
బొగ్గు దొంగలపై పోలీసుల ఉక్కుపాదం
కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో బొగ్గు మాఫియా ఆటకట్టించడానికి ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్ వేట ప్రారంభించారు.
గోదావరిఖనిలో కార్డెన్ సెర్చ్
కోల్‌సిటీ: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో బొగ్గు మాఫియా ఆటకట్టించడానికి ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్ వేట ప్రారంభించారు. బొగ్గు దొంగతనాలపై ‘సాక్షి’ వరుసన కథనాలు సంచలనం సృష్టించాయి. ఇంతకాలం మౌనందాల్చిన పోలీసులను ‘సాక్షి’ కథనాలు కదిలించేలా చేశాయి. బొగ్గు మాఫియాను సీరియస్‌గా తీసుకున్న ఏఎస్పీ బుధవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ‘కార్డెన్ సెర్చ్’ నిర్వహించారు. వన్‌టౌన్ సీఐ ఆరె వెంకటేశ్వర్, నలుగురు ఎస్సైలు, 100 మంది కానిస్టేబుళ్లతో ఇంటింటిని సోదా చేశారు. స్థానిక భరత్‌నగర్, విఠల్‌నగర్, 7బీ కాలనీ, 6బీ గుడిసెలు, సంజయ్‌నగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
స్థానిక సంజయ్‌నగర్‌లో కంటే రామస్వామి, బొగ్గు దేవేందర్‌లు బొగ్గు నిల్వ చేస్తూ పోలీసులను, సింగరేణి సెక్యూరిటీ విభాగం అధికారులను చూసి పారిపోయారు. పొదల్లో రూ.15 వేల విలువ గల సుమారు నాలుగు టన్నుల బొగ్గును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కుటుంబాలకు ఏఎస్పీ కౌన్సెలింగ్ నిర్వహించారు. సింగరేణి సెక్యూరిటీ విభాగం జూనియర్ ఇన్‌స్పెక్టర్ అమిరిశెట్టి వైకుంఠం ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే, అనుమానాస్పందంగా కనిపించిన 7బీ కాలనీకి చెందిన బొల్లి శ్యాం, భూక్య ఏసు, నిమ్మల సెల్వరాజ్‌తోపాటు రాంనగర్‌కు చెందిన నల్ల శ్రీనివాస్, సంజయ్‌నగర్‌కు చెందిన సిరికొండ సదానందంలను బైండోవర్ చేసినట్లు తెలిపారు.