ఘట్‌కేసర్ టౌన్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో జరగలేదని తెలుస్తోంది. సర్వేరోజు రాత్రి 9 గంటలకు వరకు కూడా తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదని ప్రజలు క్లస్టర్ అధికారుల ముందు నిరసనలు తెలిపారు. సర్వే సజావుగా సాగిందనుకున్న అధికారులు ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో తప్పు ఎక్కడ జరిగిందనే విషయమై పరిశీలిస్తున్నారు.
మండలంలో 72,961 ఇళ్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి నంబర్లు కేటాయించి ఎన్యూమరేటర్లకు అప్పగించారు. 68,593 కుటుంబాల సర్వే పూర్తితో 104.31 శాతం నమోదు అయిందని, 4,368 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్లు తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు. నివేదికలు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో మరోలా కనిపిస్తోంది. సర్వే రోజు రాత్రి వేలాది మంది తమ ఇళ్లకు నంబర్లు వేయలేదని తమ వివరాలను కూడా సర్వేలో నమోదు చేయాలని అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
నమోదు కాని ఇళ్లు తేలిందిలా..!
ఇంటింటి సర్వే 104.31 శాతం పూర్తయిందని అధికారులు ప్రకటిస్తున్నా ఇంకా మిగిలిన ఇళ్లు ఎక్కడివన్న అనుమానం తలెత్తుతోంది. ఇంటి నంబర్లను కేటాయించే సమయంలో ఇంట్లో ఉన్న అన్ని కుటుంబాలకు విడిగా నంబర్లు ఇవ్వకపోవడం, అద్దెకున్న వారి వివరాలను ఇంటి యజమానులు తెలపకపోవడం, ఎన్యూమరేటర్ల దగ్గర నమోదు పత్రాలు లేకపోవడంతోనే గందరగోళం జరిగినట్లు తెలుస్తోంది. పంచాయతీ సిబ్బంది నంబర్లు కేటాయించే సమయంలో ఇంటికి ఒక నంబర్‌ను ఇవ్వగా సర్వే రోజు మాత్రం అదే ఇంట్లో పెళ్లి అయిన ప్రతి జంట విడిగా నమోదు చేయించుకున్నారు.
దీంతో ఇళ్ల సంఖ్య పెరగడమే కాకుండా ఎన్యూమరేటర్ల దగ్గర ఉన్న నమోదు పత్రాలు కూడా అయిపోయాయి. ఎన్యూమరేటర్లు తిరుగు ముఖం పట్టడంతో చాలా ఇళ్లు మిగిలిపోవడానికి కారణమైనట్లు భావిస్తున్నారు. అదే రోజు రాత్రి నమోదు కాని ఇళ్లు సుమారు 2 వేల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోసారి సర్వే చేపట్టి అందరినీ పరిగణలోకి తీసుకుని కుటుంబ వివరాలను నమోదుచేయాలని ప్రజలు కోరుతున్నారు.
పంచాయతీల్లో ఫిర్యాదు చేయండి...
సర్వేలో పేర్లు నమోదు కాని వారు తమతమ పంచాయతీ కారాలయాల్లో ఫిర్యాదు చేయాలని తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఒక్క బోడుప్పల్ పంచాయతీ పరిధిలోనే సుమారు 800లకు పైగా ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా సుమారు 4వేల కుటుంబాలు సర్వే కాకుండా మిగిలిపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
‘సర్వే’త్రా ఫిర్యాదుల వెల్లువ
Published Fri, Aug 22 2014 11:43 PM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM
Advertisement