గల్లంతైన వారిలో శంషాబాద్ వాసి
దుఃఖసాగరంలో మునిగిన కుటుంబం
శంషాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లో గల్లంతైన వారిలో శంషాబాద్ వాసి కూడా ఉన్నారు. స్థానిక పట్టణంలో పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో నివసించే వినోద్, శశిలతల కుమారుడు అరవింద్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో చదువుతున్నాడు. అతను కూడా గల్లంతు కావడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. అరవింద్‌తోపాటు అతడి కుటుంబసభ్యులు ముగ్గురు పిల్లల చదువుల కోసం నాలుగైదేళ్లుగా వనస్థలిపురంలో ఉంటున్నారు.
అరవింద్ వీరికి మొదటి సంతానం. సెలవుల్లో ఇక్కడికి వచ్చి వెళ్లే వాళ్లని వారి బంధువులు తెలిపారు. అరవింద్ కుటుంబసభ్యులను ఓదార్చడానికి వారి బంధువులు కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అరవింద్ తల్లి శశిలతను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కొడుకు గల్లంతయ్యాడనే షాక్ నుంచి ఆ తల్లి తేరుకోలేకపోతోంది.
మూడు రోజుల క్రితం ఫోన్ చేశాడు: వినోద్ , బంధువు
నా కొడుకు అరవింద్ మూడు రోజుల కింద ఫోన్ చేసి బాగున్నామని చెప్పాడు. నిన్నరాత్రి 12 గంటలకు తెలిసింది.. గల్లంతైన వారిలో మా వాడు కూడా ఉన్నాడని. కాలేజీ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. హిమాచల్‌ప్రదేశ్‌కు నా బావమరిది వెళ్లాడు.
ఇది ఘోరం: ప్రశాంత్, పరమేశ్వర్ సోదరుడు
కళాశాల నిర్లక్ష్యంతోనే ఇంత ఘోరం జరిగింది. కాలేజీ వాళ్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. మా తమ్ముడు గల్లంతైన వారిలో ఉన్నాడు. మా బాధను చెప్పుకోలేని పరిస్థితి. ఉదయమే ఫ్లైట్ ఉందని చెప్పినా విమానాశ్రయంలో అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు.