- సోమవారానికల్లా ఒక్క ఫిర్యాదు ఉండొద్దు
- కలెక్టర్ ఎం.జగన్మోహన్
- ఫోన్‌ఇన్‌కు ఇప్పటి వరకు 116 దరఖాస్తులు
- ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
- కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల విభాగం
ఆదిలాబాద్ అర్బన్ : ప్రజలు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సమస్యను అధికారులకు విన్నవించినా పరిష్కారం కాకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కారం నిమిత్తం సంబంధిత శాఖల అధికారులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులకు ఇచ్చిన అర్జీలు ఇంటికి తీసుకెళ్లిపోతున్నారని, ఫిర్యాదుదారులకు రశీదు కోసం వారికే ఇచ్చేయాలని సూచించారు.
రెవెన్యూ విభాగానికి సంబంధించి ఏ ఒక్కటీ పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. వచ్చే సోమవారానికల్లా ఫోన్‌ఇన్ కార్యక్రమానికి వచ్చిన ఏ ఒక్క అర్జీ కూడా పెండింగ్‌లో కనిపించొద్దని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఫోన్‌ఇన్‌కు 116 దరఖాస్తులు రాగా, 50 సమస్యలు పరిష్కరించినట్లు అదనపు జేసీ ఎస్‌ఎస్.రాజు తెలిపారు. పరిష్కారం కానీ వివరాల గురించి కలెక్టర్ తెలుసుకున్నారు. ఖానాపూర్, జైపూర్ మండలాల తహశీల్దార్లకు ఫోన్‌ఇన్‌లో సమస్యలు పరిష్కారం కాలేదని, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌లో కిరణా షాపు లోన్‌కు సంబంధించిన సబ్సిడీ విడుదలపై నాలుగు ఫిర్యాదులు, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఆటో లోన్‌కు సంబంధించి ఒక ఫిర్యాదు, పీవో ఐటీడీఏలో టెంట్‌హౌజ్ లోన్‌కు సంబంధించి ఒక ఫిర్యాదు, ఇతర శాఖల వారీగా ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని అదనపు జేసీ వివరించారు. సమావేశంలో అదనపు జేసీ రాజు, డీఆర్వో సంజీవరెడ్డి, డీఈవో సత్యనారాయణ, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ యాదయ్య, డీఎస్‌వో ఉదయకుమార్, అధికారులు పాల్గొన్నారు.
‘గ్రీవెన్స్’లో కలెక్టర్ సీరియస్
Published Wed, Apr 29 2015 2:21 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
Advertisement
Advertisement