ఈర్ల కొమురయ్య, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సత్యనారాయణగౌడ్
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సారథులను ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన హైకమాండ్ ఒక ఓసీ, ఇద్దరు బీసీలు, ఒక దళిత నేతకు పార్టీ పగ్గాలు అప్పగించింది. ఉమ్మడి జిల్లాకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న కటకం మృత్యుంజయంకు కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను జగిత్యాల డీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎన్.సత్యనారాయణగౌడ్, పెద్దపల్లికి ఈర్ల కొంరయ్య డీసీసీ అధ్యక్షులుగా నియమితులయ్యారు.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంతో పాటు రానున్న లోక్‌సభ ఎన్నికలకు శ్రేణుల్ని సంసిద్ధం చేసేందుకు ఈ కమిటీలు పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించింది. కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తున్న ప్రక్రియను ఆ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు కొలిక్కి తెచ్చింది. మూడురోజుల క్రితం పార్టీ రాష్ట్రస్థాయి నేతలు ఢిల్లీలో సమావేశం కా వడం.. వీలైనంత తొందరగా జిల్లా సారథులను నియమించాలని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ ఆదేశిం చడం.. ఈ క్రమంలోనే గురువారం జిల్లాలకు సారథుల నియమిస్తూ ఉత్తర్వులు వెలువడడం చర్చనీయంగా మారింది.
పోటాపోటీగా ప్రయత్నాలు.. చివరికు కమిటీలపై ప్రకటన
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగానే పార్టీ సారథి ఇప్పటివరకు కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. కొత్తగా తెరపైకి వచ్చిన ఈ పదవిని అందుకునేందుకు కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి పలువురు ఆశావహ నాయకులు పోటీపోటీగా ప్రయత్నాలు చేశారు. ఇంకొంతమంది మాత్రం ఈ పదవి తమకు ససేమిరా వద్దనే విషయాన్ని బాహాటంగానే పార్టీ ముఖ్య నాయకులకు వినిపించారు. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాల పరిధిలో ఇదివరకు ఉన్న ఉమ్మడి జిల్లా అధ్యక్షుడితోపాటు పలువురి పేర్లు వినిపించాయి. సుమారు 22 మంది వరకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ప్యాట రమేష్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, శంకర్, మేడిపల్లి సత్యం, మత్యుంజయం, గందె మాధవి తదితరులు ఆసక్తి చూపారు. పెద్దపల్లి జిల్లాలో ఈర్ల కొమురయ్య, ధర్మయ్యతోపాటు ఇంకొందరి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి.
జగిత్యాలలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎం.రవీందర్‌తోపాటు ఇంకొకరిద్దరి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. రాజన్నజిల్లాలో సంగీతం శ్రీనివాస్, సత్యనారాయణగౌడ్ సహా ఐదుగురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీమంత్రులు, మాజీ ఎంపీల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న అధిష్టానం ఎట్టకేలకు ఆయా జిల్లాలకు సారథులను ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్.సత్యనారాయణగౌడ్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా అడ్లూరు లక్ష్మణకుమార్ నియామకంపై అంతగా వ్యతిరేకత లేనప్పటికీ.. పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడి నియామకంపై సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ తదితరులు స్పందిస్తూ.. అధిస్టానంతో వద్ద చెవులు కొరికినవారు, లాబీయింగ్ చేసిన వారికే పదవి దక్కిందని వ్యాఖ్యానించారు. కరీంనగర్ నుంచి కూడా పలువురు పోటీ పడినా మృత్యుంజయంకే ఇచ్చారని కొందరు వాపోయారు.
డీసీసీ సారథుల ఎన్నిక వెనుక సీనియర్లే కీలకం.. పార్లమెంట్, ‘స్థానిక’ ఎన్నికల నేపథ్యంలోనే కమిటీలు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు పొన్నం ప్రభాకర్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఆరెపల్లి మోహన్ పార్టీ ప్రకటించిన ఆయా కమిటీల్లో కీలక పదవుల్లో ఉన్నారు. వీరితోపాటు విజయరమణారావు, కేకే.మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీనర్సింహారావు, మక్కాన్‌సింగ్, జువ్వా డి నర్సింగరావు తదితరులు రాష్ట్రస్థాయిలో కీలక నాయకులుగా ఉమ్మడి జిల్లానుంచి ఉన్నారు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారదతోపాటు యువజన కాంగ్రెస్ విభాగం రాష్ట్ర నాయకులు బల్మూరి వెంకట్ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారవడంతో డీసీసీ అధ్యక్షుల నియామకంలో ఈ ముఖ్యనాయకుల అభిప్రాయాల్ని కూడా పార్టీ పరిగణనలోకి తీసుకున్నారంటున్నారు.
మొత్తంగా కొత్త నాయకత్వంతో సరికొత్త జవసత్వాల్ని పార్టీలో నింపాలనే దిశగా హస్తం పార్టీ అధినాయకత్వం వ్యవహరించిందని.. ఇందుకోసం ఆచితూచి అడుగులేస్తూ.. ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టిందని ఆ పార్టీ సీనియర్‌లు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థులు ఇప్పుడిప్పుడే తేరుకుంటుండటం.. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేలా చర్యల్ని చేపట్టాల్సి ఉండటంతో కొత్త అధ్యక్షుడిపై అంచనాలు అధికంగానే ఉండనున్నాయి.
ఇంకా ఐదేళ్లపాటు సొంత ఖర్చులతో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేలా కార్యక్రమాల్ని చేపట్టడం.. అన్నివర్గాల నాయకులతో సమన్వయంగా వ్యవహరించడం డీసీసీ కుర్చీలో ఉన్న నేతకు అనివార్యం కానుంది. అటు రాష్ట్రస్థాయి నాయకులతోపాటు ఇటు జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలకు భరోసా ఇచ్చేలా పదవికి న్యాయం చేయాల్సి ఉండగా.. పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ కమిటీలు వేయడం పార్టీలో కొత్త చర్చకు తెరతీసింది. కాగా ముందున్న పార్లమెంట్, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కొత్త సారథులు ఆ పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారనేది వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment