త్వరలో రుద్రమదేవి మహిళా వర్సిటీ!
* తెలంగాణకు ప్రత్యేక మహిళా వర్సిటీ
* వరంగల్ జిల్లాలో ఏర్పాటు
* త్వరలో అధికారిక ప్రక్రియ
సాక్షి, హన్మకొండ: వరంగల్ జిల్లాలో మరో ప్రతి ష్టాత్మక విద్యాసంస్థ నెలకొల్పే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాకతీయరాణి రుద్రమదేవి పేరుతో మహిళా వర్సిటీని వరంగల్ జిల్లాలో స్థాపించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం పరి శీలిస్తోంది. వరంగల్-హైదరాబాద్ రహదారిలో మహిళా వర్సిటీ స్థాపనకు అవసరమైన స్థలాల కోసం అన్వేషిస్తోంది. అన్నీ కుదిరితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీని నెలకొల్పారు.
తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర మూడు ప్రాంతాలకు 36:42:22 నిష్పత్తిలో ఇక్కడి కోర్సుల్లో విద్యార్థినులు ప్రవేశాలు పొందుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పద్మావతి మహిళా వర్సిటీలో చేరేందుకు తెలంగాణకు చెందిన విద్యార్థినులు ఆసక్తి చూపడం లేదు. 2012-13 విద్యా సంవత్సరంలో ఈ వర్సిటీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఈ వ్యవహారంలో పద్మావతి మహిళా వర్సిటీలో వివిధ కోర్సులు చదువుతున్న దాదాపు 200కు పైగా తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇబ్బం దులు పడ్డారు. దీంతో తెలంగాణలో మహిళా వర్సిటీ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో రుద్రమదేవి పేరుతో మహిళా వర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వరంగల్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతానని సీఎం కేసీఆర్ మాట ఇచ్చిన నేపథ్యంలో మహిళా వర్సిటీని ఇక్కడే ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.