నేడో రేపో కాంగ్రెస్‌ జాబితా | Congress Alliance MLA Candidate List Ready Medak | Sakshi
Sakshi News home page

నేడో రేపో కాంగ్రెస్‌ జాబితా

Published Thu, Nov 1 2018 12:15 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Alliance MLA Candidate List Ready Medak - Sakshi

అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను నేడో రేపో విడుదల చేసేందుకు కాంగ్రెస్‌  సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి జాబితాలో ఐదు లేదా ఆరుగురు అభ్యర్థుల పేర్లుండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహా కూటమిలోని భాగస్వామ్య పార్టీల నడుమ పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్యపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. ప్రస్తుతానికి నాలుగు అసెంబ్లీ స్థానాలపై మహా కూటమి పార్టీల నడుమ పీటముడి పడినట్లు సమాచారం.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమవుతోంది. గురు లేదా శుక్రవారం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. మహా కూటమి భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ నడుమ పోటీ చేయాల్సిన స్థానాల సంఖ్యపై స్పష్టమైన అవగాహన కుదిరినట్లు తెలిసింది. ఏయే స్థానాల్లో ఏయే పార్టీలు తమ అభ్యర్థులను నిలపాలనే అంశంపై ఇంకా మంతనాలు కొనసాగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాల లెక్కలు కూడా అత్యంత కీలకంగా మారాయి. ఉమ్మడి మెదక్జిల్లా పరిధిలో 11 అసెంబ్లీ స్థానాలకు గాను, మహా కూటమి భాగస్వామ్య పార్టీల నడుమ నాలుగు అసెంబ్లీ స్థానాలపై పీటముడి పడింది.

పటాన్‌చెరు అసెంబ్లీ స్థానాన్ని తమకు కేటాయించాల్సిందిగా టీడీపీ గట్టిగా పట్టుపడుతోంది. దుబ్బాక లేదా మెదక్‌ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాల్సిందిగా తెలంగాణ జన సమితి మహాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తోంది. మరోవైపు హుస్నాబాద్‌ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని సీపీఐ తెగేసి చెప్తోంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ తొలి విడత జాబితాలో ఈ నాలుగు అసెంబ్లీ స్థానాలకు చోటు దక్కే అవకాశం లేదు. మరోవైపు టికెట్ల కోసం పార్టీలో అంతర్గత పోటీ నెలకొన్న సిద్దిపేట, నారాయణఖేడ్‌ అభ్యర్థుల పేర్లు కాంగ్రెస్‌ తొలి విడత జాబితాలో ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఐదు లేదా ఆరు స్థానాల్లోనే..
సీట్ల సర్దుబాటులో కూటమి భాగస్వామ్య పక్షాలు గట్టిగా పట్టుబట్టని ఐదు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో కచ్చితంగా ఉండనున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (అందోలు) జె.గీతారెడ్డి (జహీరాబాద్‌), సునీత లక్ష్మారెడ్డి (నర్సాపూర్‌), తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (సంగారెడ్డి) ఒంటేరు ప్రతాప్‌రెడ్డి (గజ్వేల్‌) అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వ్యక్తం కావడంతో తొలి జాబితాలో వీరికి చోటు దక్కనుంది. హుస్నాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని కూటమి భాగస్వామ్య పక్షం సీపీఐ బలంగా కోరుతున్నా, కాంగ్రెస్‌ మాత్రం అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అభ్యర్థిత్వంవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తాము బలంగా ఉన్న హుస్నాబాద్‌ స్థానాన్ని కేటాయించలేమంటూ సీపీఐకి తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మా జీ కౌన్సిలర్‌ దరపల్లి చంద్రంకు సిద్దిపేట టికెట్‌ దాదాపు ఖాయమైనా, తొలి జాబితాలో ఆయనకు చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు.

సామాజికవర్గాల లెక్కలే కీలకం
మహా కూటమిలో పీటముడి ఏర్పడిన దుబ్బాక, మెదక్, పటాన్‌చెరు స్థానాలు ఏ పార్టీ ఖాతాలోకి వెళ్తాయనే అంశంపై ఆధారపడి, నారాయణఖేడ్, సిద్దిపేట నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల పేర్లపై స్పష్టత రానుంది. కూటమి భాగస్వామ్య పక్షాల్లో సామాజికవర్గాల లెక్కలు కూడా సీట్ల సర్దుబాటుకు ప్రధాన అవరోధంగా మారాయి. పటాన్‌చెరు స్థానాన్ని కాంగ్రెస్‌ లేదా టీడీపీ బీసీ అభ్యర్థికి కేటాయించే పక్షంలో నారాయణఖేడ్‌లో రెడ్డి సామాజికవర్గం అభ్యర్థికి టికెట్‌ కేటాయింపు అవకాశాలు మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. దుబ్బాకలో టీజేఎస్‌ బీసీ అభ్యర్థికి టికెట్‌ ఇచ్చే పక్షంలో మెదక్‌లో కాంగ్రెస్‌ నుంచి రెడ్డి సామాజికవర్గం అభ్యర్థి అవకాశాలు మెరగవుతాయనే లెక్కలతో ఆయా పార్టీల ఔత్సాహిక నేతల్లో గందరగోళం నెలకొంది.

ఎక్కే మెట్టు.. దిగే మెట్టు
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం ఉన్న ఐదుగురు నియోజకవర్గాలు మినహా మిగతా స్థానాలకు సంబంధించి టికెట్‌ ఆశిస్తున్న నేతలు హైదరాబాద్‌లో మకాం వేశారు. తమ అసెంబ్లీ సీటును కాంగ్రెస్‌కు కేటాయించే స్థానాల్లో టికెట్‌ ఇవ్వాలంటూ ఔత్సాహికులు గాంధీభవన్‌ చుట్టూ తిరుగుతున్నారు. పటాన్‌చెరు స్థానం టీడీపీకి కేటాయించే పక్షంలో తమకే అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్‌ గౌడ్‌ ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ప్రయత్నాలు సాగిస్తున్నారు. సిద్దిపేట, దుబ్బాక, మెదక్, సంగారెడ్డికి చెందిన టీజేఎస్‌ నేతలు మాత్రం తమ సెగ్మెంటును పొత్తులో భాగంగా కోరడంతో పాటు, తమకే పోటీ అవకాశం ఇవ్వాలంటూ కోదండరాం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement