ఉమ్మడి హైకోర్టు పరిధిలో లింగ వివక్షపై అవగాహన కల్పించడంతోపాటు మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి హైకోర్టు నిబంధనలను రూపొందించింది.
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు పరిధిలో లింగ వివక్షపై అవగాహన కల్పించడంతోపాటు మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి హైకోర్టు నిబంధనలను రూపొందించింది. మేధా కొత్వాల్ లేలా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుననుసరించి ఈ చర్యలు చేపట్టింది. హైకోర్టు పరిధిలో లింగ వివక్ష, లైంగిక వేధింపులపై ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో కనీసం 7గురు, గరిష్టంగా 13 మంది సభ్యులుంటారు. ఒకరు లేదా ఇద్దరు న్యాయమూర్తులు ఈ కమిటీలో ఉంటారు. వీరిలో ఒకరిని కమిటీకి చైర్‌పర్సన్‌గా ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేస్తారు. న్యాయవాదుల నుంచి ఒకరిని లేదా ఇద్దరిని ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేస్తారు. వీరిలో ఒకరు మహిళ ఉంటారు. న్యాయవాదిగా వీరికి కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడి సిఫారసు మేరకు సంఘం ప్రతినిధులిద్దరికీ ఈ కమిటీలో స్థానం కల్పించారు. వారిలో ఒకరు మహిళ ఉంటారు. న్యాయవాదిగా కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరిని లేదా ఇద్దరిని ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేస్తారు. వారిలో ఒకరు తప్పనిసరిగా మహిళ ఉంటారు. డిప్యూటీ రిజిస్ట్రార్ స్థాయికి తగ్గని మహిళా అధికారికి కూడా ఈ కమిటీలో స్థానం కల్పించారు. ఈ కమిటీకి ఆమె సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. మరొకరిని కూడా ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేస్తారు. మొత్తంగా ఈ కమిటీలో మహిళలే అత్యధిక సంఖ్యలో ఉంటారు. కమిటీలో ప్రతి సభ్యుడి కాల పరిమితి రెండేళ్లు. ఓ సభ్యుడిని గరిష్టంగా రెండుసార్లు నామినేట్ చేస్తారు.