ వర్గాలు విశ్వసించాయి. అనుకున్నట్లుగానే ఈ ముగ్గురికి టికెట్లు లభించినా.. సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు సంబంధించి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం.. పార్టీ సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, లింగాల కమల్‌రాజ్ పేర్లను ఖరారు చేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి ప్రకంపనలు రేపుతుండగా.. అదుపు చేసేందుకు పార్టీ ముఖ్య నేతలు నడుం బిగించినట్లు ప్రచారం జరుగుతోంది.
సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పార్టీ నేత డాక్టర్ మట్టా దయానంద్ టికెట్ తనకే లభిస్తుందన్న విశ్వాసంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా.. జిల్లా దిశ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన పిడమర్తి రవికి కేసీఆర్ మరోసారి సత్తుపల్లి నుంచి అవకాశం ఇవ్వడంతో మట్టా దయానంద్ వర్గీయుల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. అయితే స్థానికుడిగా ఉన్న దయానంద్‌కు టికెట్ ఎందుకు ఇవ్వరంటూ పార్టీ వర్గాలు ప్రశ్నించడమే కాకుండా.. ఆందోళనకు సైతం పూనుకోవడంతో పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సత్తుపల్లి టీఆర్‌ఎస్ టికెట్‌ను స్థానికులకే ఇవ్వాలంటూ దయానంద్ అభిమానులు సత్తుపల్లి పట్టణంలోనూ, నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ ఈ తరహా పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించిన టీఆర్‌ఎస్ నేతలు.. దయానంద్‌కు రాజకీయ పరిస్థితులను వివరించడం ద్వారా ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
నచ్చజెప్పే ప్రయత్నాలు..
ఇక మధిర నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మెర రామ్మూర్తి సైతం తనకు టికెట్ లభిస్తుందని ఆశించారు. ఆయనతోపాటు నియోజకవర్గానికి చెందిన మరికొందరు ఈ టికెట్‌పై ఆశ పెట్టుకుని.. ఇటీవల పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మధిర నియోజకవర్గం టికెట్ కోసం జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత సైతం తొలుత ప్రయత్నాలు చేశారని, అవకాశం వస్తే పోటీ చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇక బొమ్మెర రామ్మూర్తి వర్గీయులు కొంత అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నా.. ఆయనను అనునయించడానికి టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు రంగంలోకి దిగి.. ఆయన రాజకీయ భవిష్యత్‌కు సంబంధించి భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
సత్తుపల్లి నుంచి టికెట్ ఆశించిన మట్టా దయానంద్ రాజకీయ భవిష్యత్‌కు సైతం పార్టీ ముఖ్య నేతలు భరోసా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఖమ్మం, పాలేరు, వైరా నియోజకవర్గాల్లో విజయ దుందుభి మోగించాలని భావిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రతి చిన్న అంశాన్ని ప్రత్యేక దృష్టితో పరిశీలిస్తూ.. పార్టీలో ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే అంశంపై దృష్టి సారించారు. గ్రామాలు.. పట్టణ ప్రాంతాల్లోనూ పట్టుండి రాజకీయాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్న టీఆర్‌ఎస్ ఉద్యమ నేతలను, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవడం ద్వారా రాజకీయ పరిస్థితులను వివరించి.. పార్టీ విజయానికి కృషి చేయాల్సిన పరిస్థితులను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment