సాక్షి, ఆసిఫాబాద్ : ఎరువుల ధరలు పెరగనున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి ఎరువుల ధరలు పెంచనున్నట్లు ఎరువుల కంపెనీ లు నిర్ణయించాయి. దీంతో రైతులపై మరింత భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఖరీఫ్‌లో రైతులకు ఎకరాకు రూ.4వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడంతో ఓ వైపు ఆనందం వ్యక్తం కాగా.. మరో వైపు ఎరువుల ధర పెంపు వార్తతో రై తులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిసరుకు పెరగడంతో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచినట్లు కంపెనీలు చెబుతున్నాయి. గత రెండేళ్లుగా ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో సాగు పెట్టుబడులు అధికమై వ్యవసాయం రైతులకు భారంగా మారింది. ఫిబ్రవరి ఒకటి నుంచి యూరియా, కాంప్లెక్స్ ధరలు పెరుగుతా యని డీలర్లు పేర్కొంటున్నారు. టన్ను యూరి యాపై రూ.2,600 వరకు, టన్ను కాంప్లెక్స్ ఎరువులపై రూ.2,240 వరకు పెరగనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం బస్తా డీఏపీ రూ.1,083 ఉండగా, రూ.1213కు పెంచనున్నారు. 28:28:0 కాంప్లెక్స్ ఎరువు బస్తా రూ.1122 ఉండగా, దీన్ని రూ.1234కు పెరుగుతుందని అంటున్నారు. అన్ని రకాల కంపెనీలపై బస్తాకు కనీసం రూ. వంద పెరగున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న సాగు ఖర్చులు రైతులకు భారంగా మారాయి. భూమి కౌలు ధరలు మొదలుకొని విత్తనాలు, ఎరువులతోపాటు వ్యవసాయ ఖర్చులు రైతులకు భారంగా మారింది. పత్తి రైతు ఎకరానికి సాగు ఖర్చు సుమారు రూ.30 వేలు అవుతుంది. ఈ ఏడాది గులాబీరంగు పురుగు పత్తి రైతులను, తెల్లదోమ వరి రైతులను నిలువునా ముంచింది. పురుగు ప్రభావంతో వరి, పత్తి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతోయాభై శాతం మంది రైతులకు పెట్టుబడులు వెళ్లని దుస్థితి నెలకొంది. ఏటా పెరుగుతున్న కౌలు భూముల ధరలు, పెరుగుతున్న ఎరువులు, విత్తనాల ధరలతో సాగు ఖర్చులు రైతులకు భారంగా మారుతున్నాయి.
రైతులపై భారం..
ఈ ఏడాది జిల్లాలో సాగు విస్తీర్ణం 1,17,918 హెక్టార్లు కాగా, ఖరీఫ్‌లో 1,17,918 హెక్టార్ల పంటలు సాగు చేయగా, 87,118 హెక్టార్ల పత్తి, 12,495 హెక్టార్ల కంది, 8281 హెక్టార్ల వరి, 3445 హెక్టార్ల సోయా, 1566 హెక్టార్ల జొన్న, 977 హెక్టార్ల మక్క, 1477 హెక్టార్ల పెసరు, 426 హెక్టార్ల మినుము, 40 హెక్టార్ల వేరుశనగ, 152 హెక్టార్ల మిరప, 26 హెక్టార్ల ఆముదంతోపాటు కూరగాయల పంటలు సాగు చేశారు. రబీలో మొక్కజొన్న 2312 హెక్టార్లు, మక్క 1419, కంది 236, మినుము 12, పెసలు 191, శనగ 1587, వరి 1616 హెక్టార్లు సాగు చేస్తున్నారు. పంట సాగుకు ఎకరాకు మూడు బస్తాల యూరియా, డీఏపీ 1, కాంప్లెక్స్ 1, పొటాష్ 1 బస్తా అవసరముంటుంది. ఈ లెక్కన బస్తాకు సుమారు రూ.ఒక వంద పెరగడంతో జిల్లా వ్యాప్తంగా ఏటా రైతులపై రూ.6.65 కోట్ల భారం పడుతుంది.
ఎరువుల ధరలు నియంత్రించాలి
రోజురోజుకు వ్యవసాయం సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. కూలీల కొరత, పెరుగుతున్న ఎరువులు, విత్తనాల ధరలు రైతులకు భారంగా మారింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించపోవడంతో ఈ యేడాది దిగుబడి గణనీయంగా తగ్గింది. పెట్టుబడులు వెళ్లని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎరువుల ధరలు నియంత్రించాలి. – సేనాపతి, రైతు, ఆసిఫాబాద్
Comments
Please login to add a commentAdd a comment