సాక్షిప్రతినిధి, ఖమ్మం: డీసీసీ అధ్యక్షుడి నియామకం వ్యవహారంపై మరోసారి పీటముడి పడింది. వర్గాలుగా ఉన్న జిల్లా కాంగ్రెస్‌లో అధ్యక్షుడి నియామకంపై కొరవడిన ఏకాభిప్రాయం దీనికి కారణమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు అధ్యక్షులను, నగర పార్టీ అధ్యక్షులను నియమించింది. అయితే ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు కారణంగా చివరి నిమిషంలో జిల్లా అధ్యక్షుడి నియామకం వాయిదా పడినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అన్ని జిల్లాల్లో జిల్లా అధ్యక్షులను నియమించి.. పూర్తిస్థాయి కమిటీలను వేయాలని డిమాండ్ రావడం, అందుకు అనుకూలంగా అధిష్టానం అధ్యక్షులను నియమించగా.. ఖమ్మం జిల్లాలోని కొందరు కాంగ్రెస్ వర్గ నేతలు అధ్యక్షుడి నియామకం కన్నా.. సమన్వయ కమిటీ ఏర్పాటు మిన్న అనే రీతిలో అధిష్టానానికి సంకేతాలు ఇచ్చారు. దీంతో జిల్లాలో పూర్తిస్థాయి అధ్యక్షుడి నియామకం ఇప్పట్లో జరిగే అవకాశం లేదన్న వాదన ఆ పార్టీ కార్యకర్తల్లో బలంగా వినిపిస్తోంది.
పార్టీ జిల్లా నేతలు ఏకాభిప్రాయానికి రాని పక్షంలో అధిష్టానం నిర్ణయాన్ని జిల్లా నేతలు శిరసా వహించాల్సి ఉంటుందని, తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుందని కాంగ్రెస్‌లోని కీలక నేతలు సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం. దీంతో డీసీసీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి అధిష్టానంలోని ముఖ్య నేతల్లో సైతం పార్టీ నేతల వైఖరిపై కొంత అసహనం వ్యక్తమైనట్లు ప్రచారం జరుగుతోంది. డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తూ.. అనారోగ్యంతో ఇటీవల మరణించిన అయితం సత్యం స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించడం కోసం రెండు నెలలుగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది.
విభేదాలతో వాయిదా..
కాంగ్రెస్‌లోని అన్ని వర్గాల నేతల మధ్య సయోధ్య కుదర్చడం ద్వారా ఏకాభిప్రాయం సాధించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరోవైపు పంచాయతీ ఎన్నికలతో సహా అన్ని ఎన్నికలకు సమయం ఆసన్నం కావడం, ఈ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పార్టీపరంగా పెద్ద దిక్కుగా వ్యవహరించి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సత్తాను చాటిచెప్పగలిగే శక్తియుక్తులు కలిగిన నేత కోసం అన్వేషించిన పార్టీ జిల్లాలో నెలకొన్న వర్గ విభేదాల కారణంగా అధ్యక్షుడిని ఖరారు చేసే ప్రక్రియ వాయిదా వేస్తూ వచ్చింది. జిల్లా కాంగ్రెస్‌లో కీలక నేతలుగా ఉన్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావుల మధ్య జిల్లా అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు.
దీంతో అధ్యక్ష పదవిని సామాజికపరంగా ఏ వర్గానికి కట్టబెడితే పార్టీకి ఏ రకమైన ప్రయోజనం కలుగుతుందన్న అంశాన్ని పార్టీ అధిష్టానం సునిశితంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక దశలో దళిత వర్గానికి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్‌కు డీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని పార్టీలో వచ్చిన ప్రతిపాదన దాదాపు కార్యరూపం దాలుస్తున్న క్రమంలోనే జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నేతలు దీనికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన నియామకానికి బ్రేక్ పడినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఎవరి ప్రయత్నాలు వారివే..
అయితం సత్యం మృతిచెందడంతో డీసీసీ అధ్యక్ష పదవిని అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇచ్చే అవకాశం ఉందని తొలుత ప్రచారం జరగడంతో జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, దిరిశాల భద్రయ్య, కార్పొరేటర్ నాగండ్ల దీపక్‌చౌదరి, మానుకొండ రాధాకిషోర్, అలాగే పౌరసరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి తదితరులు తమతమ నేతల ద్వారా తీవ్రస్థాయిలోనే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే సామాజిక కూర్పులో డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలన్న అంశంపై అధిష్టానం నిర్ణయం అధికారికంగా వెల్లడి కాకపోవడంతో ఈ పదవిపై బీసీ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది నేతలు దృష్టి సారించి తమకున్న పరిచయాల ద్వారా పీఠాన్ని సాధించేందుకు ప్రయత్నాలు సాగించారు. ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత యడవల్లి కృష్ణ, ఖమ్మం జిల్లాకు చెందిన ఐఎన్‌టీయూసీ నాయకుడు కొత్తా సీతారాములు, కార్పొరేటర్ వడ్డెబోయిన నర్సింహారావు, కట్ల రంగారావు, శ్రీనివాస్‌యాదవ్ తదితరులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఉన్న గిరిజనులకు పార్టీలో ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజన వర్గానికి చెందిన పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తూ తనవంతు ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేశారు.
అయితే పంచాయతీ ఎన్నికల తరుణం ముంచుకొస్తుండటంతో డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం పార్టీ వర్గాలకు కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. దీంతో అధ్యక్షుడి నియామకం ఇప్పటికిప్పుడు సాధ్యంకాని పక్షంలో అన్ని వర్గాలను కలుపుకుని.. పార్టీని బలోపేతం చేసే విధంగా ఒక సమన్వయ కమిటీ వేయాలని అధిష్టానం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సమన్వయ కమిటీ సభ్యులను సమన్వయం చేయడం కోసం రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న ఇతర జిల్లాలకు చెందిన మాజీ మంత్రి స్థాయి నేతను సమన్వయకర్తగా నియమించే అంశంపై పార్టీ కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పించడం ద్వారా పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని భావిస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించుకుంటే సబబుగా ఉంటుందని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment