
కలెక్టర్‌తో మాట్లాడుతున్న వృద్ధురాలు సోనాబాయి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్.. సోమవారం ఉదయం ప్రజావాణిలో కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు.. ఇంతలో బండ్లగేరిలోని అద్దె ఇంట్లో ఉంటున్న వృద్ధురాలు ఆర్.సోనాబాయి నడవలేక నడవలేక అతి కష్టంగా కర్ర సాయంతో వచ్చింది.. ఆమెను చూడగానే కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి విషయమేమిటని ఆరా తీశారు.. ‘కొన్నేళ్లుగా నేను, నా కొడుకు ఉంటున్న కిరాయి ఇంటి నుంచి ఖాళీ చేయాలని యజమాని చెబుతున్నారు.. ఇప్పటికప్పుడు ఖాళీ చేసి ఎక్కడికెళ్తాం బిడ్డా.. కొంచెం సమయం ఇవ్వమని నువ్వైనా చెప్పు’ అంటూ వేడుకుంది.
దీంతో చలించిపోయిన కలెక్టర్.. ‘మా ఇంట్లో ఉందువు రా... అమ్మా... నీ కెలాంటి ఇబ్బంది ఉండదు. అన్నీ నేను చూసుకుంటాను’ అని చెప్పాడు. అయితే, ఆ వృద్ధురాలు మాత్రం ‘నీకెందుకు కష్టం బిడ్డా.. కొన్నిరోజులు ఆ ఇంట్లోనే ఉండేలా యజమానికి చెప్పు’ అని కోరగా.. కలెక్టర్ వెంటనే సోనాబాయికి కొంత గడువు ఇచ్చేలా యజమానితో మాట్లాడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించడంతో ఆమె ‘నువ్వు సల్లంగా ఉండు బిడ్డా’ అంటూ ఆనందంగా వెనుతిరిగింది.
Comments
Please login to add a commentAdd a comment