పింఛను వయసు రాలేదట! | pention struggles | Sakshi
Sakshi News home page

పింఛను వయసు రాలేదట!

Published Mon, Feb 6 2017 10:53 PM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM

పింఛను వయసు రాలేదట! - Sakshi

పింఛను వయసు రాలేదట!

ముగ్గు బుట్టలాంటి తెల్లటి జుట్టు.. వంగిన నడుము.. సహకరించని శరీరంతో నడవలేక నడుస్తున్న ఈ అవ్వ పేరు తోటకూర వరలక్ష్మి. కామవరపుకోట మండలం రావికంపాడుకు చెందిన ఈమె వయసు 70 ఏళ్లు పైమాటే. ఈ వృద్ధురాలికి పింఛను వయసు రాలేదట. ఈ మాట సెలవిచ్చింది సాక్షాత్తు ప్రభుత్వ అధికారులు. వృద్ధాప్య పింఛను ఇప్పించండయ్యా అంటూ ఎంపీడీఓ కార్యాలయానికి కాళ్లరిగేలా తిరిగిన ఆమెకు ’అమ్మా.. పింఛను తీసుకునేందుకు నీ వయసు సరిపోదు. అందువల్ల నీకు పింఛను రాదు’ అని తిప్పి పంపేశారు. ’ఏంటయ్యా బాబూ.. కాటికి కాళ్లు చాపుకున్న నాకు వయసు సరిపోదని పింఛను ఇవ్వనంటారా. ఇదేం విడ్డూరం’ అంటూ ప్రశ్నించించి. ప్రయోజనం లేకపోవడంతో గోడు చెప్పుకుందామని సోమవారం ఏలూరు వచ్చి కలెక్టర్‌ కె.భాస్కర్‌ను కలిసింది. తనకు పింఛను ఇప్పించాలని వేడుకుంది. ’నా గోడు విని కలెక్టర్‌ బాబూ సాయం చేస్తాడనుకుంటే.. మళ్లీ ఎంపీడీఓకు రాశారు. ఇదేంటోనయ్యా. ఎంపీడీఓ ఆఫీసుకు వెళితే వయసు చాలదు పొమ్మన్నారు. ఇక్కడికొస్తే మళ్లీ అక్కడికే వెళ్లమని పంపుతున్నారు. నాకేమీ అర్థం కావట్లేదు’ అని వృద్ధురాలు వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.
 
 మరిన్ని 
 
+ వయసు 70 ఏళ్ల దాటినా.. కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామానికి చెందిన తోటకూర వరలక్ష్మి అనే వృద్ధురాలికి వయసు చాలదంటూ పింఛను తిరస్కరించారు. ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదు. కలెక్టరేట్‌కు వచ్చి గోడు వెళ్లబోసుకుంటే.. తిరిగి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లమని తిప్పిపంపించారు.
 
+ ఒకాయన ఈ మధ్యే రూ.60 లక్షలు ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకున్నాడు. మరో పెద్దాయనకు పెద్ద భవంతి, కారు అన్నీ ఉన్నాయి. వారికి వృద్ధాప్య పింఛన్‌ ఇస్తున్నారు. అదే గ్రామంలో భర్త చనిపోయి పూడగడవని స్థితిలో ఉన్న దళిత మహిళలకు మొండిచెయ్యి చూపించారు. జన్మభూమి కమిటీలో సభ్యురాలిగా తానిచ్చిన ప్రతిపాదనల్ని ఆమోదించకుండా డబ్బున్న వారికి పింఛన్లు ఇచ్చారని లింగపాలెం మండలం మల్లేశ్వరం పరిధిలోని శింగగూడెం పంచాయతీ 9వ వార్డు సభ్యురాలు మాదాసి వరలక్ష్మి ఆరోపించింది.
 
ఈ సిత్రాలు ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ సమక్షంలో చోటుచేసుకున్నాయి. 
 
   + ప్రభుత్వం ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల్లోనూ అగ్రకులాల ఆధిపత్యమే నడుస్తోందని, దళిత ప్రజాప్రతినిధులకు కొంచెం కూడా విలువ ఇవ్వడం లేదని శింగగూడెం 9వ వార్డు సభ్యురాలు వరలక్ష్మి ఆరోపిస్తోంది. జన్మభూమి కమిటీలో సభ్యురాలిగా ఉన్న తనకు తెలియకుండా పంచాయతీలో పనులు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నిస్తోంది. గ్రామంలో జరిగే పనుల వివరాలు కూడా తనకు తెలియనివ్వడం లేదని, పేదవారికి ఎలాంటి న్యాయం జరగడం లేదని,  తమ సంతకాలు లేకుండా పింఛన్లు, ఇళ్లు, దీపం పథకాలను మండలాధికారులు మంజూరు చేస్తున్నారని వాపోయింది. పింఛన్ల జాబితా అడిగితే.. ’మీ నాయకులను అడగండి’ అని ఎంపీడీఓ అంటున్నారని ఆరోపించింది. తమ గ్రామంలో జన్మభూమి కమిటీల పేరుతో అన్నీ అనర్హులకు కట్టబెడుతున్నారని.. విచారణ జరిపి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరింది.  పై రెండు ఘటనలు జిల్లాలో పింఛన్లు, ఇళ్లు, ఇతర విషయాల్లో జన్మభూమి కమిటీల ముసుగులో చేస్తున్న అరాచకాలకు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం మేలుకుంటుందో లేదో మరి.
                              సాక్షి ప్రతినిధి, ఏలూరు
 
 
 
 
 
 
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement