
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి విపత్తు నిర్వహణపై ఉన్నత విద్యా కోర్సుల్లో తప్పనిసరిగా పాఠాలు ఉండాలన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఈ పాఠాలకు పరీక్షల్లో రెండు క్రెడిట్ పాయింట్లు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి శుక్రవారం విలేకరులకు తెలిపారు.
పాఠ్యాంశాలను ఎలా పొందుపరచాలన్న అంశంపై ఈనెల 30, 31 తేదీల్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఇనిస్టిట్యూషన్ ఆధ్వర్యంలో రాçష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లతో ఉన్నత విద్యా మండలి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వృత్తి విద్యా కోర్సులతో సహా అన్ని డిగ్రీ కోర్సుల్లోనూ ఈ పాఠాలను ఏదేని ఒక సెమిస్టర్‌లో పొందుపరుస్తామన్నారు.