ఒంటిపై పెట్రోల్ పోసుకున్న మహిళలు
నల్లగొండ కలెక్టరేట్‌లో కలకలం
రాంనగర్: నల్లగొండ కలెక్టరేట్ ఆవరణలో ముగ్గురు మహిళలు పెట్రోలు పోసుకున్న ఘటన సోమవారం కలకలం రేపింది. చెరువు నీటిలో మునిగి పోతున్న వ్యవసాయ భూమి సమస్యను అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పెద్దగూడ గ్రామానికి చెందిన మేకపోతుల రాధిక తన తల్లి లక్ష్మమ్మ, సాదుకున్న తల్లి పేరమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టరేట్ ఆవరణలో గడ్డి ల్యాన్‌లోకి వెళ్లి ముగ్గురు మహిళలు వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకున్నారు.
ఆ సమయంలోనే కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ ఎన్. సత్యనారాయణ కారు దిగి వారి దగ్గరకు వెళ్లి మాట్లాడారు. సమస్య పరిష్కారానికి ఇది మార్గం కాదని, అధికారులు అనేక పనుల్లో తలమునకలై ఉంటారని, వెంటనే కావాలంటే ఎలా అని ప్రశ్నించారు. తాము 15 సంవత్సరాల నుంచి పరిహారం కోసం ఎదురు చూస్తున్నామని బాధితులు తెలిపారు. చెరువులో మునిగిపోతున్న భూమి పరిహారం గురించి ఇరిగేషన్ శాఖ అధికారులకు జేసీ సిఫారసు చేశారు.