చల్లా చేరికపై లొల్లి! | conflicts in parakala TRS | Sakshi
Sakshi News home page

చల్లా చేరికపై లొల్లి!

Published Tue, Oct 21 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

చల్లా చేరికపై లొల్లి!

చల్లా చేరికపై లొల్లి!

* పరకాల టీఆర్‌ఎస్‌లో విభేదాలు
* సహోదర్‌రెడ్డి, మొలుగూరి వర్గాలు నారాజ్
* వీరికి ప్రాధాన్యం ఇవ్వాలని కేడర్ పట్టు
* గులాబీ అధినాయకత్వంపై అసంతృప్తి
* ధర్మారెడ్డి చేరిక తేదీపై స్పష్టత కరువు

సాక్షి ప్రతినిధి, వరంగల్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరే అంశం గులాబీ పార్టీలో కొత్త రాజకీయానికి తెర తీస్తోంది. పరకాల నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌లో ఇప్పటికే మూడు వర్గాలు ఉన్నాయి. సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిగా తాము  ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడు తమకు నాయకుడిగా వస్తుండడంపై మూడు వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. టీఆర్‌ఎస్‌లోని ద్వితీయ శ్రేణి నాయకత్వం ధర్మారెడ్డి పార్టీలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీఆర్‌ఎస్ అధినాయకత్వం ఆగ్రహానికి గురికావద్దనే ఉద్దేశంతో ధర్మారెడ్డి రాకను బహిరంగంగా ఎవరూ వ్యతిరేకించడం లేదు. అంతర్గతంగా మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల వరకు తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన ఆయనకు విధేయంగా తాము ఎలా పని చేస్తామని ప్రశ్నిస్తున్నారు. సంగెం, ఆత్మకూరు మండలాల్లో ఇప్పటికే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా కొందరు నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ధర్మారెడ్డి ప్రకటించిన రోజే ఈ రెండు మండలాల్లోని కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోకి రాకముందే ధర్మారెడ్డి ఇంటికి వెళ్లి కొందరు టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలకడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తిని తమ తో ప్రమేయం లేకుండా టీఆర్‌ఎస్ జిల్లా నేతలు కలవడాన్ని వీరు తప్పుబడుతున్నారు. సాధారణ ఎన్నికల వరకు పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మొలుగూరి బిక్షపతికి ఆ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. న్యాయవాదుల కోటాలో ముద్దసాని సహోదర్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన కొండా సురేఖకు ఇక్కడ ప్రత్యేకంగా అనుచర వర్గం ఉంది.

సాధారణ ఎన్నికలు, అంతకుముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో ఈ మూడు వర్గాల్లోని ద్వితీ య శ్రేణి నేతలు.. టీడీపీ అభ్యర్థులతోనే పోటీ పడ్డారు. ధర్మారెడ్డి ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరితే ఆయనతో పార్టీలోకి వచ్చే వారికే ఆయా మండలాలు, గ్రామాల్లో ప్రాధాన్యం ఉంటుందని గులాబీ శ్రేణులు వాపోతున్నాయి. ఉద్యమంలో మొదటి నుంచి తాము పాల్గొనగా.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చే రిన వారికి ప్రాధాన్యం పెరిగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
 
కొత్త రాజకీయం షురూ..
సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి 9,108 ఓ ట్ల మెజార్టీతో గెలిచారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సహోదర్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పరకాల నియోజకవర్గంలో ఈ పార్టీకి పట్టు ఉంది. సాధారణ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ అనుకూల పవనాలు ఉన్నాయి. ఇ లాంటి పరిస్థితుల్లోనూ పరకాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించలేదు. టీఆర్‌ఎస్‌లోని మూడు గ్రూపుల రాజకీయంతో నే ఇలా జరిగిందని గులాబీ నేతలే చెబుతున్నారు. మూడు వర్గాలను సమన్వయం చేసే విషయాన్ని పట్టించుకోని టీఆర్‌ఎస్ నాయకత్వం ఇప్పుడు ఇతర పార్టీకి చెందిన ఎమ్మెల్యేను చేర్చాలనుకోవడంపై ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహంగా ఉన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరితే పరకాల నియోజకవర్గంలోని ఈ పార్టీలో కొత్త రకమైన రాజకీయం మొదలుకానుంది. ప్రస్తుతం పరకాల టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి తానేనని సహోదర్‌రెడ్డి చెబుతుండగా.. మొలుగూరి బిక్షపతి వర్గం ఇదే అభిప్రాయంతో ఉం ది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ధర్మారెడ్డి చేరిన తర్వాత ఆయనే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉంటారు. దీంతో సహోదర్‌రెడ్డి, బిక్షపతి వర్గాలు భవిష్యత్‌లో తమ పరిస్థితిపై ఇప్పుడే జాగ్రత్త పడుతున్నాయి.

మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశంపై వారు దృష్టి పెట్టారు. వీరిద్దరికి ఏదైనా అవకాశం ఇచ్చిన తర్వాతే ధర్మారెడ్డి పార్టీలో చేరుతారనే అభిప్రాయం టీఆర్‌ఎస్‌లో ఉంది. సహోదర్‌రెడ్డి, బిక్షపతి విషయంలో నిర్ణయం జరిగాకే.. చేరితే ఇబ్బంది ఉండదని ధర్మారెడ్డి కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల ముందే టీఆర్‌ఎస్‌లో చేరుతారని, టీఆర్‌ఎస్ అధినాయకత్వం దీన్ని నిర్ణయిస్తుందని ధర్మారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement