రాష్ట్ర పరివాహకంలో కురిసే ప్రతి నీటిబొట్టు ఒడిసిపట్టేందుకు గోదావరి, కృష్ణా నదులపై చేపడుతున్న ప్రాజెక్టుల కాల్వల పరిధిలో నీటి నిల్వలు పెంచేలా చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని నిర్ణయించినా అడుగు మాత్రం ముందుకు పడలేదు. మహారాష్ట్ర మాదిరి చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో నీటి నిల్వలను పెంచి గరిష్ట ఆయకట్టుకు నీరందించాలన్న లక్ష్యం కాస్తా నిధుల్లేక నీరసించి పోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నదులు, ఉపనదులు, వాగులు, వంకలపై కలిపి మొత్తంగా 1,200 చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని నిర్ణయించి పరిపాలనా అనుమతులు ఇచ్చినా పనులు మాత్రం ముందుకు సాగక చతికిల పడుతోంది.
– సాక్షి, హైదరాబాద్
నిధుల్లేక నీరసం
రాష్ట్రానికి ప్రధాన నీటి వనరులైన కృష్ణా నది కింద 299 టీఎంసీలు, గోదావరిలో 954 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశముంది. ఇందులో చిన్న నీటివనరుల కింద కృష్ణాలో 89 టీఎంసీలు, గోదావరిలో 165 టీఎంసీల కేటాయింపులున్నాయి. అయితే కృష్ణా బేసిన్‌లో ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండితే కానీ దిగువకు ప్రవాహాలులేని కారణంగా దిగువన తెలంగాణలో వాటా మేర నీటి వినియోగం జరగడం లేదు. దీనికితోడు కృష్ణానీటి కట్టడికి మహారాష్ట్ర ఏకంగా వందల సంఖ్యలో చెక్‌డ్యామ్‌ల నిర్మా ణం చేయడంతో దిగువకు నీటి కష్టాలు తప్పడం లేదు. గోదావరిలోనూ 165 టీఎంసీల మేర కేటాయింపులున్నా.. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ధ్వంసం కావడంతో అనుకున్న మేర అవి నిండటం లేదు.
ఈ నేపథ్యంలో గోదా వరి బేసిన్‌లో ప్రధాన ఉపనదులైన మంజీరా, మానేరు, తాలిపేరు, లెండి, పెన్‌గంగ, కిన్నెరసాని వంటి వాగులు, కృష్ణాలో మూసీ, ఊకచెట్టువాగు, పెద్దవాగు, డిండి వాగు, పాలేరు, తుంగపాడు వంటి వాగులపై 1,200 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని నిర్ణయించింది. వీటికి రూ.3,826 కోట్ల మేర నిధులకు ఏప్రిల్‌లో పరిపాలనా అను మతి సైతం ఇచ్చింది. పనులు మొదలు పెట్టిన 6 నెలల్లో వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మాంద్యం ఉండటంతో సాగునీటి శాఖకు బడ్జెట్ తగ్గింది.
ఈ పనులకు నిధుల కొరత లేకుండా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రుణాలు తీసుకునేలా నిర్ణయించినప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో కేవలం 80 చెక్‌డ్యామ్‌లకు మాత్రమే సాంకేతిక అనుమతులిచ్చిన అధికారులు మిగతావాటికి నిధుల్లేక నిలిపివేశారు. సాంకేతిక అనుమతులు ఇచ్చిన చెక్‌డ్యామ్‌ల్లోనూ టెండర్లు పిలిచిన చెరువులు కేవలం పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చెక్‌డ్యామ్‌లపై ఎలా ముందుకు వెళ్లాలన్న అయోమయం నెలకొంది. ప్రస్తుతం సాగునీటి శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తుండటంతో ఆయనే వీటిపై మార్గదర్శనం చేస్తే కానీ పనులు ముందుకు కదిలే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment