
మాట్లాడుతున్న కలెక్టర్ ధర్మారెడ్డి
మెదక్ రూరల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ప్రచారం కోసం అభ్యర్థులు చేసే ఖర్చుపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ ధర్మారెడ్డి సహాయ వ్యయ పరిశీలకులకు సూచించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సహాయ వ్యయ పరిశీలకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యయ పరిమితి దాటి ఖర్చు చేసిన గ్రామ పంచాయతీలు లేవా అని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఒక్క చోట కూడా ఎన్నికలకు సంబంధించి వ్యయ పరిమితి దాటినట్లు దృష్టికి రాకపోవడం ఏమిటని ఆయన అన్నారు.
ఈసారి జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల్లో వ్యయ పరిమితిని పక్కాగా పరిశీలించాలన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచార ఖర్చు రూ. 4లక్షలు కాగా, ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచార ఖర్చు రూ.1.50లక్షలుగా ఎన్నికల సంఘం నిర్ధారించిందన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సహాయ వ్యయ పరిశీలకులు అభ్యర్థుల ఖర్చు విషయంలో పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు చేసే ప్రచారా ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పరిధి చిన్నగా ఉన్నందున అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. తమ పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువ ఖర్చు చేసే వారి వివరాలను సేకరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి లక్ష్మీబాయి, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు పరశురాం, నోడల్ అధికారి రాజిరెడ్డి, పరిశ్రమ శాఖ జిల్లా మేనేజర్ రత్నాకర్‌తోపాటు సహాయ వ్యయ పరిశీలకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment