వరంగల్‌లోని జువెనైల్ హోంలో జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర జువెనైల్ బోర్డు డెరైక్టర్ భాస్కరచారికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది.
జువెనైల్ బోర్డు డెరైక్టర్‌కు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ షోకాజ్ నోటీసు
హైదరాబాద్/వరంగల్, న్యూస్‌లైన్: వరంగల్‌లోని జువెనైల్ హోంలో జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర జువెనైల్ బోర్డు డెరైక్టర్ భాస్కరచారికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. జువెనైల్ హోంలో ఓ బాలుడు పక్కలో మూత్రం పోస్తున్నాడనే నెపంతో అతడిని హింసించడమే కాక మిగతా పిల్లలతో అతడిపై మూత్ర విసర్జన చేయించి... ఆ బాలుణ్ణి సూపరింటెండెంట్ లారెన్స్ వేధించిన విషయం ఇటీవలే వెలుగు చూసింది. ఈ ఘటనపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, జిల్లా న్యాయసేవా సంస్థలు సుమోటాగా విచారణకు స్వీకరించాయి.
వరంగల్ జువెనైల్ హోం సూపరింటెండెంట్‌ను తక్షణం విధులకు దూరంగా పెట్టి, బాధ్యులైన ఇతర అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని, బాధిత బాలుడిని మరో బాలుర గృహానికి తరలించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశించింది. కాగా, ఇదే ఘటనపై వరంగల్ జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి సరళాదేవి బుధవారం హోం నిర్వాహకులు, సిబ్బంది, విద్యార్థులను విచారించారు. ఈ ఘటనకు బాధ్యులైన హోం సూపరింటెండెంట్ లారెన్స్‌పై సస్పెన్షన్ వేటు వేయడంతోపాటు అవుట్ సోర్సింగ్ సూపర్ వైజర్ సుధాకర్‌ను విధుల్లో నుంచి తొలగించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.