సాక్షి, మెదక్: ఎన్నికల్లో గెలుపు కోసం ఎమ్మెల్యే అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా విజయం కోసం పనిచేస్తున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి పోటాపోటీగా ప్రచారం సాగిస్తూనే వారి బంధువులను రంగంలోకి దించుతున్నారు. తమ సమీప బంధువులకు ఎన్నికల ప్రచారం, పర్యవేక్షణతో పాటు ఆర్థిక వ్యవహారాల బాధ్యతలను కట్టబెడుతున్నారు. అభ్యర్థుల బంధువులు సైతం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకర్గం నేతలను సమన్వయ పరుస్తూనే ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తెరవెనుక ఎన్నికల వ్యూహరచనను చేస్తూనే ఆర్థిక వ్యవహారాలను చక్కబెడుతున్నారు. బంధువుల రంగ ప్రవేశం పార్టీ నేతల్లోనూ ఉత్సాహాం నింపుతోంది.
అదే సమయంలో కొంతమంది బంధువులు పెత్తనం చెలాయిస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. మెదక్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ముందున్నారనే చెప్పవచ్చు. ఆమె కూడా తన సమీప బంధువులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆమె బంధువులు పదిరోజుల క్రితమే మెదక్‌కు చేరుకున్నారు. వీరంతా అక్కడే ఉంటూ ఎన్నికల ప్రచార బాధ్యతలు ఇతర వ్యవహారాలు చక్కబెడుతున్నారు. వారి బంధువులు వెంకట్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డితో పాటు పది మంది ఎన్నికల ప్రచార బాధ్యతలతోపాటు ఇతర విషయాలను పర్యవేక్షిస్తున్నారు. దేవేందర్‌రెడ్డి సోదరుడు చంద్రారెడ్డితోపాటు దగ్గరి చుట్టాలు సంజీవరెడ్డి, జగన్‌రెడ్డి తదితరులు పద్మాదేవేందర్‌రెడ్డి విజయం కోసం పని చేస్తున్నారు.
ఇదిలా ఉంటే పద్మాదేవేందర్‌రెడ్డి తనయుడు పునీత్‌రెడ్డి సైతం తన మిత్రులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆశావహులు శశిధర్‌రెడ్డి, బట్టి జగపతి, తిరుపతిరెడ్డి, బాలకృష్ణ తదితరులు ఎమ్మెల్యే టికెట్ దక్కితే తమ బంధువులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బట్టి జగపతి తనయుడు ఉదయ్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరాడు. యువజన కాంగ్రెస్ లో చురుగ్గా పాల్గొంటూ నియోజకవర్గంలోని యు వతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి బట్టి జగపతికి టికెట్ దక్కితే అన్నీ తానై వ్యవహరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూనే..
నర్సాపూర్ నియోజకవర్గంలోనూ బంధువులు సందడి చేస్తున్నారు. నర్సాపూర్ నియోకజవర్గంలోని సొంతపార్టీలోని నేతలే మదన్‌రెడ్డికి వ్యతిరేకంగా పావుల కదుపుతున్నారు. దీంతో అప్రమత్తమైన మదన్‌రెడ్డి తనకు నమ్మకస్తులైన చుట్టాలకు ఎన్నికల బాధ్యతలను అప్పజెప్పారు. దేవేందర్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి, అంజిరెడ్డి తదితరులు ప్రచార బాధ్యతలను చూస్తున్నారు. మదన్‌రెడ్డి విజయం కోసం అన్నీ తామై వ్యవహరిస్తూ తెరవెను యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. ఇది టీఆర్‌ఎస్‌లోని కొంత మంది నేతలకు మింగుడుపడటం లేదు.
కాంగ్రెస్ టికెట్ తనకు దాదాపుగా ఖాయం కావడంతో మాజీ మంత్రి సునీతారెడ్డి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. పార్టీ నేతలను కలుపుకుని ప్రచారం సాగిస్తూనే ఆమె కూడా బంధువులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. సునీతారెడ్డి మేనల్లుడు సంతోష్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. యువజన కాంగ్రెస్ నేతయిన సంతోష్‌రెడ్డి యువ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సునీతారెడ్డి బంధువులు శ్రీనాథ్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సైతం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను అంచనా వేస్తూ సునీతారెడ్డికి మద్దతు కూడట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటువారి బంధువుల విజయం కోసం పోటాపోటీగా పనిచేస్తున్నారు. బంధువుల రంగ ప్రవేశం సానుకూల ఫిలితాలను ఇస్తుందో? లేదో ? వేచి చూడాలి
Comments
Please login to add a commentAdd a comment