సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాల పునర్విభజన జరిగిన నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం ఎట్టకేలకు పూర్తయ్యింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఇప్పటి దాకా ఆ పదవిలో కొనసాగారు. కాగా గురువారం ఏఐసీసీ తీసుకున్న నిర్ణయం మేరకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వేర్వేరుగా కొత్త అధ్యక్షులను నియమించారు.
ఇన్నాళ్లూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన భిక్షమయ్యగౌడ్‌ను తిరిగి యాదాద్రి భువనగిరి జల్లా అధ్యక్షుడిగా నియమించారు. కాగా, పలువురు నాయకులు పోటీ పడిన నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన గిరిజన నేత కె.శంకర్‌నాయక్‌ను నియమిస్తూ ప్రకటన వెలువడింది. దీంతో జిల్లా కాంగ్రెస్ చరిత్రలో రెండోసారి గిరిజన నేతకు డీసీసీ పీఠం దక్కింది. గతంలో రాగ్యానాయక్ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన దేవరకొండ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. రాగ్యానాయక్ తర్వాత ఇంతకాలానికి మరోసారి పార్టీలో సీనియర్ నాయకుడైన గిరిజన వర్గానికి చెందిన శంకర్‌నాయక్‌కు అవకాశం కలిసివచ్చింది.
సామాజిక సమీకరణలతోనే డీసీసీ అధ్యక్షుల నియామకం..
జిల్లా కాంగ్రెస్ సారథులను ఎంపిక చేయడంలో ఆ పార్టీ నాయకత్వం సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుందని చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలో ప్రధానంగా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో గిరిజన ఓటు బ్యాంకు బలంగా ఉంది. కనీసం మూడు లక్షలకుపైగానే వారి ఓట్లు ఉంటాయన్న ఒక అంచనా. దేవరకొండ అసెంబ్లీ సెగ్మెంట్ ఎస్టీలకు రిజర్వు చేసిందే. ఇంకా, నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఎస్టీల ఓట్లు గణనీయంగా ఉంటాయి. జిల్లా వేరైనా, సూర్యాపేట, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లోనూ గిరిజన జనాభా చెప్పుకోదగిన స్థాయిలోనే ఉంది. రిజర్వుడ్ స్థానాలు మినహా, ఇతర చోట్ల వారికి ఎలాంటి అవకాశాలు దక్కడం లేదన్న అపప్రద ఉంది. పార్టీ పదవుల్లోనూ ఇన్నాళ్లూ ఒక విధంగా అన్యాయం జరిగిందన్న ఆరోపణలు పార్టీలో ఉన్నాయి.
ఈ అంశాలను పరిశీలించడంతో పాటు, రానున్న పార్లమెంటు ఎన్నికల కోణంలోకూడా ఆలోచించే గిరిజన నేతకు డీసీసీ బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఈసారి డీసీసీ అధ్యక్ష రేసులో పలువురి పేర్లు బయటకు వచ్చాయి. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేరు ప్రముఖంగా వినిపించినా ఆయనకు అవకాశం దక్కలేదు. ఇంకా, తమకు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేయడానికి అవకాశం కల్పించాలని పలువురు నాయకులు పీసీసీ నాయకత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కొత్త డీసీసీ అధ్యక్షుడిగా శంకర్‌నాయక్ నియామకంలో పార్టీ సీనియర్ నాయకుడు సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి పాత్ర ప్రముఖంగా ఉందంటున్నారు.
రెండు సార్లు జెడ్పీటీసీ, ఒకసారి ఎంపీపీ..
నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా అవకాశం దక్కించుకున్న శంకర్‌నాయక్ సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నారు. జనరల్ స్థానమైన దామరచర్ల మండలం నుంచి ఆయన రెండు పర్యాయాలు జెడ్పీటీసీ సభ్యుడిగా, ఒకసారి మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం దామరచర్ల జెడ్పీటీసీ సభ్యుడిగా, జిల్లా ప్లానింగ్ బోర్డు సభ్యుడిగా, కాంగ్రెస్ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
రెండోసారి పదవి దక్కించుకున్న బూడిద
ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రెండోసారి వరించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనను ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన భిక్షమయ్యగౌడ్ ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఆలేరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు మాత్రమే ఉన్న చిన్న జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేయడానికి ఆయన సుముఖంగా లేరని ప్రచారం జరిగినా.. చివరకు ఏఐసీసీ నాయకత్వం ఆయనకే బాధ్యతలు అప్పజెప్పింది.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారని చెబుతున్నారు. మరో వైపు సూర్యాపేట జిల్లాకు అధ్యక్షునిగా బీసీ వర్గానికే చెందిన చెవిటి వెంకన్నయాదవ్‌కు అవకాశం దక్కింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు కమిటీ అధ్యక్షుల్లో రెండు బీసీలకు, ఒకటి ఎస్టీకి దక్కాయి. దీంతో డీసీసీ సారథుల నియామకాల్లో పార్టీ నాయకత్వం సామాజిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి నియామకాలు చేపట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment