కమిటీలు లేని కాంగ్రెస్
- ‘పొన్నాల’ సొంత జిల్లాలోనే దుస్థితి
- కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం
- పాతవారి పెత్తనంలో అసంతృప్తులు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో కార్యవర్గాలు లేని దుస్థితి నెలకొంది. ఆరు నెలలుగా కార్యవర్గం, బాధ్యులు లేకపోవడంతో పార్టీ గందరగోళంగా మారింది. జిల్లా అధ్యక్షుడు ఒక్కరే ఉన్నారు. జిల్లా కార్యవర్గం ఏర్పాటు కోసం పీసీసీకి పంపిన ప్రతిపాదనలకు మోక్షం దొరకడం లేదు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈ ప్రతిపాదనలు కనీసం పరిశీలించిన దాఖలాలు కనిపించడం లేదు.
పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లాలోనే కాంగ్రెస్ జిల్లా కమిటీ లేకపోవడంపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కమిటీలు లేకపోవడం పార్టీ ప్రతిష్టకు ఇబ్బం దిగా ఉందని కార్యకర్తలు పేర్కొంటున్నారు. జిల్లా కమిటీ లేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై స్పందించే బాధ్యతను నిర్వర్తించే విషయంలో ఎవరూ చొరవ తీసుకోవడం లేదని వాపోతున్నారు.
కరెంటు కోతలు, రైతుల సమస్యలు, సామాజిక పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో సానుకూలత సంపాదించుకునేందు ఎవరు చొరవ తీసుకోవాలనే విషయంలో అయోమయం నెలకొందని చెబుతున్నారు. పీసీసీ స్థాయిలో రోజుకు ఒకరికి పదవులు ఖరారు చేస్తున్న పొన్నాల లక్ష్మయ్యకు జిల్లాలో మాత్రం పార్టీని పట్టించుకునే తీరిక ఉండడం లేదని జిల్లా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ శ్రేణుల్లో నిర్వేదం
సాధారణ ఎన్నికల సమయంలో దొంతి మాధవరెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్ ముందుగా మా ధవరెడ్డికి ఖరారు చేసి తర్వాత తొలగించారు. దీనికి నిరసనగా ఆయన పార్టీకి, పదవికి రాజీ నామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా నర్సంపేట నుంచి పోటీ చేశారు. ఆయన రాజీనామాతో కాంగ్రెస్ జిల్లా కార్యవర్గం రద్దయింది. ఎన్నికల ముందు కీలక సమయంలో నాయిని రాజేందర్‌రెడ్డికి పార్టీ అధిష్టానం డీసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది.
ఎన్నికల సమయం కావడంతో అసంతృప్తులు వ్యక్తమవుతాయని భా వించి వెంటనే జిల్లా కమిటీలను కొత్తగా ఏర్పా టు చేయలేదు. పాత కార్యవర్గంలోని వారు అదే పదవుల్లో ఉన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చా రు. సాధారణ, జెడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్ నా యకులు పరాజయం పొందారు. దీనికి బాధ్యులను చేస్తూ పార్టీ నుంచి పలువురు ముఖ్యనాయకులను సస్పెండ్ చేశారు. ఇలా వరుస దెబ్బలతో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బాగా నష్టపోయింది. ఇలాంటి దుస్థితిని నుంచి బటయపడేందుకు కాంగ్రెస్‌ను మళ్లీ పటిష్ట పరచాల్సిన పరిస్థితి నెలకొంది. పార్టీ కోసం కష్టపడే తత్వం ఉన్న నాయకులను గుర్తించి జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రక్రియ మొదలుపెట్టాల్సి ఉంది.
కాంగ్రెస్‌లో జిల్లా పార్టీ కార్యవర్గం ఏర్పాటు కోసం పీసీసీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. రెండు నెలల క్రితమే వరంగల్ జిల్లా పార్టీ కార్యవర్గం ఏర్పాటు కో సం పీసీసీకి ప్రతిపాదనలు వెళ్లాయి. పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లా అయినా ఈ ప్రతిపాదనలకు ఆమోదం రావడం లేదు. తెలంగాణలో రెండు పెద్ద నగరంగా ఉన్న వరంగల్ నగరపాలక సంస్థ త్వరలో నిర్వహించాల్సి ఉంది. కాంగ్రెస్ నగర కమిటీ, జిల్లా కమిటీ సమన్వయంతో ఈ ఎన్నికలను ఎదుర్కొని బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ జిల్లా కమిటీ లేకపోవడం కాంగ్రెస్ శ్రేణులను నిర్వేదానికి గురి చేస్తోంది.
పాతవారి పెత్తనం
కాంగ్రెస్‌లో జిల్లా కమిటీ లేకపోవడంతో సీనియర్ నేతలుగా చెప్పుకునేవారే అంతా తామనే విధంగా వ్యవహరిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజల్లో వ్యతిరేకతతో ఓటమిపాలైన నేతలో ఇప్పుడు మేము అంటూ వ్యవహరిస్తుండడం కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడడంలేదు. ‘అధికారంలో ఉన్నన్ని రోజులు కార్యకర్తలను పట్టించుకోని వారు ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజలు తిరస్కరించిన వీరు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. ఇది మా పార్టీకి లాభం కంటే నష్టమే చేస్తోంది. ఇప్పుడైనా కొత్త నాయకత్వానికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది’ అని కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయడుతున్నారు.