
హరితహారంతో ఎంతో మేలు
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కె. తారకరామారావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హరితహారం కార్యక్రమం ద్వారా భావితరాలకు ఎంతో మేలు చేకూరనుందని పంచాయతీరాజ్ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరితహారంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో కేటీఆర్ సమీక్షించారు.గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ విభాగాల సిబ్బందిని హరితహారం కార్యక్రమానికి వినియోగించుకోవాలని...
గ్రామం యూనిట్‌గా దీనిని చేపట్టాలని, గ్రామ సర్పంచ్‌లకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మొక్కల పెంపకం బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించాలన్నారు. ఈ నెల 25 నుంచి హరిత హారంపై ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని, దీనికోసం తెలంగాణ సాంస్కృతిక సారథుల సేవలను వినియోగించుకోవాలని సూచిం చారు. ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంతో తెలంగాణ సుభిక్షంగా మారనుందన్నారు.
చెట్లుంటేనే వానలొస్తాయ్:
వీడియో కాన్ఫరెన్స్‌లో మెదక్ జిల్లా ఫసల్‌వాడి సర్పంచ్ శాయమ్మతో కేటీఆర్ ముచ్చటించారు. చెట్లుంటేనే కాసింత నీడకాచుకోవచ్చని, చెట్లుంటేనే వానలొస్తాయని ఆమె మంత్రికి వివరించింది.
ప్రజల్లోకి హరితహారం: రసమయి
శనివారం సచివాలయంలోని విలేకరుల సమావేశంలో తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ మాట్లా డుతూ హరితహారాన్ని ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్తామని వ్యాఖ్యానిం చారు. హరితహారంపై సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలను పాట రూపకంగా మలచినట్లు తెలిపారు.