అరవింద్ ఇకలేడు..సందీప్ జాడ లేదు! | Concern in the student's parents | Sakshi
Sakshi News home page

అరవింద్ ఇకలేడు..సందీప్ జాడ లేదు!

Published Fri, Jun 13 2014 12:10 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

అరవింద్ ఇకలేడు..సందీప్ జాడ లేదు! - Sakshi

అరవింద్ ఇకలేడు..సందీప్ జాడ లేదు!

 హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన శంషాబాద్ వాసి అరవింద్ మృతదేహాన్ని గురువారం రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారన్న వార్త విని అతడి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. అరవింద్‌కు ఈత వచ్చని, ఎలాగైనా బయటపడి ఉంటాడని భావించిన అతడి స్నేహితులకు నిరాశే మిగిలింది. ఇక అదే వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన గౌడవెల్లి వాసి సందీప్ జాడ ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎలాగైనా బతికి వస్తాడంటూ ఆశతో ఉన్నారు.
 
శంషాబాద్: ‘ఆయువు తీరిందారా.. పండు.. క్షేమంగా తిరిగి వస్తావనుకున్నం బిడ్డా, మంచిగ సదువుకునేటోడివి.. నీ మీదే గంపెడాశలు పెట్టుకున్నం.. నువ్వేమో తనువు చాలించినవ్..’ అంటూ బియాస్ నదిలో కొట్టుకుపోయి కానరానిలోకాలకు తరలివెళ్లిన విద్యార్థి అరవింద్ తాత, నాయనమ్మలు కన్నీంటి పర్యంతమవుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన అరవింద్ మృతదేహాన్ని గురువారం రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు.
 
టీవీల్లో ఈ వార్త చూసిన అరవింద్ తాత, నాయనమ్మ ఈశ్వరప్ప, భద్రమ్మలతోపాటు శంషాబాద్‌లోని అతడి స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. అరవింద్ శంషాబాద్ పట్టణ వాసులైన వినోద్, శశిలత దంపతుల మొదటి కుమారుడు. ఒకటో తరగతి నుంచి పది వరకు శంషాబాద్‌లోని బాలయేసు (సెయింట్ ఇన్‌ఫాంట్ జీసస్) పాఠశాలలో చదివాడు. అనంతరం శశిలత పిల్లల చదువు కోసం వనస్థలిపురంలోని పుట్టింటికి వెళ్లింది. వినోద్ స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అరవింద్ చురుకైన విద్యార్థిఅని అతడితో చదువులో ఎవరూ పోటీపడలేకపోయారని అతడి స్నేహితులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అరవింద్‌కు ఈత రావడంతో బతుకుతాడని ఆశలు పెట్టుకున్నామని చెప్పారు.  
 
 నా మనవడిని నెలరోజుల కిందజూసిన..  
 నా మనవడు అరవింద్ నెలరోజుల కింద శంషాబాద్‌కు వచ్చిండు. మమ్మల్ని పలకరించి పోయిండు. నదిలో కొట్టుకుపోయిండని తెలిసినప్పటి నుంచి వాడు బతికే వస్తడని అనుకున్నం. వాడు మంచిగ తిరిగిరావాలని అందరి దేవుళ్లకు మొక్కుకున్న. నా పండుకు అప్పుడే ఆయువు తీరిందా.. అయ్యో.. దేవుడా ఎంతపని చేస్తివి!    - భద్రమ్మ, అరవింద్ నాయనమ్మ
 
టూర్‌కు పోతనని చెప్పిండు..
ఈ నెల ఒకటో తేదీన నాకు ఫోన్‌చేసి టూర్‌కు పోతున్ననని చెప్పిండు. అరవింద్ నేను బాల్య స్నేహితులం. వాడు చదువులో ఎప్పుడు ఫస్టే, వాడికి ఈత కూడా వచ్చు. క్షేమంగా తిరిగి వస్తాడని అనుకున్నం. అరవింద్, నేను, హరిబాబు, అక్షయ్‌యాదవ్, రాజేష్, మణిసాయి, సందీప్, అజయ్ మేమంతా బెస్ట్ ఫ్రెండ్స్. అరవింద్ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నం.     - నవీన్, అరవింద్ స్నేహితుడు
 
 ఐదు రోజులైనా జాడలేని సందీప్
 
ఆందోళనలో కుటుంబసభ్యులు

మేడ్చల్ రూరల్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఆదివారం నీటి ప్రవాహానికి గల్లంతైన సందీప్ జాడ గురువారం వరకు తెలియరాలేదు. అతడి ఆచూకీ కోసం స్వగ్రామం గౌడవెల్లిలో కుటుంబీకులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఐదు రోజులు గడుస్తున్నా సందీప్‌కు సంబంధించిన ఎటువంటి సమాచారం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆదివారం సందీప్ గల్లంతైన నాటి నుంచి తల్లిదండ్రులు వీరేష్, విజయలు నిద్రాహారాలు మానేసి ఎదురుచూస్తున్నారు. కొడుకు క్షేమంగా తిరిగి రావాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
 
 నా కొడుకు జాడ కనిపెట్టండి..
 ప్రభుత్వం ఎలాగైనా తన కొడుకు సందీప్ జాడ కనిపెట్టాలని తండ్రి వీరేష్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇలాంటి బాధ పగవారికి కూడా రాకూడదన్నారు. సందీప్ ఆచూకీ కోసం కుటుంబం మొత్తం నిద్రాహారాలు మానేసి ఎదురుచూస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ బాధను అర్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు.
 
గర్భశోకం
సాక్షి, హైదరాబాద్: అదే వేదన..  తీరని రోదనతో కన్నపేగులు తల్లడిల్లుతున్నాయి. బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం నగరంలోని వారి తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంతో కళ్లలో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. తమ వారి కోసం ఐదు రోజులుగా రోదిస్తూ.. కళ్లలో నీళ్లు ఇంకిపోతున్నాయి. నగరవాసులకు కన్నీళ్లు మిగిల్చిన లార్జీ డ్యామ్ దుర్ఘటనలో గురువారం మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు బండరాళ్ల కింద లభ్యమయ్యాయి.

నగరంలో వనస్థలిపురానికి చెందిన అరవింద్, ఖమ్మం జిల్లాకు చెందిన ఉపేందర్ మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటాయని పోలీసులు తెలిపారు. మరోపక్క సాబేర్ మృతదేహం గురువారం శేరిలింగంపల్లి గుల్‌మొహర్ కాలనీలోని నివాసానికి చేరగానే బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి.
 
పుట్టినరోజుకూ కానరాని ఆచూకీ
గల్లంతయిన విద్యార్థుల్లో దిల్‌సుఖ్‌నగర్ పీఅండ్‌టీ కాలనీకి చెందిన అఖిల్ కూడా ఉన్నాడు. గురువారం అఖిల్ పుట్టినరోజు కావడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం బంధువులు, స్థానికుల తరం కాలేదు. పుట్టినరోజుకు తమ బాబు క్షేమంగా తిరిగొస్తాడనుకున్న ఆశలు అడియాసలు కావడంతో కన్నవారు విలపిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది.
 
8 మంది మృతదేహాలు లభ్యం
గల్లంతయిన 24 మందిలో ఇప్పటివరకు 8 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగతా విద్యార్థుల ఆచూకీ కనుగొనేందుకు ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ, నేవీలకు చెందిన సుమారు 600 మంది సుశిక్షితులైన సిబ్బంది లార్జీ నుంచి మండో డ్యామ్ పరిసరాల్లో సుమారు 15 కిలోమీటర్ల మేర జల్లెడ పడుతున్నారు. భారీ వర్షాలు, మంచు ప్రభావంతో గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోందని అక్కడే మకాం వేసిన నగర పోలీసులు ‘సాక్షి’కి తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement