కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకంపై కసరత్తు జరుగుతోందని, నిర్ణయం ప్రకటించడానికి కొంత సమయం పట్టొచ్చని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకంపై కసరత్తు జరుగుతోందని, నిర్ణయం ప్రకటించడానికి కొంత సమయం పట్టొచ్చని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో తనను కలసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల తర్వాతనే డీసీసీ అధ్యక్షుల నియామకంపై కసరత్తు పూర్తవుతుందని చెప్పారు.
ఆయా జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలు, సీనియర్లు, నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలిగే నాయకులతో చర్చలు జరుగుతున్నాయన్నారు. అన్నివర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. పాత జిల్లాల్లో పనిచేసిన వారు కోరుకుంటే వారి స్థానిక జిల్లా బాధ్యతలను అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా ఉత్తమ్ చెప్పారు. డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన సీనియర్లను, ముఖ్యనేతలను కొందరిని టీపీసీసీ సమన్వయ సంఘానికి తీసుకుంటామన్నారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘాన్ని కూడా పునర్వ్యవస్థీకరించనున్నట్టుగా చెప్పారు.