శ్రీరాంపూర్ : సమగ్ర కుటుంబ సర్వేతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. సర్వే సందర్భంగా కార్మికులు ఇంటి వద్దే ఉండాలని యాజమాన్యం మంగళవారం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. దీంతో కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో మైనింగ్ ఆపరేషన్స్ నిలిచాయి. భూగర్భ గనులు, ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. జిల్లా పరిధిలో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి బెల్లంపల్లి రీజియన్ అంటారు.
ఈ రీజియన్ పరిధిలో మొత్తం 15 భూగర్భ గనులు, 4 ఓసీపీలు ఉన్నాయి. ఇందులో సుమారు 23 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. రీజియన్‌లోని గనుల్లో ఒక్క రోజు బొగ్గు ఉత్పత్తి సుమారు 30 వేల టన్నులు ఉంటుంది. సమగ్ర కుటుంబ సర్వేతో ఈ ఉత్పత్తిని సింగరేణి నష్టపోయింది. తద్వారా సుమారు రూ.4.5 కోట్ల నష్టం వాటిల్లింది. వేతనంతో కూడిన సెలవు ఇవ్వడంతో కంపెనీపై రూ.3 కోట్ల వేతన భారం పడింది. కాగా, రీజియన్ నుంచి సుమారు 1500 మంది ఉద్యోగులను కంపెనీ ఎన్యూమరేటర్లుగా పంపింది.
మొదటిసారి..
సింగరేణిలో మొదటి సారిగా కార్మికులకు వేతనంతో కూడిన సెలవును యాజమాన్యం ప్రకటించింది. పండుగ సందర్భంగా ఇచ్చే సెలవును యాజమాన్యం ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఇవ్వడం ఇదే ప్రథమం. సర్వే కోసం కార్మికులు చాలా మంది ఇంటి వద్దే ఉన్నారు. ఇతర ప్రాంతాల కార్మికులు, అధికారులు స్వస్థలాలకు తరలివెళ్లారు.
సమ్మె వాతావరణం..
కార్మికులు రాక గనులపై సమ్మె వాతావరణం కనిపిం చింది. మ్యాన్‌రైడింగ్, టబ్బులు, తట్టాచెమ్మస్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బొగ్గుపెళ్ల కూడా బయటికి రా లేదు. గనుల ముందు ఉన్న హోటళ్లూ మూసి ఉన్నా యి. సెక్యూరిటీ సిబ్బంది, పంప్ ఆపరేటర్లు వంటి అత్యవసర సిబ్బంది కొందరే విధుల్లో ఉన్నారు. ఓసీపీల్లోనూ ఓవర్‌బర్డెన్ మట్టి పనులు నిలిచిపోయాయి. సీహెచ్‌పీలు, డిపార్ట్‌మెంట్‌లు, వర్క్‌షాపుల్లోనూ ఇదే పరిస్థితి. దూర ప్రాంతాలకు బొగ్గు రవాణా చేసే లారీలు ఉత్పత్తి లేక యార్డుకే పరిమితమయ్యాయి.
ఇబ్బంది పడ్డ కార్మికులు.....
సర్వే సందర్భంగా కార్మికుల్లో కొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడక్కడ కొందరు బినామీ పేర్లతో కంపెనీలో పనిచేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నప్పటికీ ప్రస్తుత సర్వేలో ఏ పేరు చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డారు. గతంలో డిపెండెంట్ ఉద్యోగాలు కొ నుక్కొని చేస్తున్నవారు, వేరే కులంతో పనిచేస్తున్నవారు ఇక్కట్లకు గురయ్యారు.
అంతేకాకుండా కొత్తగా క్వార్టర్లు వచ్చినవారు, క్వార్టర్లు మారినవారు పాత అడ్రస్ వద్దకు వెళ్లి సర్వేలో వివరాలు నమోదు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఇంటి నంబర్ కుదరకపోవడం, ఎన్యూమరేటర్ల వద్ద పాత పేర్లు ఉండడంతో కొంత గందరగోళ పరిస్థితి తలెత్తింది. క్వార్టర్‌కు ఒకే నంబర్ ఇవ్వడం, ఇంటి మొత్తాన్ని ఒకే యూనిట్‌గా రాసుకోవడంతో పలువురు కార్మికులు ఇబ్బందులు పడ్డారు.
బొగ్గు ఉత్పత్తికి బ్రేక్
Published Wed, Aug 20 2014 2:36 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement