‘ప్రగతి’ దారులు చూపండి
* కలెక్టర్ల సమావేశంలో సీఎం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించాలని సీఎం కేసీఆర్ సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సూచించారు. సమావేశం అనంతరం కలెక్టర్ రొనాల్డ్ రోస్ జిల్లాకు సంబంధిం చిన వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి తగు ప్రతిపాదనలు పంపించాలని సీఎం ఆదేశించారు. ఈ పథకం కింద ఇంటింటికీ నల్లా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. దీంతోపాటు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువులు, కుంటల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. రూ. 3.35 కోట్లతో చేపట్టనున్న హరితహారం కార్యక్రమంలో జిల్లా అంతటా మొక్కలు నాటాలి. రహదారులు, భవనాల శాఖ పరిధిలో ని రోడ్ల అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధిం చిన పనులకు వెంటనే టెండర్లు పిలవాలి.
సొంత భవనాలు లేని ప్రభుత్వ కార్యాలయాలకు వెంటనే సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి. శిథిలావస్థలో ఉన్నవాటిని మరమ్మతులు చేయాలి లేదా కొత్త భవనాలు నిర్మించాలి. ఆహార భద్రతా పింఛన్ల జాబితా రూపకల్పనలో, పింఛన్ల పంపిణీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తానికి జిల్లా సమగ్రాభివృద్ధికి కావల సిన పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.