మాదంటే.. మాదే | Congress MLA Candidates First List Ready Rangareddy | Sakshi

మాదంటే.. మాదే

Nov 1 2018 12:06 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress MLA Candidates First List Ready Rangareddy - Sakshi

సాక్షి, మెదక్‌: మెదక్‌ అసెంబ్లీ సీటుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. మహాకూటమిలో భాగంగా మెదక్‌ సీటు ఎవరికి దక్కుతుందో ఇంకా ప్రకటించలేదు. రెండు రోజుల్లో మహాకూటమిలో చర్చలు కొలిక్కివస్తాయని తెలుస్తోంది. కూటమిలో చర్చలు తేలకముందే మెదక్‌ స్థానం మాకు దక్కింది.. మేమే పోటీ చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు, కాదు.. కాదు పొత్తులో భాగంగా టిక్కెట్‌ మాకు వచ్చింది మేమే పోటీ చేస్తామని టీజేఎస్‌ స్థానిక నాయకులు ప్రకటించుకుంటున్నారు. దీంతో మెదక్‌ నుంచి ఏ పార్టీ బరిలోకి దిగుతుందో తెలియక కాంగ్రెస్, టీజేఎస్‌ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. మెదక్‌ సీటు విషయమై రాష్ట్ర స్థాయిలో మాజీ ఎంపీ, స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఎట్టిపరిస్థితుల్లో మెదక్‌ను టీజేఎస్‌కు ఇవ్వవద్దని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం.

మరోవైపు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ సైతం మెదక్‌ స్థానం కోసం ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. మహాకూటమి పొత్తు విషయమై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. సీట్ల సర్దుబాటుపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చర్చించేందుకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఏసీ అధ్యక్షుడు కోదండరామ్‌ బుధవారం ఢిల్లీ పయనం అయ్యారు. గురు, శుక్రవారాల్లో సీట్ల సర్దుబాటుతోపాటు అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చెబుతున్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై నిర్ణయం వెలువడకముందే మెదక్‌ నియోజకవర్గంలోని టీజేఏఎస్‌ నాయకత్వం తమకు మెదక్‌ సీటు దక్కిందని చెబుతున్నారు. టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి మెదక్‌ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు.

పొత్తులో భాగంగా మెదక్‌ సీటు తమ పార్టీకి వచ్చిందని, తానే పోటీ చేయనున్నట్లు జనార్దన్‌రెడ్డి సొంత పార్టీ నాయకులకు రెండు రోజులుగా చెబుతున్నారు. కాంగ్రెస్‌ నాయకులకు సైతం తమకు మెదక్‌ స్థానం వచ్చినట్లు తెలియజేశారు. దీంతో మెదక్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఆశావహులు ఖంగుతిన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ శ్రేణులు సైతం అయోమయానికి గురయ్యాయి. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న భట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డి, బాలకృష్ణ తదితరులు మాజీ ఎంపీ విజయశాంతిని కలిసి తమ ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్‌ స్థానం ఎట్టిపరిస్థితుల్లో టీజేఎస్‌కు ఇవ్వవద్దని, కాంగ్రెస్‌ పోటీ చేసేలా చూడాలని విజయశాంతిని కోరారు.

మెదక్‌ స్థానం ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదని మాజీ ఎంపీ విజయశాంతి సైతం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ ఆశావహులు ఇదే విషయాన్ని నియోజకవర్గంలోని తమ నాయకులు, కార్యకర్తలకు తెలియజేస్తున్నారు. మెదక్‌ నుంచి ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని స్పష్టంగా చెబుతున్నారు. కాగా టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి మాత్రం సీటు తమదేనని, మెదక్‌ నుంచి తానే పోటీ చేస్తానని తెలిపారు. టీజేఎస్‌ ఉమ్మడి మెదక్‌ జిల్లాలో దుబ్బాక, మెదక్‌ అసెంబ్లీ స్థానాలు కోరిందని, రెండు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖత వ్యక్తి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్, టీజేఎస్‌ రెండు పార్టీల నేతలు ఎవరికి వారే తామే బరిలో దిగుతామని చెబుతుండటంతో మెదక్‌ స్థానంపై ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement