DCC presidents
-
కాంగ్రెస్ జిల్లా సారథుల.. నియామకం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాల పునర్విభజన జరిగిన నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం ఎట్టకేలకు పూర్తయ్యింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఇప్పటి దాకా ఆ పదవిలో కొనసాగారు. కాగా గురువారం ఏఐసీసీ తీసుకున్న నిర్ణయం మేరకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వేర్వేరుగా కొత్త అధ్యక్షులను నియమించారు. ఇన్నాళ్లూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన భిక్షమయ్యగౌడ్‌ను తిరిగి యాదాద్రి భువనగిరి జల్లా అధ్యక్షుడిగా నియమించారు. కాగా, పలువురు నాయకులు పోటీ పడిన నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన గిరిజన నేత కె.శంకర్‌నాయక్‌ను నియమిస్తూ ప్రకటన వెలువడింది. దీంతో జిల్లా కాంగ్రెస్ చరిత్రలో రెండోసారి గిరిజన నేతకు డీసీసీ పీఠం దక్కింది. గతంలో రాగ్యానాయక్ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన దేవరకొండ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. రాగ్యానాయక్ తర్వాత ఇంతకాలానికి మరోసారి పార్టీలో సీనియర్ నాయకుడైన గిరిజన వర్గానికి చెందిన శంకర్‌నాయక్‌కు అవకాశం కలిసివచ్చింది. సామాజిక సమీకరణలతోనే డీసీసీ అధ్యక్షుల నియామకం.. జిల్లా కాంగ్రెస్ సారథులను ఎంపిక చేయడంలో ఆ పార్టీ నాయకత్వం సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుందని చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలో ప్రధానంగా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో గిరిజన ఓటు బ్యాంకు బలంగా ఉంది. కనీసం మూడు లక్షలకుపైగానే వారి ఓట్లు ఉంటాయన్న ఒక అంచనా. దేవరకొండ అసెంబ్లీ సెగ్మెంట్ ఎస్టీలకు రిజర్వు చేసిందే. ఇంకా, నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఎస్టీల ఓట్లు గణనీయంగా ఉంటాయి. జిల్లా వేరైనా, సూర్యాపేట, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోనూ గిరిజన జనాభా చెప్పుకోదగిన స్థాయిలోనే ఉంది. రిజర్వుడ్ స్థానాలు మినహా, ఇతర చోట్ల వారికి ఎలాంటి అవకాశాలు దక్కడం లేదన్న అపప్రద ఉంది. పార్టీ పదవుల్లోనూ ఇన్నాళ్లూ ఒక విధంగా అన్యాయం జరిగిందన్న ఆరోపణలు పార్టీలో ఉన్నాయి. ఈ అంశాలను పరిశీలించడంతో పాటు, రానున్న పార్లమెంటు ఎన్నికల కోణంలోకూడా ఆలోచించే గిరిజన నేతకు డీసీసీ బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఈసారి డీసీసీ అధ్యక్ష రేసులో పలువురి పేర్లు బయటకు వచ్చాయి. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేరు ప్రముఖంగా వినిపించినా ఆయనకు అవకాశం దక్కలేదు. ఇంకా, తమకు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేయడానికి అవకాశం కల్పించాలని పలువురు నాయకులు పీసీసీ నాయకత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కొత్త డీసీసీ అధ్యక్షుడిగా శంకర్‌నాయక్ నియామకంలో పార్టీ సీనియర్ నాయకుడు సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి పాత్ర ప్రముఖంగా ఉందంటున్నారు. రెండు సార్లు జెడ్పీటీసీ, ఒకసారి ఎంపీపీ.. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా అవకాశం దక్కించుకున్న శంకర్‌నాయక్ సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నారు. జనరల్ స్థానమైన దామరచర్ల మండలం నుంచి ఆయన రెండు పర్యాయాలు జెడ్పీటీసీ సభ్యుడిగా, ఒకసారి మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం దామరచర్ల జెడ్పీటీసీ సభ్యుడిగా, జిల్లా ప్లానింగ్ బోర్డు సభ్యుడిగా, కాంగ్రెస్ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. రెండోసారి పదవి దక్కించుకున్న బూడిద ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రెండోసారి వరించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనను ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన భిక్షమయ్యగౌడ్ ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఆలేరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు మాత్రమే ఉన్న చిన్న జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేయడానికి ఆయన సుముఖంగా లేరని ప్రచారం జరిగినా.. చివరకు ఏఐసీసీ నాయకత్వం ఆయనకే బాధ్యతలు అప్పజెప్పింది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారని చెబుతున్నారు. మరో వైపు సూర్యాపేట జిల్లాకు అధ్యక్షునిగా బీసీ వర్గానికే చెందిన చెవిటి వెంకన్నయాదవ్కు అవకాశం దక్కింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు కమిటీ అధ్యక్షుల్లో రెండు బీసీలకు, ఒకటి ఎస్టీకి దక్కాయి. దీంతో డీసీసీ సారథుల నియామకాల్లో పార్టీ నాయకత్వం సామాజిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి నియామకాలు చేపట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కాంగ్రెస్‌కు కొత్త సారథులు..!
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సారథులను ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన హైకమాండ్ ఒక ఓసీ, ఇద్దరు బీసీలు, ఒక దళిత నేతకు పార్టీ పగ్గాలు అప్పగించింది. ఉమ్మడి జిల్లాకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న కటకం మృత్యుంజయంకు కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను జగిత్యాల డీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎన్.సత్యనారాయణగౌడ్, పెద్దపల్లికి ఈర్ల కొంరయ్య డీసీసీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంతో పాటు రానున్న లోక్‌సభ ఎన్నికలకు శ్రేణుల్ని సంసిద్ధం చేసేందుకు ఈ కమిటీలు పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించింది. కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తున్న ప్రక్రియను ఆ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు కొలిక్కి తెచ్చింది. మూడురోజుల క్రితం పార్టీ రాష్ట్రస్థాయి నేతలు ఢిల్లీలో సమావేశం కా వడం.. వీలైనంత తొందరగా జిల్లా సారథులను నియమించాలని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ ఆదేశిం చడం.. ఈ క్రమంలోనే గురువారం జిల్లాలకు సారథుల నియమిస్తూ ఉత్తర్వులు వెలువడడం చర్చనీయంగా మారింది. పోటాపోటీగా ప్రయత్నాలు.. చివరికు కమిటీలపై ప్రకటన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగానే పార్టీ సారథి ఇప్పటివరకు కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. కొత్తగా తెరపైకి వచ్చిన ఈ పదవిని అందుకునేందుకు కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి పలువురు ఆశావహ నాయకులు పోటీపోటీగా ప్రయత్నాలు చేశారు. ఇంకొంతమంది మాత్రం ఈ పదవి తమకు ససేమిరా వద్దనే విషయాన్ని బాహాటంగానే పార్టీ ముఖ్య నాయకులకు వినిపించారు. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాల పరిధిలో ఇదివరకు ఉన్న ఉమ్మడి జిల్లా అధ్యక్షుడితోపాటు పలువురి పేర్లు వినిపించాయి. సుమారు 22 మంది వరకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ప్యాట రమేష్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, శంకర్, మేడిపల్లి సత్యం, మత్యుంజయం, గందె మాధవి తదితరులు ఆసక్తి చూపారు. పెద్దపల్లి జిల్లాలో ఈర్ల కొమురయ్య, ధర్మయ్యతోపాటు ఇంకొందరి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. జగిత్యాలలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎం.రవీందర్‌తోపాటు ఇంకొకరిద్దరి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. రాజన్నజిల్లాలో సంగీతం శ్రీనివాస్, సత్యనారాయణగౌడ్ సహా ఐదుగురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీమంత్రులు, మాజీ ఎంపీల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న అధిష్టానం ఎట్టకేలకు ఆయా జిల్లాలకు సారథులను ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్.సత్యనారాయణగౌడ్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా అడ్లూరు లక్ష్మణకుమార్ నియామకంపై అంతగా వ్యతిరేకత లేనప్పటికీ.. పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడి నియామకంపై సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ తదితరులు స్పందిస్తూ.. అధిస్టానంతో వద్ద చెవులు కొరికినవారు, లాబీయింగ్ చేసిన వారికే పదవి దక్కిందని వ్యాఖ్యానించారు. కరీంనగర్ నుంచి కూడా పలువురు పోటీ పడినా మృత్యుంజయంకే ఇచ్చారని కొందరు వాపోయారు. డీసీసీ సారథుల ఎన్నిక వెనుక సీనియర్లే కీలకం.. పార్లమెంట్, ‘స్థానిక’ ఎన్నికల నేపథ్యంలోనే కమిటీలు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు పొన్నం ప్రభాకర్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఆరెపల్లి మోహన్ పార్టీ ప్రకటించిన ఆయా కమిటీల్లో కీలక పదవుల్లో ఉన్నారు. వీరితోపాటు విజయరమణారావు, కేకే.మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీనర్సింహారావు, మక్కాన్‌సింగ్, జువ్వా డి నర్సింగరావు తదితరులు రాష్ట్రస్థాయిలో కీలక నాయకులుగా ఉమ్మడి జిల్లానుంచి ఉన్నారు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారదతోపాటు యువజన కాంగ్రెస్ విభాగం రాష్ట్ర నాయకులు బల్మూరి వెంకట్ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారవడంతో డీసీసీ అధ్యక్షుల నియామకంలో ఈ ముఖ్యనాయకుల అభిప్రాయాల్ని కూడా పార్టీ పరిగణనలోకి తీసుకున్నారంటున్నారు. మొత్తంగా కొత్త నాయకత్వంతో సరికొత్త జవసత్వాల్ని పార్టీలో నింపాలనే దిశగా హస్తం పార్టీ అధినాయకత్వం వ్యవహరించిందని.. ఇందుకోసం ఆచితూచి అడుగులేస్తూ.. ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టిందని ఆ పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థులు ఇప్పుడిప్పుడే తేరుకుంటుండటం.. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేలా చర్యల్ని చేపట్టాల్సి ఉండటంతో కొత్త అధ్యక్షుడిపై అంచనాలు అధికంగానే ఉండనున్నాయి. ఇంకా ఐదేళ్లపాటు సొంత ఖర్చులతో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేలా కార్యక్రమాల్ని చేపట్టడం.. అన్నివర్గాల నాయకులతో సమన్వయంగా వ్యవహరించడం డీసీసీ కుర్చీలో ఉన్న నేతకు అనివార్యం కానుంది. అటు రాష్ట్రస్థాయి నాయకులతోపాటు ఇటు జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలకు భరోసా ఇచ్చేలా పదవికి న్యాయం చేయాల్సి ఉండగా.. పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ కమిటీలు వేయడం పార్టీలో కొత్త చర్చకు తెరతీసింది. కాగా ముందున్న పార్లమెంట్, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కొత్త సారథులు ఆ పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారనేది వేచిచూడాల్సిందే. -
కొత్త సారథులు..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు గురువారం నూతన అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు పార్టీ అధినేత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కొత్త అధ్యక్షులను ప్రకటించారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో నాలుగు జిల్లాలకు కొత్త ముఖాలను ఎంపిక చేశారు. ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా యువ నాయకుడు భార్గవ్‌దేశ్‌పాండే, మంచిర్యాల జిల్లాకు కొక్కిరాల సురేఖ, నిర్మల్ జిల్లాకు పవార్ రామారావుపటేల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ఎమ్మెల్యే ఆత్రం సక్కును నియమించారు. ఉమ్మడి జిల్లాలో రెండు బలమైన వర్గాలుగా కొనసాగుతున్న ఏఐసీసీ సభ్యుడు ప్రేమ్‌సాగర్‌రావు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అనుచరులకే డీసీసీ అధ్యక్ష పదవులు దక్కాయి. తూర్పున ‘కొక్కిరాల’ ఆధిపత్యం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాసనసభ ఎన్నికల వరకు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పదవి నుంచి తప్పకున్నారు. అంతకు ముందు నుంచే కొత్త జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షుల నియామకాలు ఉంటాయని కాంగ్రెస్ పెద్దలు చెబుతూ వచ్చారు. ఈ మేరకు గురువారం కొత్త అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. ఇందులో తూర్పు ప్రాంతంలోని రెండు జిల్లాల్లో ప్రేమ్‌సాగర్‌రావు తన అధిపత్యం చాటుకోగా, పశ్చిమ ప్రాంతంలోని రెండు జిల్లాల్లో మహేశ్వర్‌రెడ్డి తన వర్గీయులకు అధ్యక్ష స్థానాలను ఇప్పించుకున్నారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలిగా ప్రేమ్‌సాగర్‌రావు సతీమణి కొక్కిరాల సురేఖను నియమించారు. తాజా శాసనసభ ఎన్నికల్లో భర్త ప్రేమ్‌సాగర్‌రావు తరపున ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తన తర్వాత బలమైన లీడర్ లేకపోవడం, తన అధిపత్యాన్ని చాటుకోవడంలో భాగంగా ప్రేమ్‌సాగర్‌రావు భార్యకు డీసీసీ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. ఇక తన అనుచరుడైన ఎమ్మెల్యే ఆత్రం సక్కును కుమురంభీం జిల్లాకు అధ్యక్షుడిగా నియమింపజేశారు. పార్టీ పరంగా తూర్పు జిల్లాల్లో తనకు ఎదురు లేదన్న విషయాన్ని చాటారు. మాట నెగ్గించుకున్న ఏలేటి.. ఉమ్మడి ఆదిలాబాద్ పశ్చిమ ప్రాంతంలో తనకు పార్టీ పరంగా తిరుగు లేదని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఈ నియామకాలతో చాటారు. శాసనసభ ఎన్నికల్లోనే పలువురు అనుచరులకు పార్టీ టికెట్లు దక్కకపోవడంతో ఆయన నిరాశ వ్యక్తం చేశారు. ఇప్పుడు పార్టీ పరంగా తన వాళ్లకు పదవులు దక్కేలా చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పలువురు ప్రముఖ నాయకులు ఉన్నçప్పటికీ తన వర్గీయుడిగా కొనసాగుతున్న యువ నాయకుడు భార్గవ్‌దేశ్‌పాండేను డీసీసీ అధ్యక్షుడిగా నియమింపజేసుకున్నారు. తన సొంత జిల్లా నిర్మల్‌లో రామారావుపటేల్‌కు డీసీసీ పదవి దక్కేలా చేశారు. తాజా ఎన్నికల్లో ముథోల్ ఎమ్మెల్యేగా రామారావుపటేల్ పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయడంలో రామారావుపటేల్ కీలకంగా వ్యవహరించారు. మొదటి నుంచి ఏలేటి అనుచరుడిగానే ఆయన కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో పటేల్‌కు అధ్యక్ష పదవి దక్కేలా మహేశ్వర్‌రెడ్డి సఫలీకృతులయ్యారు. నలుగురూ కొత్త వాళ్లే.. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్‌తో పాటు మూడు కొత్త జిల్లాలకు కొత్త వాళ్లనే అధ్యక్షులుగా నియమించింది. తాజా ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించిన భార్గవ్‌దేశ్‌పాండేకు నిరాశ ఎదురైంది. అక్కడ గండ్రత్ సుజాతకు ఎమ్మెల్యే టికెట్ దక్కింది. దీంతో భార్గవ్‌కు పార్టీ పరంగా ప్రస్తుతం అధ్యక్ష పదవిని ఇచ్చి సమన్యాయం చేశారు. ఎన్ఎస్యూఐ నుంచి ప్రస్థానం ప్రారంభించి పార్టీ జిల్లా అధ్యక్ష స్థాయి వరకు భార్గవ్ ఎదిగారు. సేవా కార్యక్రమాలతో ముథోల్ నియోజకవర్గ ప్రజలకు చేరువైన రామారావుపటేల్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గ బాధ్యతలను చూసుకున్నప్పటికీ పార్టీ పరంగా పదవులను చేపట్టలేదు. ఇప్పుడు ఏకంగా జిల్లా అధ్యక్ష పదవిని పొందారు. మంచిర్యాల అధ్యక్షురాలిగా నియమితులైన సురేఖ పూర్తిగా తన భర్త ప్రేమ్‌సాగర్‌రావు వెంటే ఉంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు, బతుకమ్మ చీరల పంపిణీ, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. గత ఎన్నికల్లోనూ హస్తం గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విశేషంగా పనిచేశారు. ఇక కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన ఆత్రం సక్కు ప్రేమ్‌సాగర్‌రావుకు ప్రధాన అనుచరుడు. 2009 ఎన్నికల్లో కొక్కిరాల సహకారంతో సక్కు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజా ఎన్నికల్లోనూ ఆయన అండతోనే గెలిచి ఉమ్మడి జిల్లాలోనే పార్టీకి ఏకైక స్థానాన్ని అందించారు. పార్టీ తమను డీసీసీ అధ్యక్షులుగా నియమించడంపై నలుగురూ హర్షం వ్యక్తం చేశారు. తమ జిల్లాల్లో క్షేత్రస్థాయి నుంచి పార్టీకి పూర్వవైభవంగా తీసుకువస్తామని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. భార్గవ్ దేశ్‌పాండే ఇది వరకు చేపట్టిన పదవులు ఆదిలాబాద్‌అర్బన్: భార్గవ్ దేశ్‌పాండే 2006 నుంచి 2008 వరకు దాదాపు రెండేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం ఏఐసీసీ సభ్యులుగా, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగారు. 2014లో ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీపీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాతకు ఎమ్మెల్యే టికెట్ దక్కడంతో పార్టీని గెలిపించుకునేందుకు భార్గవ్ దగ్గరుండి సేవలందించారు. -
31 జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం
-
కాంగ్రెస్‌కు నయా జోష్
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత డీలా పడిన రాష్ట్ర కాంగ్రెస్‌లో జోష్ నింపేందుకు పార్టీ అధిష్టానం అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. పార్టీలో ‘కొత్త రక్తాన్ని’ ఎక్కించడంతోపాటు సామాజిక సమ తౌల్యత పాటిస్తూ 31 డీసీసీలకు అధ్యక్షులను నియమించింది. ఇందులో ప్రస్తుతం డీసీసీ అధ్య క్షులుగా ఉన్న వారిలో నలుగురికే అవకాశం ఇవ్వగా మిగిలిన అన్ని జిల్లాల్లో కొత్త వారినే నియమించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు. సామాజిక వర్గాలవారీగా పరిశీలిస్తే 12 జిల్లాలకు బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలను, మరో 10 జిల్లాలకు రెడ్డి సామాజికవర్గ నేతలకు అవకాశ మిచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి రెండు జిల్లాల చొప్పున అధ్యక్ష పదవులు కేటాయించారు. బ్రాహ్మణ, వెలమ, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురు నేతలను కూడా డీసీసీ అధ్యక్షులుగా నియమించారు. మొత్తం మీద 3 జిల్లాలకు మహిళలను డీసీసీ అధ్యక్షులుగా ప్రకటించగా, అందులో ఇద్దరు ఎమ్మెల్యేల భార్యలు, ఒక మాజీ ఎమ్మెల్సీ సతీమణి ఉన్నారు. ఎమ్మెల్యేలుగా ప్రస్తుతం ఎన్నికయిన సీనియర్లు, యువ శాసనసభ్యులకు, మాజీ ఎమ్మెల్సీలకు, మాజీ డీసీసీ అధ్యక్షులకు కూడా అవకాశమమిచ్చారు. హైదరాబాద్ సిటీకి అంజన్ కొనసాగింపు... కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా అంజన్‌కుమార్ యాదవ్‌ను కొనసాగించిన అధిష్టానం ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మైనారిటీ నేత జావేద్‌ను నియమించింది. ఖమ్మం రూరల్ జిల్లాకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ దుర్గాప్రసాద్, నాగెండ్ల దీపక్చౌదరిలను అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిం చారు. ఇటీవలే ప్రకటించిన ములుగు, నారాయణ పేట జిల్లాలకు మాత్రం అధ్యక్షులను నియమించ లేదు. మహిళా నేతలు గండ్ర జ్యోతి (జయశంకర్ భూపాలపల్లి), కొక్కిరాల సురేఖ (మంచిర్యాల), నిర్మలాగౌడ్ (సంగారెడ్డి)లకు డీసీసీ అధ్యక్షులుగా అవకాశమిచ్చారు. ఇక ఎమ్మెల్యేలుగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు (భద్రాద్రి కొత్తగూడెం), పైలట్ రోహిత్‌రెడ్డి (వికారాబాద్)లను కూడా డీసీసీ అధ్యక్షులుగా నియమించారు. రంగారెడ్డి జిల్లాకు సబితా ఇంద్రారెడ్డి ప్రతిపాదించిన నర్సింహారెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించి వికారాబాద్‌కు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి సన్నిహితుడు రోహిత్‌రెడ్డికి అవకాశమిచ్చారు. నల్లగొండ జిల్లాకు అనూహ్యంగా లంబాడా సామాజిక వర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ కె. శంకర్ నాయక్‌ను నియమించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన టి.నర్సారెడ్డిని సిద్దిపేట జిల్లాకు అధ్యక్షుడిగా నియమించడం గమనార్హం. కొత్త డీసీసీలు వీరే... భార్గవ్ దేశ్‌పాండే–ఆదిలాబాద్ కొక్కిరాల సురేఖ–మంచిర్యాల రామారావు పటేల్ పవార్–నిర్మల్ ఆత్రం సక్కు–కొమరమ్ భీమ్ ఆసిఫాబాద్ కె. మృత్యుంజయం–కరీంనగర్ ఎ. లక్ష్మణ్‌కుమార్–జగిత్యాల ఈర్ల కొమురయ్య–పెద్దపల్లి ఎన్. సత్యనారాయణ గౌడ్–రాజన్న సిరిసిల్ల ఎం. మోహన్‌రెడ్డి–నిజామాబాద్ కైలాష్ శ్రీనివాస్‌రావు–కామారెడ్డి నాయిని రాజేందర్‌రెడ్డి–వరంగల్ అర్బన్ అండ్ రూరల్ గండ్ర జ్యోతి–జయశంకర్ భూపాలపల్లి జంగా రాఘవరెడ్డి–జనగామ నిర్మలా గౌడ్–సంగారెడ్డి తిరుపతిరెడ్డి–మెదక్ టి.నర్సారెడ్డి–సిద్దిపేట పి.రోహిత్‌రెడ్డి–వికారాబాద్ కూన శ్రీశైలం గౌడ్–మేడ్చల్ మల్కాజిగిరి చల్లా నరసింహారెడ్డి–రంగారెడ్డి ఒబేదుల్లా కొత్వాల్–మహబూబ్‌నగర్ శంకర్ ప్రసాద్–వనపర్తి పటేల్ ప్రభాకర్‌రెడ్డి–జోగులాంబ గద్వాల డాక్టర్ సి.హెచ్.వంశీకృష్ణ–నాగర్ కర్నూలు సి.హెచ్.వెంకన్న యాదవ్–సూర్యాపేట బి.భిక్షమయ్య గౌడ్–యాదాద్రి భువనగిరి జె.భరత్ చంద్రా రెడ్డి–మహబూబాబాద్ కె.శంకర్ నాయక్–నల్లగొండ వనమా వెంకటేశ్వరరావు–భద్రాద్రి కొత్తగూడెం పువ్వాడ దుర్గాప్రసాద్–ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు వీరే... గ్రేటర్ హైదరాబాద్–ఎం.అంజన్‌కుమార్ యాదవ్ వరంగల్ సిటీ–కేదారి శ్రీనివాసరావు (కట్ల) నిజామాబాద్ సిటీ–కేశ వేణు ఖమ్మం సిటీ–జావీద్ వీరితోపాటు ఖమ్మం సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్. దీపక్ చౌదరిని నియమించారు. -
‘ఉమ్మడి’గానే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాల పునర్విభజనతో సుమారు ఏడాదిన్నర క్రితం ఉమ్మడి మెదక్ జిల్లా మూడు కొత్త జిల్లాలుగా విడిపోయింది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలు ఏర్పాటైనా ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేటికీ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే పార్టీ రాజకీయాలు నడుపుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు టీఆర్ఎస్, కాంగ్రెస్ కొత్త కార్యవర్గాలను ఏర్పాటు చేస్తాయనే ఊహాగానాలు కొంత కాలంగా వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు, కార్యవర్గంపై టీఆర్ఎస్ కసరత్తు పూర్తి చేసినా, చివరి నిమిషంలో ఆలోచన విరమించుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నర్సాపూర్‌కు చెందిన మురళీ యాదవ్ వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ కూడా కొత్త జిల్లాల వారీగా అధ్యక్షులు, కార్యవర్గాలను ప్రకటిస్తుందనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. కొత్త జిల్లాలకు కార్యవర్గాన్ని ప్రకటించడంపై టీపీసీసీ ఒకటి రెండు దఫాలు జిల్లా కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ కూడా జరిపింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ కొత్త జిల్లాలకు కార్యవర్గ ఏర్పాటుపై జరిపిన అభిప్రాయ సేకరణలో మిశ్రమ స్పందన వ్యక్తమైనట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన డీసీసీ అధ్యక్షులను ప్రకటించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా మరోమారు కొనసాగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఓటమి తర్వాత సునీతదే భారం 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో కేవలం జహీరాబాద్, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపుతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2014 ఆగస్టులో జరిగిన మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి సునీతా రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చివరి నిమిషంలో బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాష్ట్ర పునర్విభజ , సాధారణ ఎన్నికల్లో ఓటమి తదితర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి 2014 అక్టోబర్‌లో డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, నర్సాపూర్ మినహా మిగతా చోట్ల పార్టీకి చెప్పుకోదగిన స్థాయిలో కేడర్ లేని పరిస్థితి. కొన్ని చోట్ల బలహీన బహుళ నాయకత్వం ఉండడంతో నేతల నడుమ విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో మూడున్నరేళ్లుగా సునీతా లక్ష్మారెడ్డి పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ వస్తున్నారు. గ్రూపు తగాదాలు, విభేదాలకు దూరంగా ఉండడం, వివాదాలకు అతీతంగా ఉండడంతో సునీత నాయకత్వంపై పెద్దగా ఫిర్యాదులు కూడా లేవు. తన అసెంబ్లీ నియోజకవకర్గం నర్సాపూర్‌కే పరిమితమవుతూ.. జిల్లా కేంద్రం సంగారెడ్డితో పాటు ఇతర చోట్ల స్థానిక నేతల ఆహ్వానిస్తేనే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల ఏడాదిలో పగ్గాలు త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనుండడం, వచ్చే ఏడాది ఆరంభంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో సునీతా లక్ష్మారెడ్డిని మరోమారు డీసీసీ అధ్యక్షురాలిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, ముత్యంరెడ్డి మినహా సునీత కంటే సీనియర్ నేతలెవరూ లేరు. మెదక్, పటాన్చెరు, దుబ్బాక, సిద్దిపేట, నారాయణఖేడ్‌లో బహుళ నాయకత్వం ఉన్నా, నేతలందరూ నియోజకవర్గానికే పరిమితం అవుతూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో కలుపుగోలు వ్యక్తిగా పేరున్న సునీత లక్ష్మారెడ్డికి బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయవచ్చనే ఆలోచనతో అధిష్టానం మరోమారు డీసీసీ పీఠాన్ని అప్పగించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఏడాదిలో అప్పగించిన బాధ్యతను సునీత లక్ష్మారెడ్డి ఎంత మేర నెరవేరుస్తారనే అంశంపై అటు కాంగ్రెస్‌లో, ఇటు బయటా ఆసక్తి నెలకొంది. -
‘పీఠ’ముడి వీడేనా..?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: డీసీసీ అధ్యక్షుడి నియామకం వ్యవహారంపై మరోసారి పీటముడి పడింది. వర్గాలుగా ఉన్న జిల్లా కాంగ్రెస్‌లో అధ్యక్షుడి నియామకంపై కొరవడిన ఏకాభిప్రాయం దీనికి కారణమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు అధ్యక్షులను, నగర పార్టీ అధ్యక్షులను నియమించింది. అయితే ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు కారణంగా చివరి నిమిషంలో జిల్లా అధ్యక్షుడి నియామకం వాయిదా పడినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అన్ని జిల్లాల్లో జిల్లా అధ్యక్షులను నియమించి.. పూర్తిస్థాయి కమిటీలను వేయాలని డిమాండ్ రావడం, అందుకు అనుకూలంగా అధిష్టానం అధ్యక్షులను నియమించగా.. ఖమ్మం జిల్లాలోని కొందరు కాంగ్రెస్ వర్గ నేతలు అధ్యక్షుడి నియామకం కన్నా.. సమన్వయ కమిటీ ఏర్పాటు మిన్న అనే రీతిలో అధిష్టానానికి సంకేతాలు ఇచ్చారు. దీంతో జిల్లాలో పూర్తిస్థాయి అధ్యక్షుడి నియామకం ఇప్పట్లో జరిగే అవకాశం లేదన్న వాదన ఆ పార్టీ కార్యకర్తల్లో బలంగా వినిపిస్తోంది. పార్టీ జిల్లా నేతలు ఏకాభిప్రాయానికి రాని పక్షంలో అధిష్టానం నిర్ణయాన్ని జిల్లా నేతలు శిరసా వహించాల్సి ఉంటుందని, తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుందని కాంగ్రెస్‌లోని కీలక నేతలు సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం. దీంతో డీసీసీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి అధిష్టానంలోని ముఖ్య నేతల్లో సైతం పార్టీ నేతల వైఖరిపై కొంత అసహనం వ్యక్తమైనట్లు ప్రచారం జరుగుతోంది. డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తూ.. అనారోగ్యంతో ఇటీవల మరణించిన అయితం సత్యం స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించడం కోసం రెండు నెలలుగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. విభేదాలతో వాయిదా.. కాంగ్రెస్‌లోని అన్ని వర్గాల నేతల మధ్య సయోధ్య కుదర్చడం ద్వారా ఏకాభిప్రాయం సాధించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరోవైపు పంచాయతీ ఎన్నికలతో సహా అన్ని ఎన్నికలకు సమయం ఆసన్నం కావడం, ఈ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పార్టీపరంగా పెద్ద దిక్కుగా వ్యవహరించి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సత్తాను చాటిచెప్పగలిగే శక్తియుక్తులు కలిగిన నేత కోసం అన్వేషించిన పార్టీ జిల్లాలో నెలకొన్న వర్గ విభేదాల కారణంగా అధ్యక్షుడిని ఖరారు చేసే ప్రక్రియ వాయిదా వేస్తూ వచ్చింది. జిల్లా కాంగ్రెస్‌లో కీలక నేతలుగా ఉన్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావుల మధ్య జిల్లా అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. దీంతో అధ్యక్ష పదవిని సామాజికపరంగా ఏ వర్గానికి కట్టబెడితే పార్టీకి ఏ రకమైన ప్రయోజనం కలుగుతుందన్న అంశాన్ని పార్టీ అధిష్టానం సునిశితంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక దశలో దళిత వర్గానికి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్‌కు డీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని పార్టీలో వచ్చిన ప్రతిపాదన దాదాపు కార్యరూపం దాలుస్తున్న క్రమంలోనే జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నేతలు దీనికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన నియామకానికి బ్రేక్ పడినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎవరి ప్రయత్నాలు వారివే.. అయితం సత్యం మృతిచెందడంతో డీసీసీ అధ్యక్ష పదవిని అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇచ్చే అవకాశం ఉందని తొలుత ప్రచారం జరగడంతో జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, దిరిశాల భద్రయ్య, కార్పొరేటర్ నాగండ్ల దీపక్‌చౌదరి, మానుకొండ రాధాకిషోర్, అలాగే పౌరసరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి తదితరులు తమతమ నేతల ద్వారా తీవ్రస్థాయిలోనే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సామాజిక కూర్పులో డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలన్న అంశంపై అధిష్టానం నిర్ణయం అధికారికంగా వెల్లడి కాకపోవడంతో ఈ పదవిపై బీసీ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది నేతలు దృష్టి సారించి తమకున్న పరిచయాల ద్వారా పీఠాన్ని సాధించేందుకు ప్రయత్నాలు సాగించారు. ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత యడవల్లి కృష్ణ, ఖమ్మం జిల్లాకు చెందిన ఐఎన్టీయూసీ నాయకుడు కొత్తా సీతారాములు, కార్పొరేటర్ వడ్డెబోయిన నర్సింహారావు, కట్ల రంగారావు, శ్రీనివాస్‌యాదవ్ తదితరులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఉన్న గిరిజనులకు పార్టీలో ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజన వర్గానికి చెందిన పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తూ తనవంతు ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేశారు. అయితే పంచాయతీ ఎన్నికల తరుణం ముంచుకొస్తుండటంతో డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం పార్టీ వర్గాలకు కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. దీంతో అధ్యక్షుడి నియామకం ఇప్పటికిప్పుడు సాధ్యంకాని పక్షంలో అన్ని వర్గాలను కలుపుకుని.. పార్టీని బలోపేతం చేసే విధంగా ఒక సమన్వయ కమిటీ వేయాలని అధిష్టానం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సమన్వయ కమిటీ సభ్యులను సమన్వయం చేయడం కోసం రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న ఇతర జిల్లాలకు చెందిన మాజీ మంత్రి స్థాయి నేతను సమన్వయకర్తగా నియమించే అంశంపై పార్టీ కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పించడం ద్వారా పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని భావిస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించుకుంటే సబబుగా ఉంటుందని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. -
డీసీసీ అధ్యక్షుల నియామకాలపై కసరత్తు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకంపై కసరత్తు జరుగుతోందని, నిర్ణయం ప్రకటించడానికి కొంత సమయం పట్టొచ్చని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో తనను కలసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల తర్వాతనే డీసీసీ అధ్యక్షుల నియామకంపై కసరత్తు పూర్తవుతుందని చెప్పారు. ఆయా జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలు, సీనియర్లు, నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలిగే నాయకులతో చర్చలు జరుగుతున్నాయన్నారు. అన్నివర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. పాత జిల్లాల్లో పనిచేసిన వారు కోరుకుంటే వారి స్థానిక జిల్లా బాధ్యతలను అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా ఉత్తమ్ చెప్పారు. డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన సీనియర్లను, ముఖ్యనేతలను కొందరిని టీపీసీసీ సమన్వయ సంఘానికి తీసుకుంటామన్నారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘాన్ని కూడా పునర్వ్యవస్థీకరించనున్నట్టుగా చెప్పారు.